మిత్రలాభము ! (నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి )

మిత్రలాభము ! 

(నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి )

.

"ధనసాధనసంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలె స్వకార్యములు సాధించు కొందురు." అనిన రాజపుత్రులు విని "యే కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగా వినిపింపుఁ" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్పఁదొడంగె.

.

గోదావరీతీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కులనుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాఁడు వేకువ లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతునిఁ జూచి "వఱువాత లేచి వీని మొగము చూచితిని. నేడేమి కీడు రాఁగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువఁదగదు. జాగు చేయక యీచోటు విడిచిపోవలె"నని యత్నము సేయుచుండగా వాఁడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వల పన్ని పోయి చేరువ పొదలో దాఁగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుఁడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీఁది నూకలు చూచి తనతోడి కపోతములతో నిట్లనియె: "ఈ నిర్జన వనమందు నూకలురా నిమిత్తమేమి? మన మీ నూకల కాశ పడరాదు. తొల్లి యొక తెరువరి కంకణమున కాశపడి పులిచేతఁ దగులుకొని మృతి బొందెను. మీకా కథ చెప్పెద వినుండు!

.

పులి-కంకణము-బాటసారి

ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని గట్టుననుండి 'యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, 'యేదీ కంకణము చూపు'మని యడిగెను. పులి చేయిచాఁచి 'యిదిగో హేమ కంకణము చూడు'మని చూపెను. 'నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు'నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. 'ఓరీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము' అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి 'యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు' మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని - 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.

కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు." అని చెప్పఁగా విని,

యొక కపోతవృద్ధము నవ్వి యిట్లనియె -

"ఆ! యివి యేటి మాటలు? ఒక యిక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది, వినుండు. స్థానాస్థానములు వివేకింపక సర్వత్ర యిట్టి విచారమును పెట్టుకొనరాదు. కొఱమాలిన శంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా? మానుకొని యేలాగున బ్రతుకవచ్చును? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుఁడు, నిస్సంతోషి, క్రోధనుఁడు, నిత్యశంకితుఁడు, పర భాగ్యోపజీవియు నను వా రాఱుగురు దుఃఖభాగులని నీతికోవిదులు చెప్పుదురు." అనఁగా విని కపోతములన్నియు నేల వ్రాలెను.

గొప్ప శాస్త్రములు చదివి మిక్కిలి వినికిడి గలిగి పరుల సంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభమువల్ల వివేకము పోగొట్టుకొని క్లేశ పడియెదరు. ఆహా! లోభమెంత చెడుగుణము! అన్ని యిడుములకు లోభము కారణము.

.

(ఇంకావుంది.)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!