ధూర్తాఖ్యానం – ప్రాచీన కథామాలిక. ! .

ధూర్తాఖ్యానం – ప్రాచీన కథామాలిక. !

.


ఓ ఐదుగురు మిత్రులు ఒక చోట చేరి కథలు చెప్పుకున్నారు. ఆ కథల్లో ఎవరి కథ బావుందో చర్చించుకున్నారు. ఇలా ఐదు కథలూ కలిసి మరొక కథగా మారింది. రాం గోపాల్ వర్మ అన్న దర్శకుడు తీసిన హిందీ సినిమా “డర్నా మనా హై” అన్న సినిమా కథకు ఆధారం ఈ ఆలోచన. మణిరత్నం “యువ” సినిమాలో అలాంటి ధోరణి ఛాయామాత్రంగా కనిపిస్తుంది. యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన దుప్పట్లో మిన్నాగు అన్న నవల కాన్సెప్ట్ కూడా ఇదే. యండమూరి కథామాలిక (నవల) కు ప్రేరణ – రోవాల్డ్ డాల్ (Roald Dahl) అన్న బ్రిటీష్ రచయిత అని ఆ పుస్తకంలో వ్రాశారు. మరి రోవాల్డ్ డాల్ కు ముందు ఇలా ఎవరూ వ్రాయలేదా? వ్రాశారు. ఆ రచన, దాని కథాంశ వివరణే ఈ వ్యాసం.

విస్తారమైన కథాసాహిత్యం భారతదేశంలో ప్రాచీనకాలం నుండీ ఉంది. భారతదేశ వాఙ్మయ చరిత్రలో తరచి చూస్తే విభిన్నమైన శైలి శిల్పాదులు ఎన్నో కనిపిస్తాయి. కథ, కథలో ఉపకథ, ఉపకథలో మరొక కథా – ఈ ప్రక్రియ భారతీయులకు పంచతంత్రం, బృహత్కథ కాలం నాటికే తెలుసు. పదిమంది రాజకుమారులు కలిసి సాహసయాత్రలు చేసి వారి అనుభవాలు చెప్పుకోవడం దండి దశకుమారచరితమ్ అనే అపూర్వమైన కావ్యంలో మనకు కనిపిస్తుంది. అంతకు ముందే వచ్చిన బాణభట్టుని కాదంబరి ఒక అద్భుతాల కుప్ప. నిజానికి ’గద్యం కవీనాం నికషం వదన్తి’ – వచనమే కవుల సామర్థ్యాన్ని వెల్లడిస్తుందని ఒక మాట. నవ్యరచనాచమత్కృతి లేని కావ్యం ఎలా శోభిస్తుందంటాడు బాణభట్టు.

భారతదేశ కథాసాహిత్యంలో ప్రాకృతభాషల పాత్ర విస్మరించలేనిది. గుణాఢ్యుడు తన బృహత్కథను పైశాచీప్రాకృతంలోనే రచించాడని ఐతిహ్యం. బౌద్ధుల జాతక కథలూ, అట్టకథలూ ప్రాకృతసౌరభశకలాలే. ఈ పరంపరలో ఐదుకథల కథామాలికాప్రయోగం భారతదేశంలో ఏనాడో జరిగింది. ఈ రచనకు కర్త భారతదేశీయుడైన హరిభద్రసూరి.

హరిభద్రసూరి అర్ధమాగధి ప్రాకృతరచయిత. సితంబర జైనమతావలంబి. జన్మస్థానం చిత్రకూటాచలం. (రాజస్థాన్ మేవార్ దగ్గరి చితోర్).ప్రాకృత భాషకు విశిష్టమైన సేవ చేసిన వారిలో జైనులు ముఖ్యులు. హరిభద్రసూరి అనేక ప్రాకృత కావ్యాలు రచించాడు. మొదట హిందూ బ్రాహ్మణుడై, ఆ పిమ్మట జైనమతం స్వీకరించిన ఈతని కాలం జర్మన్ ఇండాలజిస్టు హెర్మన్ జాకోబీ పరిశోధన ప్రకారం – ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల మధ్య. ఈతని రచన ధూర్తాఖ్యానం (ధుత్తక్ఖాణం) బహుశా చరిత్రలో మొట్టమొదటి సారి ఐదు కథలను గుదిగుచ్చిన కథామాలిక అయి ఉండవచ్చు.

