శర్మ కాలక్షేపంకబుర్లు-శకుంతల విజయం.

శర్మ కాలక్షేపంకబుర్లు-శకుంతల విజయం.

వేటకి వచ్చిన దుష్యంతుడు కణ్వాశ్రమం ప్రవేశించి, శకుంతలను చూసి, మోహ పరవశుడై ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని వెళ్ళిపోతాడు. కణ్వుడు అడవినుంచి తిరిగివచ్చి, శకుంతలను వివాహితగా, గర్భవతిగా గుర్తించి ఆశీర్వదించి, ఆమెకు కలిగే బిడ్డ బల, వీర్యవంతుడై చక్రవర్తి అవుతాడని దీవిస్తాడు. బిడ్డపుట్టిన చాలా కాలం తర్వాత కూడా దుష్యంతుడు భార్యను తీసుకు వెళ్ళకపోతే అమెకు శిష్యులను తోడిచ్చి పంపుతాడు..ఆ తర్వాత……

కొడుకును తీసుకుని వచ్చిన శకుంతల మంత్రి, పురోహిత, ప్రధాన పౌరజన సహితుడై సభలో ఉన్న దుష్యంతుని చూసింది, సభలో ప్రవేశించింది. ఆశ్రమానికి వచ్చినపుడు చూపిన ప్రేమ అనురాగాలు కనపడక, ఆహ్వానమే వినపడక ఆశ్చర్యపోయింది. నన్ను ఎరగడా? చాలా కాలమైపోయిందని మరిచిపోయాడా. ఎరిగి, యెరగనట్లున్నాడా? చాలా పనులున్న రాజు కదా మరిచిపోయాడేమో అనుకుంది. ఆ రోజు చెప్పిన మాటలు తప్పేయా? పలకరింపు కూడా లేదే, రాజులను నమ్మవచ్చునా? అని తలపోసింది, ఒక సారి నిరుత్సాహపడింది. ఎరగని వాడికి చెప్పచ్చు, ఎరిగినవాడికీ చెప్పచ్చు, ఎరుగి ఎరగనట్లు ప్రవర్తించేవాడికి బ్రహ్మదేవుడు కూడా ఎరుక పరచలేడే! అని విచారించింది. ఏమయినా వచ్చాము కనక విషయం తేల్చుకోవడమే మంచిదని తలపోసింది, నిర్ణయానికి వచ్చింది.

కొడుకుని చూపించి, వీడు నీ కొడుకని చెబుదామని నిర్ణయించుకుని,పాత విషయాలు గుర్తు చేయదలచి…

