-విష్ణుమూర్తి గురించి పోతన వివరించిన పద్యాలు ద్వితీయ స్కంధంలోని ఆణి ముత్యాలు.

పోతన - శ్రీమద్భాగవతం .. ! 

(విష్ణుమూర్తి గురించి పోతన వివరించిన పద్యాలు

ద్వితీయ స్కంధంలోని ఆణి ముత్యాలు.)

.

మండలములోన భాస్కరు

డుండుచు జగములకు దీప్తి నొసగెడి క్రియ బ్ర

హ్మాండము లోపల నచ్యుతు

డుండుచు బహిరంతరములనొగి వెలిగించున్

.

భావం: 

సూర్యుడు సూర్యమండలంలోనే ఉంటాడు. 

అక్కడ ఉంటూనే లోకాలన్నిటికీ వెలుగును ఇస్తాడు.

అదేవిధంగా పరమేశ్వరుడు బ్రహ్మాండంలో ఉంటూ లోపల, బయట ఒక క్రమంలో తన చైతన్యాన్ని, తేజస్సును ప్రసరింపచేస్తాడు. .

.

విశ్వాత్ముడు విశ్వేశుడు

విశ్వమయుండఖిలనేత విష్ణుండజు డీ

విశ్వములో దానుండును

విశ్వము దనలోన జాల వెలుగుచునుండన్.

.

విష్ణుమూర్తి పుట్టుకలేని వాడు, అంటే అజుడు. 

ఈ ప్రపంచం అంతా తానే అయి ఉన్నవాడు. 

అంటే విశ్వమే ఆత్మగా కలిగినవాడు. అంతేకాదు, ఈ విశ్వానికంతటికీ ప్రభువు. 

ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నవాడు. అన్నిటికీ అధినాయకుడు. 

ఈ ప్రపంచంలో విష్ణువు ఉంటాడు. ప్రపంచం అంతా విష్ణుమూర్తిలో ప్రకాశించి ఉంటుంది. 

.

హరిసుతు బరిచరుగా గొని

హరిసుతు దునుమాడి పనిచె హరిపురమునకున్

హరివిభునకు హరిమధ్యను

హరి రాజ్యపదంబు నిచ్చె హరి విక్రముడై

.

భావం: 

హరి సుతుడు అంటే ఆంజనేయుని, పరిచరుగా కొని అంటే సేవకునిగా స్వీకరించి, హరిసుతుని అంటే వాలిని, తునుమాడి అంటే వధించి, హరిపురమునకున్ అంటే స్వర్గానికి పంపి, హరివిభునకు అంటే సుగ్రీవునకు, హరిమధ్యను అంటే తారను, హరిరాజ్యపదంబును ఇచ్చి అంటే వానర రాజ్యాన్ని ఇచ్చి, హరి అంటే శ్రీహరి అయిన శ్రీరాముడు, విక్రముడై అంటే విజయుడు అయ్యాడు.

రాముని గొప్పతనాన్ని పోతన ఈ పద్యంలో వివరించాడు. 

ఇందులో ‘హరి’ పదానికి ఉన్న అనేక అర్థాలను వాడాడు కవి.

.

తపమనగ మత్స్వరూపము

దపమను తరువునకు ఫలవితానము నేనా

తపముననే జనన స్థి

త్యుపసంహరణము లొనర్చుచుండుదు దనయా!

.

భావం:

తనయా అంటే కుమారుడైన బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చి 

విష్ణుమూర్తి ఇలా పలికాడు... తపము + అనగ అంటే తపస్సు చేయడమంటే, మత్ అంటే నాయొక్క, స్వరూపము అంటే రూపము, తపము + అను అంటే తపస్సు అనెడి, తరువునకు అంటే చెట్టుకు, ఫలవితానము అంటే ఫలాలు రావడానికి కారణం, నేను అంటే నేనే, ఆ తపమున అంటే అటువంటి తపస్సు కారణంగానే, జనన + స్థితి + ఉపసంహరణము అంటే అంటే సృష్టిస్థితిలయ లను, ఒనర్చుచుండుదు అంటే చేస్తుంటాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!