ధూర్తాఖ్యానం – ఇది హిందూ పురాణాలలోనూ, రామాయణ మహాభారతాలలో కనబడే కొన్ని అభూతకల్పనల మీద ఒక satire. ఈ satire ను కొన్ని చోట్ల శృతిమించి అసభ్యంగా మార్చటమూ ఈ రచనలో కనిపిస్తుంది. ఆఖ్యానం అంటే Self narration. సాధారణమైన కథలు కాకుండా కల్పితమైన, తెచ్చిపెట్టుకున్న కథలు చెప్పుకోవడం కాబట్టి “ధూర్తాఖ్యానం” అయింది. ఈ కథలను సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఈ కథలకు సమాధానాలు వివరణలు పురాణదూష్యాలు, మతప్రసక్తి కలిగినవి కనుకా, వాటిని పూర్తిగా ప్రస్తావిస్తే విస్తారమైన వ్యాసం అవుతుంది కనుక సమాధానాలలో ఏదేని ఒక్క దాన్ని మాత్రం స్పృశించి ముందుకు సాగడం ఈ వ్యాసకర్త అభిమతం.

***********************************************************************************

కథ:

మాళవరాజ్య రాజధాని ఉజ్జయినీనగర సరిహద్దుల్లోని ఒకానొక ఉద్యానవనంలో ఓ మారు రెండువేలా ఐదువందలమంది ధూర్తులు పోగయ్యారు. వాళ్ళందరూ పచ్చిమోసగాళ్ళు. కామరూప, కామగమనాది విద్యలలో ఆరితేరిన వారు. వారిలో ఐదుగురు ప్రముఖులు. ఈ ఐదుగురులో ఒక్కొక్కరికి ఐదువందలమంది చొప్పున శిష్యులు. ఈ ఐదుగురిలో ఒక స్త్రీ కూడా ఉంది. సరిగ్గా వారు కలుసుకున్నప్పుడు బయట తీవ్రమైన వర్షం మొదలై, వచ్చిన పనికి ఆటంకం ఏర్పడింది. నగరంలోనికి వెళ్ళి భోజనం లేదా భోజనానికి వెచ్చాలు సంపాదించుకుని రావాలి. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఐదుగురూ తమ తమ వ్యక్తిగత అనుభవాల రూపంలో కథలను చెప్పుకుంటారు. ఎవరైతే అద్భుతమైన అబద్ధం చెప్పగలుగుతారో వారు ధూర్తులకు నాయకుడవుతారు. అబద్ధానికి నిదర్శనం చూపలేకపోతే వాళ్ళు ధూర్తులందరికీ అన్నపానాదులను సమకూర్చవలసి ఉంటుంది. ఒకవేళ కథ నమ్మశక్యమైనదే అయితే ఎలా నమ్మశక్యమైనదో, ఆ నమ్మటానికి గల కారణాలను పురాణ, రామాయణ, మహాభారత గ్రంథాల నుండీ ఉదహరిస్తూ నిరూపించగలగాలి.

ఇదీ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం మొదట మూలదేవుడు కథ చెప్పాడు. ఈ కథలన్నీ ఉత్తమపురుషలో సాగుతాయి.

మూలదేవుని కథ:

మంచి పరువంలో ఉన్న రోజుల్లో నాకు ఇష్టమైన ప్రతి వస్తువునూ సొంతం చేసుకోవాలనిపించేది. ఈ రోజులాగే వర్షంపడుతున్న ఒకానొక దినం నా గురువును ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక చేత్తో గొడుగూ, మరో చేత కమండలం మొదలైన అవసర వస్తువులు తీసుకుని నేను బయటకు అడుగుపెట్టాను. కొంతదూరం వెళ్ళగానే కొండలాంటి యేనుగొకటి నా వైపుకు రావడం గమనించాను. నాకు భయంతో కాళ్ళు, చేతులాడలేదు. యేనుగు దగ్గరికి వచ్చేసింది. ఏం చేయాలో తోచక, నేను నా కమండలం క్రింద పెట్టి అందులోనికి దిగిపోయాను. నన్ను వీడకుండా ఆ యేనుగు కూడా కమండలంలోనికి దూకింది. నేనా ఏనుగుకు దొరక్కుండా ఆరునెలలపాటూ అందులోనే తిరిగాను. చివరికొకరోజు కమండలం తాలూకు గొట్టం ద్వారా వెలుపలికి వచ్చేశాను. ఏనుగూ ఆ గొట్టం గుండానే బయటికి రాసాగింది. దాని శరీరం అంతా బయటికి వచ్చిన తర్వాత తోక తాలూకు ఒక్క రోమం మాత్రం గొట్టంలో చిక్కుకుపోయింది. అంతటితో ఏనుగుపీడ నాకు వదిలింది. బయట పడి కాస్త దూరం నడవగానే గంగానది ఉధృతంగా పరుగులు పెడుతూ కనిపించింది. నేను ఆ నదిలో దిగి చేతులతో నీటిని అవతలికి నెడుతూ అవతలి గట్టుకు చేరుకున్నాను. ఆపైన ఆరునెలలు వర్షాన్ని, ఆకలిని దాహాన్నీ సహిస్తూ మా గురువుకు శుశ్రూష చేశాను. ఆపై అట్నుంచి ఇటు వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను.

