ఎన్నెమ్మ కధ.!

 ఎన్నెమ్మ కధ.!

.

ఒక మహనీయురాలి కథ ఆధారంగా మీకందిస్తున్నాను......

ఒక బ్రాహ్మణుడికి ఒక్కతే కూతురు. గారాబం జేత ఆ పిల్లకు రోజు ఒళ్లు నలచి తలంటు పోయించే వాడు ఆ అమ్మాయి తండ్రి. 

పెరట్లో పారేసిన ఆ నలుగు పిండి, పసుపు కుప్పల మీద రెండు చెట్లు మొలిచాయి. ఆ అమ్మాయి స్నానం జేసిన నీరు ఓ కాలువగా ప్రవహించసాగింది.

పిల్ల ఎదుగుతూ వుంది. తండ్రికి ఇది కొంత వింతగాను ఒక రకంగా గొప్పగానూ తోచ సాగింది. ఎవరైతే ఈ చెట్ల పేరు, కాలువ పేరు చెప్పుకొంటారో వారికి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఆ తండ్రి ప్రతిజ్ఞ చేసాడు.

ఎంతెంత పండితులు వచ్చీ, ఎంతెంత విద్వాంసులు వచ్చి వాటి పేర్లు చెప్పలేక పరాభూతులై వెళ్లిపోతున్నారు. పిల్లకు పెళ్లీడు దాటి పోతుంది.

పెరట్లో పాలేరు పాపం ఈ పిల్ల కట్టు తప్పి పోతూంది. 

వీటి పేరు నేను చెప్తే నాకీ పిల్లనిచ్చి పెళ్లిచేస్తాడేమో చూద్దాం అనుకున్నాడు.

పెరట్లో గోడ చాటున కూర్చొని బ్రాహ్మణుడు శిష్యులకు చెబుతూ వుంటే విని రెండు వేద పనసలు నేర్చుకొన్నాడు. ఒకనాడు శుభ్రంగా క్షవరం చేయించుకొని స్నానం చేసి విభూది పిండికట్లు పెట్టుకొని, దర్భాసనం జారీ చెంబు పట్టుకొని వేద పనసలు చదువుతూ విప్రుని ఇంటికి వచ్చాడు అతడు.

‘‘ఓహోహో! అవధాన్లుగారు వచ్చారు" అని ఇంటివారు అతడికి కాళ్లకు నీరిచ్చి మర్యాద చేసారు.

వచ్చినవాడు పెరట్లోకి కాళ్లు కడుగుకోవడానికి వెళ్లి, "ఓహోహో! సోమయాజులు గారు పసుపు చెట్టూ, నలుగు చెట్లూ వేయించి పసుపు కాలువ తవ్వించారే’’ అన్నాడు.

"వీటి పెరు చెప్పుకొన్నావు. నీకే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను" అన్నాడు ఇంటాయన.

ఇల్లూ లేదు, వాకిలి లేదు. తల్లీ లేదు, తండ్రీ లేడు. నాకు పెళ్లేమిటి అన్నాడు అతిథి.

ఈ నాటి నుంచి మా ఇల్లే నీ ఇల్లు, మేమే నీ తల్లిదండ్రులం కాదనడానికి వీలు లేదు. అని తన కూతుర్నిచ్చి పెళ్లి చేసాడు బ్రాహ్మణుడు. కూతురూ, అల్లుడూ ఇంట్లోనే వుంటున్నారు.

ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. సాటి వారు అత్తవారింటికి వెళ్ళడం చూచి, తండ్రి వద్దకు వెళ్లి "నాన్న నాకు అత్తవారింటికి వెళ్లాలని మనసుగా వుంది" అంది ఆ అమ్మాయి.

తండ్రి అల్లుణ్ణి పిలిచి "ఏమోయ్‌ మా అమ్మాయికి అత్త వారింటికి వెళ్ళాలని మనసుగా వుందట తీసుకొని వెళ్ళవలసింది" అని అల్లుడికి కొంత డబ్బు ఇచ్చాడు. అతడు ఆ డబ్బుతో ఊరికి దూరంగాను, .......పల్లెకు చేరువగానూ ఓ ఇల్లు వేసి భార్య, పిల్లలతో అందులో కాపురం పెట్టాడు.

రోజులు గడుస్తున్నాయి.

ఒక రోజు భర్త అరుగు మీద కూర్చొని వుండగా ఒకడు ఆ దారిన పోతూ "ఓరి బావా... ఓరి ఎళ్లా యిలారా" అని పిలిచాడు.

ఇంట్లో పనిచేసుకుంటున్న బ్రాహ్మణి ఇది విని "అదేమిటండీ? వాడు మిమ్మల్ని ఇలా పిలుస్తున్నాడు" అని అడిగింది.