రాజా వేటకోసం వచ్చావు, కణ్వాశ్రమంలో నన్ను చేపట్టి నాకిచ్చిన వరం తలపవలెనని కోరింది. సూర్యునితో సమాన తేజస్సు కలిగిన ఈ పిల్లవాడు నీకొడుకు, ఇతనిని యువరాజును చేయమని కోరింది. అది విన్న దుష్యంతుడు, నువ్వెవరో నాకు తెలియదు, ఇలా మాట్లాడకూడదు, ఎక్కడినించి వచ్చావో అక్కడికే వెళ్ళిపొమ్మని చెప్పేడు. దానికి శకుంతల మ్రాన్పడి, నిట్టూర్చి, కోపంతో ఎరుపెక్కిన కళ్ళలో నీళ్ళు రాగా, తనను తాను ఓదార్చుకుంటూ, నిగ్రహంతో రాజుతో ఇలా అన్నది. ఎరుగని వానిలా మాట్లాడతావేమి, ఎవరికీ తెలియదనుకుంటున్నావా? నాకు తప్ప ఇంకెవరికీ తెలియదనుకుని, ధర్మాత్ములైన వారు తప్పు మాట్లాడచ్చా? తెల్లనయిన యశస్సు కలిగినవాడా! మనుషులు చేసే పనులు, ఎంత, ఎవరికి తెలియకుండా చేసినా, చూసే వారున్నారు, వారు, వేదం, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, ఇవి మహా పదార్ధాలు, ఇవి ఎప్పుడూ మనుషులు చేసే పనులు చూస్తూ ఉంటాయి సుమా అన్నది. నీవు నాకిచ్చిన వరానికి వీరంతా సాక్షులే సుమా అని చెప్పింది. భార్య లేక పురుషుడు పుత్రవంతుడుకాడు. పతివ్రత, ఎప్పుడు కూడా ఉండేది, సహధర్మ చారిణి అయిన భార్యను సరిగా చూడని వాడికి ఇహ పరాలుంటాయా? ధర్మ అర్ధ కామాల సాధనకు, గృహనీతికి, సద్గతికి, గౌరవానికి, హృదయ సంతోషానికి, భార్యమూలం, ఎట్టి ఆపదలలోనూ, ఎట్టి సంఘటనల్లో,భార్య దగ్గరుండటం మూలంగా కష్టాలు తొలుగుతాయి. భార్య పురుషుడిలో సగం అన్ని విషయాలలో, అటువంటి భార్యను అవమానించడం అధర్మం . తన నీడ నీళ్ళలో చూసుకున్నట్లు, తండ్రి కొడుకును చూసి ఆనందం పొందుతాడు. పున్నామనరకాన్నించి రక్షించే వాడు కొడుకు కనక. నీ తనువు వలన నాకు కలిగిన కొడుకు, దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లుగా వెలుగుతున్నాడు. అటువంటి కొడుకును కౌగలించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడు. నీ కొడుకు వేయి వాజపేయాలు చేస్తాడని సరస్వతి పలికింది నిజం. ఇటువంటి నిజం

నుతజలపూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతువదిమేలు తత్క్రతు శతంబుకంటె సుతుండు మేలు త

త్సుత శతంబు కంటె సూనృతవాక్యము మేలు చూడగన్.

ఎప్పుడూ సత్యమే పలికే రాజా! మంచినీటి నూతులు నూఱిటికంటే ఒక బావి మేలు, వంద బావులకంటే, ఒక క్రతువు మేలు, వంద క్రతువులకంటే కొడుకు మేలు, వందమంది కొడుకులకంటే సత్యవాక్యం మేలు అని చెప్పింది.వేయి అశ్వమేధయజ్ఞాల ఫలం ఒక వైపు సత్య వాక్యం ఒక వైపు వేసి తూచితే మొగ్గు సత్యం వైపే ఉంటుంది సుమా. అన్ని తీర్ధాలలొ మునిగిన ఫలం, అన్ని వేదాల సారం సత్యవాక్యం తో సమానం సుమా. సుక్షత్రియుడైన విశ్వామిత్రుడు, మేనకల కుమార్తెను అబద్ధం చెబుతానా అంది.

అందుచే కణ్వాశ్రమం లో నీవిచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంది. దానికి దుష్యంతుడు నువ్వెక్కడ, నేనెక్కడ, నిన్నెపుడూ చూడనుకూడా లేదు, స్త్రీలు అబద్ధాలడతారు, ఇలా అసత్యం మాటాడవచ్చునా అంటాడు. ఒక కుర్రాణ్ణి ఎవరినో తీసుకొచ్చి వీడు నీకొడుకని చూపించ తగునా అన్నాడు. లోక విరుద్ధమయిన వాటిని నేను ఒప్పుకోను, ఎక్కడినుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అన్నాడు. ఇది విన్న శకుంతల చాలా బాధపడి అయ్యో! పుట్టగానే తల్లి తండ్రి చేత విడువబడ్డాను, ఇప్పుడు భర్తచే కూడా విడువబడుతున్నానా, అని దుఃఖపడి చేయగలది లేక భగవంతుని పై భారం వేసి తిరిగిపోవడానికి ఉద్యుక్తయై ఉన్న సమయంలో ఆకాశవాణి, ఈ కుర్రవాడు నీ కుమారుడు, శకుంతలయందు జన్మించినవాడు. శకుంతల సత్యం పలికింది, ఆమెను స్వీకరించి ఏలుకో అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపొయారు. అప్పుడు రాజు ఈమెకు నాకు తప్ప మరెవరికి ఈ విషయం తెలియదు కనక అలా అన్నాను, గాంధర్వ వివాహం చేసుకున్నాను ఈమెను, లోకాపవాదానికి వెరచి తెలియదన్నానని చెప్పి శకుంతలను, భరతుణ్ణి అక్కున చేర్చుకున్నాడు.