ఈ నా అనుభవం సత్యమని భావిస్తేఇలాంటి ఘట్టాలు మరెక్కడున్నాయో దృష్టాంతాలు చూపండి. అసత్యమని నిరూపణ అయితే, నన్ను నాయకుడిగా అంగీకరించదమే కాక ధూర్తులకు భోజనం ఏర్పాటు చేయండి.

ఈ కథకు కండరీకుడు సమాధానం చెబుతూ, కథలో సందేహాస్పదమైనదేదీ లేదని పురాణాలలో ఉదాహరణలు చూపెడుతూ సమర్థించాడు.ఆ పైన కండరీకుడు కథ చెప్పాడు.

కండరీకుని కథ:

బాల్యంలో నేను చాలా తుంటరివాణ్ణి. నన్ను భరించలేక మా అమ్మా, నాన్న నన్ను ఇంటినుండీ వెళ్ళగొట్టారు. ఆపై నేను ఎక్కడెక్కడో తిరిగి ఒకానొక ఊరికి చేరుకున్నాను. ఆ ఊళ్ళో ఎన్నో ఆవులూ,గేదెలూ, ఎనుములూ, ఇతర పశువులూ, గుర్రాలూ, ఏనుగులూ, పూలతోటలూ, ధనధాన్యాలూ ఇలా సమృద్ధిగా ఉంది. ఆ ఊరి నడిబొడ్డున ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుక్రింద కమలదళుడనే ఒక యక్షుడున్నాడు. ఓ మారు నేనతణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాను. గ్రామం అంతా ఆ యక్షుణ్ణి సత్కరించడానికి అక్కడ చేరుకుంది. సరిగ్గా అప్పుడు అక్కడికి అస్త్రశస్త్రధారులైన దొంగల గుంపు వచ్చింది. ప్రజలందరూ కకావికలై పరుగులు పెట్టారు. అప్పుడు నేనక్కుడున్న ఒక దోసకాయ లోకి చొరబడ్డాను. నన్ను చూసి అందరూ నాతో బాటూ ఆ దోసకాయ లోనికి ప్రవేశించారు. ప్రజలెవ్వరూ కనబడక దొంగలగుంపు నిరాశగా వెనుదిరిగింది. ఇంతలో ఒక మేక ఆ దోసకాయ ను మింగివేసింది. ఆ మేకను ఒక పాము మింగివేసింది. ఆ పామును ఒక గద్ద మింగింది.

అప్పుడు అక్కడికి ఆ దేశపు రాజు తన సైనికులతోబాటు వచ్చాడు. రాజు తాలూకు భద్రగజం అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వదిలారు. చెట్టుకొమ్మగా భ్రమించి మావటీడు ఏనుగును తాలూకు త్రాడును గద్దకాలుకు కట్టివేశాడు. గద్ద పైకెగరగానే ఏనుగు కూడా దానితోబాటూ ఎగురసాగింది. మావటీడు బెదరి రాజు వద్దకు పరిగెత్తుకు వచ్చి మొరపెట్టుకున్నాడు. రాజు కొందరు యోధులను ఆ గద్దపైకి పంపితే వాళ్ళు వచ్చి బాణాలను ప్రయోగించి ఆ పక్షి రెక్కలను తెగనరికారు. అంతేకాక, దాని కడుపు చీల్చారు. అందులోనుండి పాము,పాముకడుపులోనుండి మేక, మేకకడుపులోనుండి దోసకాయ, అందులోనుంచి గ్రామస్తులు అలా బయటపడ్డారు. వారితో బాటు బయటపడిన నేనూ ఇప్పుడు మిమ్మల్నిలా కలుసుకున్నాను.