"ఏం లేదు. ఏదో పూర్వ స్నేహంలే" అన్నాడు భర్త.

ఇదేమిటో చూద్దాం అని అతడి వెనుకనే బయలుదేరింది. ఆమె భర్త వానితో అతడి గూడేనికి వెళ్లి, వాళ్ల కంచాల్లో తిని, వాళ్ల ముంతల్లో త్రాగి వాళ్ల మంచాలపై దొర్లి, వాళ్ల గ్రామ్య భాషలో మాట్లాడటం చూసింది ఆమె. జరిగిన మోసం అర్థం అయిపోయింది.

గబ గబా తండ్రి వద్దకు వెళ్లి "నాన్న కుక్క ముట్టుకున్న కుండకు ప్రాయశ్చితం ఏమిటి ?" అని అడిగింది.

జరిగినదేమీ తెలియని అతడు వంటపాత్ర ఏదో కుక్క తాకి అపవిత్రం అయ్యిందని తలచి, "ప్రాయశ్చితం ఏముందమ్మా అగ్ని ప్రాయశ్చిత్తమే ప్రాయశ్చితం" అన్నాడు.

బ్రాహ్మణి తిన్నగా ఇంటికి వెళ్లింది. ఏమి మాట్లాడకుండా వంట చేసి భర్తకూ, పిల్లలకూ పెట్టి తాను మాత్రం అభోజనంగా పడుకుంది.

ఓ రాత్రి వేళ లేచి నిప్పు ముట్టించి తిరిగి పడుకొంది. తెల్లవారేసరికి నలుగురూ ఆ యింటితో పాటు కాలి మసయి వున్నారు.

నాలుగు జీవాలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాయి.

బ్రహ్మదేవుడు మీకేం ముక్తి? నీ భర్త పోతురాజు గ్రామ దేవత గుడి ముందు రాయిగా వుండి గ్రామదేవతతో పాటు పూజలందుకుంటాడు.

నీ బిడ్డలిద్దరూ కొత్తెమ్మ, కొర్రెమ్మ పురిటి నీళ్ల నాడు పెట్టే షడ్రసోపేతమైన నైవేద్యం వీళ్లకు ఆహారం.

నువ్వు ఎన్నెమ్మ పురుగై తిరుగుతూ నిన్ను ఎవరైతే తలవరో వారి పురిటి శిశువుల్ని తింటూవుండు అదే నీకు ఆహారం అన్నాడు ఎన్నెమ్మతో.

పాలేరు చేసింది వంచనే అయినా కల్లా కపటం లేదు. వాడు చేసిన పనిలోని ప్రమాదం అతడికి తెలియదు. పిల్లలు ఏ పాపం ఎరుగని అమాయకులు ఎటొచ్చీ బ్రాహ్మణి తండ్రి అహంకారం, భర్త వంచనకు ప్రతీకారం చేయబోయి ఆమె శాశ్వతంగా పురుగుగా రూపొందింది.

ఏలా కోటెమ్మ

మా బాలల్ని గాయీ

ఒకటోనాడు ఎన్నెమ్మ

ఓరుస్తుందే ఎన్నెమ్మ

రెండో నాడూ ఎన్నెమ్మ

రెక్కలు కట్టుకు ఎన్నెమ్మ

మూడోనాడు ఎన్నెమ్మ

మువ్వలు కట్టుకు ఎన్నెమ్మ

నాలుగో నాడూ ఎన్నెమ్మ

నాట్యంచేసీ ఎన్నెమ్మ

ఐదో నాడూ ఎన్నెమ్మ

ఆడుతు పాడుతు ఎన్నెమ్మ

ఆరో నాడూ ఎన్నెమ్మ

అరుస్తూను ఎన్నెమ్మ

ఏడో నాడూ ఎన్నెమ్మ

ఏడుస్తూనూ ఎన్నెమ్మ

ఎనిమిదో నాడు ఎన్నెమ్మ

ఏరుదాటే ఎన్నెమ్మ

తొమ్మిదో నాడూ ఎన్నెమ్మ

తోరణందూరే ఎన్నెమ్మ

పదవనాడూ ఎన్నెమ్మ

పట్నందాటే ఎన్నెమ్మ

అని పాడుతూ మల మూత్ర విసర్జన వేళ ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం వుందని 3,4,5,6 రోజులు మాతా, శిశువుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలని, ఏడవ రోజున ఎన్నెమ్మ తన ప్రయత్నాలు సాగలేదని ఏడుస్తూ వుంటుందనీ, ఏడు రోజులు దాటితే కొంత ఆపద తొలుగుతుందని, పదో రోజున ఎన్నెమ్మ పట్నం దాటి అంతా శుభమని ఈ పాటలో అన్యాపదేశంగా చెప్తారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!