అమ్మయ్య! కధ సుఖాంతమయింది. వ్యాఖ్య దీనితో పాటు ఉంటే బాగుంటుంది, కాని ఇప్పటికే టపా పెద్దదయిపోయింది కనక రేపటిదాకా ఆగక తప్పదు. శాకుంతలం శృంగార కావ్యమేకాదు, నేటికి వస్తున్న సమస్యలకి పరిష్కారమార్గాలు చూపుతున్న మార్గదర్శిని.ఇది మరిచిపోతున్నామనే నా బాధ. నేనీ కధను కవిత్రయ భారతం నుంచి తీసుకున్నా. ఈ కధనం సహజంగా, నిజానికి దగ్గరగా లేదూ?

శకుంతల మానవ ప్రయత్నంగా చేయగలది అంతా చేసిన తరవాత ఇక దైవం మీద భారం వేసి వెనుదిరగాలనుకున్న సందర్భంలో ఆకాశవాణి పలికింది సాక్ష్యం, దుష్యంతుడు అప్పుడు ఒప్పుకొని శకుంతలను అక్కున చేర్చుకున్నాడు. ఈ గాంధర్వ వివాహ విషయం ఎవరికి తెలియదు కనక, జన బాహుళ్యానికి వెరచేను, అని చెబుతాడు.

ఈ సందర్భంలో శకుంతల ఉదాత్త,ధీర నాయిక శకుంతల గా చెబుతాను, దుష్యంతుని గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆకాశవాణి చెప్పకపోతే ఏమి చేసేదన్న ప్రశ్న రావచ్చు, బహుశః వీరుడైన కొడుకుతో యుద్ధం ప్రకటింపచేసేదేమో! శాకుంతలం చూసే వారి దృష్టి కోణాన్ని బట్టి కనపడుతుందేమో:). నాకిలా కనపడింది మరి. నేటి యువతులంతా శకుంతలలాటి ధీరోద్దాతులు కావాలని నాకోరిక.

మరొక చిన్న వివరణ.

అందరిలోనూ ఒక అనుమానం, ఏంటీ! శాకుంతలం ఇలా రాశారని. శాకుంతలం భారతం లోని ఉపాఖ్యానం. భారతం లో శాకుంతలం ఇలాగే ఉంటుంది. భారతం నుంచి తీసుకున్న శాకుంతలో పాఖ్యానాన్ని మహా కవి కాళిదాసు మార్పులు చేసి రాశారు. దానికి అభిజ్ఞాన శాకుంతలమని పేరు పెట్టేరు. నాయికను శృంగార నాయికగా చూపించారు. అది తెనుగునాటే కాదు ప్రపంచం మొత్తంమీద బాగా తెలిసిన శాకుంతలం. రెండూ శిరోధార్యాలే.మహాకవి శకుంతలను ధీరోద్దాత్త నాయకిగా చూపడం కంటే లలిత శృంగార నాయకిగా చూపడానికే ఇష్టపడ్డారు. అందుకు గాంధర్వ వివాహం తరవాత, మరలా కలిపేలోపు కధలో మార్పులు చేసి రాశారు. రెండూ శిరోధార్యాలే.అందులోనే ఉంగరం పోగొట్టుకోడం, మరలా చేపకడుపులో దొరకడం, దూర్వాసమహాముని శాపం వగైరా. ఇలాగే నలదమయంతుల కధ కూడా వేరుగా చెప్పబడింది.

స్వస్తి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!