ఈ కథంతా ప్రత్యక్షరసత్యమని ఐలాషాఢుడు విష్ణుపురాణం, మహాభారత వనపర్వం, జటాయువృత్తాంతం, ద్రౌపదీస్వయంవరం ఇత్యాది ఘట్టాలను ఉటంకిస్తూ కుండరీకుని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు.

ఐలాషాఢుని కథ:

యవ్వనంలో నాకు డబ్బుపిచ్చి బాగా పట్టుకుంది. పర్వతాలలో, గుహలలో రససిద్ధితో బంగారం సంపాదించవచ్చని తిరుగుతూ ఉండేవాణ్ణి. అనేక మంత్రతంత్రాలను అభ్యసిస్తూ ఉండేవాణ్ణి. నేనున్నచోటికి నూరు యోజనాల దూరంలో ఒక పెద్దపర్వతం, దాని సమీపంలో ఒక యోజనం విస్తీర్ణం ఉన్న సహస్రవేధీ రసకుండమూ ఉన్నాయని ఓ మారు నాకు తెలిసింది. ఇదివినగానే నేను పూర్వదిశగా వెళ్ళడం ఆరంభించాను. ఆ సరస్సును సమీపించి ఆ నీటిని, ఆ కొండపై శిలలను నాకు కావలసింతగా తెచ్చుకుని ఇంటికి వచ్చాను. ఇప్పుడు నాకేం తక్కువ? ఈ రెంటి సంయోగంతో నేను బంగారం చేయడం మొదలెట్టి కొన్ని రోజుల్లో కుబేరసమానుణ్ణి అయిపోయాను.

ఓ మారు ఐదువందలమందితో కూడిన ఓ దొంగలగుంపు మా ఇంటిపైకి వచ్చింది. నేను బ్రతికి ఉండగానే నా డబ్బు దోచుకెళ్ళడం సహించలేని నేను ఒక్కొక్క బాణంతో పదిమంది దొంగలను పడగొడుతూ తలపడ్డాను. ఈ హడావుడి విని మా ఇంటి సభ్యులు, నౌకర్లూ దొంగలపైకి ఎదురుదాడికి దిగారు. ఇంతలో ఒక దొంగ నా తల నరికాడు. ఆ తలను రేగుపళ్ళచెట్టుకు వేలాడగట్టాడు. మిగిలిన వాళ్ళు మొండాన్ని వేరుచేసి దాన్నిఖండఖండాలుగా నరికారు. ఆపై వాళ్ళు ఇంటినంతా దోచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు నా తల పరిస్థితి ఏమని చెప్పను? ఆకలి సహించలేక తలతో నేను పక్కనున్న చెట్టు పళ్ళను తినడం మొదలెట్టాను. ఇంతలో పొద్దు పొడిచింది. లోకులు నా తల పళ్ళను తినడం చూసి నేను బ్రతికే ఉన్నానని కనుక్కుని నా శరీరావయవాలన్నిటినీ ఒకచోటికి చేర్చారు. అంతటితో నా శరీరం నాకు వచ్చేసింది. ఇది నా ప్రత్యక్షానుభవం. ఇందులో మీకు సత్యాలు కనబడితే ప్రమాణం చూపించండి.

శసుడు దేవీభాగవత, మహాభారత, రామాయణాది కథల్లో అనుగుణమైన ప్రమాణాలు చూపాడు.

శసుని నాలుగవ కథ:

అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామానికి వెలుపల పొలాలు, దూరాన కనిపిస్తున్న కొండల వరకూ వ్యాపించి ఉన్నాయి. ఒక శరత్కాలపు పొద్దున నేను సరదాగా మా ఊరి పొలాల వైపుకు వెళ్ళాను. అంతలో దూరంగా ఉన్న కొండపై నుండి దిగి ఒక మదపుటేనుగు నా వైపుకు పరిగెత్తుకు రాసాగింది. నేను ఆ ఏనుగు నుండి ఎలా తప్పించుకోవడమా అని తత్తరపడుతూ దగ్గరగా ఉన్న ఒక నువ్వుచెట్టుపైకెక్కాను. ఆ ఏనుగూ చెట్టుదగ్గరికి వచ్చింది. చెట్టును బలంగా తొండంతో ఊపసాగింది. నేను క్రిందపడలేదు కానీ నువ్వుచెట్టు గింజలు అసంఖ్యాకంగా రాలిపడ్డాయి. ఆ నువ్వులు ఏనుగు అటూ ఇటూ తిరుగుతూ ఉండగా, దాని పాదాల క్రింద పడి నలిగాయి. వాటినుంచీ నూనె రావడం మొదలయింది.

