శర్మ కాలక్షేపంకబుర్లు-శకుంతల!.

శర్మ కాలక్షేపంకబుర్లు-శకుంతల!.

.

( నేటి కాలానికి ఇటువంటి మేనకలూ, విశామిత్రులూ పెరిగిపోయారు.)

ఒకప్పుడు విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు, ఇంద్ర సింహాసనం పోతుందేమో నని భయపడి, ఆ తపస్సును భంగపరచదలచి, మేనకను పిలిచి, “నీవుపోయి విశ్వామిత్రుని తపస్సు భంగం చేయమ”ని ఆజ్ఞ ఇచ్చాడు. 

దానికి మేనక “స్వామీ ఆయన మహా కోపిష్టి, వశిష్టుని సంతానాన్ని శాపంతో నాశనం చేసినవాడు. అటువంటి వాడు కోపంగా చూస్తే చాలు మాడిపోడానికి, స్త్రీని, నన్ను వెళ్ళమంటున్నారు, తపోభంగానికి, ఐనా నా చేతనయిన ప్రయత్నం చేస్తానని”, చల్లగాలిని తోడుతీసుకుని, సుగంధాన్ని వెంటబెట్టుకుని, బయలుదేరి వెళ్ళి, విశ్వామిత్రునికి నమస్కారం చేసి, పువ్వులు కోసిపెట్టే నెపంతో, సపర్యలు చేయడం మొదలుపెడుతుంది, 

.

చెలులతో కూడి. ఆమె సపర్యలు చేస్తుండగా మలయానిలుడు చేయవలసిన పని చేసి వల్లెవాటు తప్పించాడు, ముని దృష్టి చెదిరింది, ఆమె పాలిండ్లపై దృష్టి నిలిచింది, కామ వశుడయ్యాడు. 

మేనక పాచిక పారింది, బహు కాలం సంసారగతుడయ్యాడు, విశ్వామిత్రుడు. ఫలితంగా బిడ్డపుట్టింది. మేనక బిడ్డను మాలిని అనే ఏటి ఒడ్డున వదలి వెళ్ళిపోయింది. 

విశ్వామిత్రుడు కూడా బిడ్డను వదలి తన తపో భూమికి వెళ్ళిపోయాడు. ఈ బిడ్డని జంతువుల బారి పడకుండా శకుంతమనే పక్షి సమూహం కాపాడింది. శకుంత పక్షుల చేత కాపాడబడినది కనక శకుంతల అని నామ కరణం చేశాను. ఆమెను తెచ్చి పెంచేను, అని కణ్వుడు మరొక మునికి, శకుంతల జన్మ వృత్తాంతం, తాను వింటూ ఉండగా చెప్పేడని, శకుంతల దుష్యంతునితో తన జన్మ వృత్తాంతం తెలిపింది.

శకుంతల జన్మ వృత్తాంతం చూదాం. 

ఈమె విశ్వామిత్రుడు, మేనకలకు జన్మించినది. 

ఈ సంతానం అక్రమమా? సక్రమమా? ఈ ప్రశ్న వదిలేద్దాం. 

ఆ కాలానికి అది తప్పుకాదేమో మనకు తెలియదు కనక. జంతువులు కూడా, బిడ్డ పుట్టిన తరవాత బిడ్డను సహజ శత్రువులయిన ఇతర మృగాలనుంచి రక్షించుకోడానికి చాలా ప్రయత్నం చేస్తాయి. 

ఈ విషయంలో తల్లి చూపే ధైర్యం అనుపమానం. తల్లి తన ప్రాణం ఒడ్డి అయినా బిడ్డను శత్రువునుంచి కాపాడుకోడానికి ప్రయత్నిస్తుంది. 

దీనికి ప్రత్యేకమైన ఉదాహరణలు అక్కరలేదు. కోడి తన సంతానాన్ని, గద్ద నుంచి రక్షించుకోడానికి, పిల్లలను రెక్కలకింద దాచడం సర్వ సహజంగా చూస్తాము. అలాగే సాధు జంతువైన ఆవు, బిడ్డను శత్రువులనుంచి కాపాడుకోడానికి పులి కంటె ఘోరంగా పోరాడుతుంది. 

నిన్న ఒక చిన్న సంఘటన చూశా. మా ఎదురుగా నాలుగంతస్థుల బిల్డింగ్ లో నాల్గవ అంతస్థులో ఒక గృహ ప్రవేశం జరుగుతోంది. ఆవుని, దూడని తోలుకొచ్చారు. 

పైకి, మెట్ల మీంచి ఎక్కించడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆవు భయపడి పైకి ఎక్కటం లేదు. అంతలో ఒక బుద్ధిమంతుడు, ఆవు చూస్తుండగా, దూడను ఎత్తుకుని పైకి ఎక్కేస్తున్నాడు.

ఇది చూచిన ఆవు, ఎవరి ప్రమేయం లేకుండా భయపడక, మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోయింది. దీనిని బట్టి తెలిసేది, తల్లి ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా బిడ్డను వదలదు సుమా. కాని ఇక్కడ మేనక బిడ్డని నిర్దాక్షిణ్యంగా వదిలేసింది, 

తండ్రి, కామ పరవశుడై, ఇంద్రియ సుఖాలకోసం స్త్రీని పొంది, తత్ఫలితంగా పుట్టిన బిడ్డను వదిలేసిపోయాడు. పక్షులు కాపాడాయి. అంటే వాటికి ఉన్న పాటి జ్ఞానం కూడా ఈ దంపతులకు లేకపోయింది. 

అదృష్టం కొద్దీ కణ్వుడు చూసి పెంచాడు.

పురాణ కాలం లో ఇలా, తల్లి కుంతి, తండ్రి సూర్యునిచే వదలి వేయబడిన వాడే కర్ణుడు, ఇతని మూలంగానే పెద్ద యుద్ధం జరిగింది. 

గంగా శంతనులు కామోపభోగాలలో తేలినా, ఎనిమిది మంది వసువులను, గంగ, గంగపాలు చేసినా, చివరికి ఒకరినైనా తల్లి పెంచి, తండ్రికి ఒప్పచెప్పింది.

నేటి కాలానికి ఇటువంటి మేనకలూ, విశామిత్రులూ పెరిగిపోయారు. 

ఎక్కడ చూసినా ఇటువంటి సంతానమే కనపడుతోంది, ఎక్కువగా. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేకపోవడం, చూసిన ప్రతిదానిని పొందాలనుకోవడం, కామోపభోగాలకోసం వెంపర్లాడటం, తప్పు చేయడం, దానిని ఎదుర్కోలేక, తత్ఫలితంగా కలిగిన సంతానాన్ని, భవిషత్తునో, పేరునో, కుటుంబ గౌరవాన్నో, లేక వీటన్నిటి ముసుగులో, మరొకరితో కామభోగాలు నెరవెర్చుకోడం కోసమో, వదిలేయడం, చేస్తున్నారు. 

మేనక విశ్వామిత్రులలాగే బాధ్యతలు మరచి, పశువులకంటే హీనంగా ప్రవర్తించి, కలిగిన సంతానాన్ని, గుడిమెట్ల మీద, అనాధ గృహాలవద్ద వదలిపోతున్నారు. ఇంకా కొంత మంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఏమయినా అంటే పురాణ కాలంనుంచీ ఉన్నదేగా అంటున్నారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!