కాసేపటికి అక్కడ నూనెతో ఒక ఊబి ఏర్పడింది. ఆ ఊబిలోనికి పాపం ఆ యేనుగు కూరుకుపోయి ఆకలి దప్పులకు అలమటిస్తూ చచ్చిపోయింది.

ఆపైన నేను క్రిందికి దిగి ఏనుగు చర్మం ఒలుచుకున్నాను. ఆ చర్మంతో ఒక సంచీ తయారు చేసుకుని, పదిమణుగుల నూనెను త్రాగి, పక్కనున్న రేగుపళ్ళు ఒక్క మణుగు తిని, మిగిలిన నూనెనంతా చర్మపు సంచీలో వేసుకుని ఇంటిదారిపట్టాను. బరువు ఎక్కువవడంతో గ్రామం మొదట్లో మర్రిచెట్టుకు ఆ సంచీ వేలాడగట్టి ఇంటికి వచ్చాను. ఇంటి దగ్గర ఆడుకుంటున్న పిల్లలకు “ఊరి మొదట్లో ఉన్న చెట్టుకు సంచీ ఒకటి వేలాడుతుంది, పట్టుకు రండర్రా” అని చెప్పాను. వాళ్ళక్కడికి వెళితే సంచీ కనిపించలేదు. వాళ్ళు సరేనని ఆ చెట్టును వేర్లతో సహా పీక్కుని ఇంటికి తీసుకు వచ్చారు. ఈ ఘటన జరిగి ఎంతో కాలం కూడా కాలేదు. ఆపైన ఇదుగో మీకోసం ఇక్కడికి వచ్చాను.

చివరి ధూర్తురాలు ఖండపాన ఆ కథను సత్యమేనని, అందులో కల్పనాదూరమైన విషయాలున్నవన్న విషయాన్ని ఖండించింది.

భారతంలో – మత్తగజం తాలూకు మదజలంతో బురద ఏర్పడ్డం అన్న విషయం ఉంది. మదజలంతో బురద ఏర్పడినప్పుడు మదపుటేనుగు తొక్కిడికి నువ్వులనూనె బురద ఏర్పడ్డంలో ఆశ్చర్యం లేదు. భీమునిచేతిలో మరణించిన ఒక రాక్షసుడు ఒక ఎనుము, పదహారు బండ్ల అన్నం, వేయి పీపాల సారాయం త్రాగడం భారతంలో సాధ్యమైనప్పుడు నువ్వు ఒక్క మణుగు రేగుపళ్ళు ఎందుకు తినరాదు? రామాయణంలో కుంభకర్ణుడు తినే తిండి ముందు నీ తిండి యే పాటి? శాస్త్రాలలోనిఒకానొక ఋషి (అగస్త్యుడు) అన్ని సముద్రాలనూ త్రాగాడు. (మహాభారతం అరణ్యపర్వం) మరొక ఋషి (జహ్నుమహర్షి) గంగపై కోపించి దాన్నితాగేశాడు. (రామాయణం బాలకాండ) ఆపై వెయ్యి సంవత్సరాలు దాన్ని అక్కడే బంధించాడు. (ఈ విషయం రామాయణంలో లేదు) ఆ మహర్షి పేరుమీదే గంగ జాహ్నవి అయింది. శాస్త్రాలలోని ఈ విషయాలముందు నీవు త్రాగిన పదిమణుగుల నూనె లెక్కకే రాదు.

శసుడు: మరి అంతపెద్ద నూనెసంచీని నేను గ్రామానికి మోసుకురావడం నీకు ఆశ్చర్యంగా అనిపించలేదా?

ఖండపాన అందుకు గరుడపురాణకథను చెప్పింది. గరుడపురాణంలో గరుడుడు ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి తీసుకువచ్చి మరొకచోట నాటుతాడు. ఆ నాటిన స్థలమే లంక. ఒక పక్షే ఒక చెట్టును మోసుకు వచ్చినప్పుడు నీవు చేసినపని సాధ్యమేనంది. ఇంకా రామాయణ, భాగవతాలలోనూ దృష్టాంతాలు చూపింది.

ఖండపాన చెప్పిన ఆఖరు కథ:

యవ్వనంలో నేనొక అపూర్వలావణ్యవతిని. ఓ మారు నేను చతుర్థస్నానం చేసి శయనాగారంలో నిద్రిస్తూంటే గాలి నాపై మోహంతో నన్ను చేరుకుని రతిక్రీడ సలిపింది. ఫలితంగా నేను గర్భం ధరించాను. నెలలు నిండిన నాకు ఒక పుత్రుడుదయించినాడు. అయితే వాడు పుడుతూనే ఏదో గొణుగుతూ నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది ఆ స్వానుభవం. నమ్మితీరాలి. నమ్మకపోతే గాలి వలన ఎలా పుత్రుడు జన్మిస్తాడో చెప్పాలి.

మూలదేవుడు భారతం ద్వారా ఖండపాన కథ తాలూకు సంబద్ధాన్ని నిరూపించాడు. అయినప్పటికీ ఆగక ఖండపాన అనుబంధ ప్రశ్నలు వేయడం కొనసాగించింది. ఆయా ప్రశ్నలకు ఐలాషాఢుడు, మూలదేవుడు సమాధానాలు చెప్పారు.

అప్పుడు ఖండపాన కుపితురాలై ప్రశ్నించింది. మీకు నేనెవరో తెలుసా? మూలదేవుడు అన్నాడూ – “నీవు పాటలీపుత్రంలో గౌతమగోత్రజుడైన నాగశర్మ సోమశ్రీ అనే దంపతుల కుమార్తెవి. నీ పేరు జగత్ప్రసిద్ధం”.

అప్పుడామె అంది. – “నా రూపలావణ్యాలు చూసి అలా భ్రమపడుతున్నారు. నేను అక్కడి రాజు తాలూకు చాకలివాళ్ల అమ్మాయిని. నా పేరు దగ్ధికా. నేను వేయిమంది అనుచరులతో కూడి అంతఃపురానికి చెందిన బట్టలు ఉతికేదాన్ని. ఓ మారు బట్టలు ఉతకటానికి గంగానదికి వెళ్ళాను. బట్టలు ఉతికి నా అనుచరులు ఒడ్డున ఎండబెడుతుంటే ఒక పెద్ద సుడిగాలి బయలుదేరి ఆరవేసిన వస్త్రాలు గాలికి కొట్టుకుపోయాయి. ఆ వస్త్రాల వెంత అందరూ పరిగెట్టారు కానీ అవి దొరకలేదు. అందరూ భయపడుతూంటే నేను ధైర్యం చెప్పాను. కానీ రాజు సమక్షానికి వెళ్ళడానికి ధైర్యం చాలక, కాసేపు ఆవుగా, కాసేపు అశోకచెట్టుకు అల్లుకున్న తీవెగా రూపాలు మార్చుకుని కాలక్షేపం చేశాను. రాజుకు బట్టల విషయం తెలియనే తెలిసింది. రజకులకు భయపడిన వస్త్రాలు తిరిగి వస్తే తను ఆ వస్త్రాలను దండించనని రాజు అభయమిచ్చాడు.”

శసుడు కామరూప వృత్తాంతానికి సమాధానం చెప్పాడు. ఖండపాన చివరి అస్త్రం ప్రయోగించింది.

“ఇందాక వస్త్రాలు ఎగిరిపోయాయన్న కథ చెప్పాను కదా, ఆ సమయంలో నా అనుచరుల్లో నలుగురు ఆ బట్టల వెనక పడి పరిగెత్తుతూ ఇంతవరకు రానేలేదు. ఆ నలుగురూ మీరేనని నాకు తెలుసు.ఈ వృత్తాంతం ఒప్పుకుంతే మీరు నాకు దాసులు కండి. ఒప్పుకోకపోతే నా భోజనం సంగతి చూడండి.”

నలుగురు ధూర్తులు సిగ్గు పడ్డారు. వాళ్ళు తమ ఓటమిని ఒప్పుకుని ఆమెను ప్రశంసించారు. బయట జోరుగా వర్షం కురుస్తోంది. భోజనం సంపాదించడానికి ఉపాయం చెప్పమని ఆమెనే అడిగారు.

ఆమె సమీపంలో ఉన్న శ్మశానానికి వెళ్ళింది అక్కడొక బాలుని మృతదేహం ఉంది. దాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి ఒక శ్రేష్టి దగ్గరకు వెళ్ళింది. శ్రేష్టి ఆమెను గెంటివేయమని నౌకర్లకు చెబితే ఆ నౌకర్లను ఆమె మంత్రశక్తితో స్పృహపోగొట్టి శ్రేష్టిని తనే బాలుణ్ణి హత్యచేశాడని రాజుకు చెబుతానని బెదిరించింది. శ్రేష్టి కాళ్లబేరానికి వచ్చి ఒక ముద్రికను ఆమెకు ఇచ్చాడు. ఆ ముద్రికతో ఆమె తన వాసం చేరుకుని, మిగిలిన ధూర్తులకిచ్చి ఆ ముద్రికతో వెచ్చాలు కొని వంట చేయమని ఆజ్ఞాపించింది.

***********************************************************************************

ప్రతి రచనలోనూ స్వీకార్యమైన అంశాలు, స్వీకార్యం కానివి రెండూ ఉంటాయి. రచన తాలూకు సమగ్రమైన సారాంశం ఏదైతే ఉందో అది ఆక్షేపణీయం అయినప్పుడు ఆ ఆక్షేపణీయమైన అంశాన్ని గుర్తించి వ్యాఖ్యానించటమో, విమర్శించటమో చేయటం ఒక ఉన్నతస్థాయికి సంబంధించిన లక్ష్యం. మతగ్రంథాల విషయంలో ఈ పని మరింత నిశితంగా జరుగవలసి ఉంటుంది. ఎందుకంటే భారతీయ మతసారస్వతానికి మౌఖిక సాహిత్యాం మూలాధారం. తరం నుంచి తరానికి మౌఖికంగా విషయసంగ్రహం జరుగుతున్నప్పుడు అలౌకిక లషణాలు, అభూతకల్పనలు జొరబడడం అనివార్యం. వీటిని మాత్రమే సారాంశంగా గ్రహించి ధూర్తవ్యా(ఆ)ఖ్యానం చేయడం అంత మంచిది కాదని అనిపిస్తుంది. మతప్రచారం తాలూకు మత్తు వీడడం మహాపండితులకూ అసాధ్యమేమో!

ఇదే మాట ధూర్తాఖ్యానికీ వర్తిస్తుంది. ఇందులోని పౌరాణిక అపహాస్యాలను స్వీకరించకపోయినా ఈ విలక్షణ కథాసంవిధానం మాత్రం ఆస్వాదనీయం. satire ను హాస్యంతో మేళవించడం ఈ రచనలోని విశిష్టత. నాట్యశాస్త్రంలో ప్రహసనం అన్న రూపకభేదం హాస్యం కోసమే ప్రత్యేకించినప్పటికీ, ఒక కథగా బహుశా ఈ ప్రక్రియతో ఒక సమగ్రమైన రచన రూపొందడం ధూర్తాఖ్యానంతోనే మొదలై ఉండవచ్చు. ఇలాంటి కథ, వినూత్నమైన ప్రక్రియ ఒకటి ఆ రోజుల్లో సృష్టించాలంటే ఎంతో ధైర్యం కావాలి. మతప్రచారం సాగించటానికి అన్యమతగ్రంథాలపైన ఇటువంటి ప్రయోగాలు చేయటం – సమర్థనీయమా కాదా అన్న సందేహం వచ్చినప్పటికీ, చరిత్ర తిరిగి వ్రాయలేం కనుక ఈ విలక్షణమైన ప్రయోగం ఒకటుందని తెలుసుకోవడం కొన్ని విషయాల అవగాహనకు తోడ్పడుతుంది. ఇలాంటి ఒక పుస్తకం వ్రాయాలంటే అప్పటికాలంలో బహుశా ప్రాకృతంలో మాత్రమే సాధ్యమయ్యే పని యేమో. ఈ అర్ధమాగధి రచనను సంస్కృతం లో సంఘమిత్రుడు అనువదించాడు. గుజరాతీ, హిందీ భాషల్లోనూ ఈ రచనను అనువాదం చేశారు. కథాశిల్పం, అక్కడక్కడా సునిశితమైన హాస్యం చెప్పేవిధానంలో కొత్తదనం, లక్ష్యం ధూర్తమైనా, పరిశీలనలో సూక్ష్మత, ఇటువంటి అంశాలను మెచ్చుకోదగ్గ

ఈ పుస్తకానికి ప్రచారం పెద్దగా లేదు.కారణాలు అనేకం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!