శర్మ కాలక్షేపంకబుర్లు-గాంధర్వ వివాహం.(ప్రేమపెళ్ళి)

శర్మ కాలక్షేపంకబుర్లు-గాంధర్వ వివాహం.(ప్రేమపెళ్ళి)

.

గాంధర్వ వివాహం.

దుష్యంతుడనే రాజు పరిపాలన చేస్తూ వేటకై పరివారాన్ని వెంట పెట్టుకుని బయలుదేరి, వేటాడి, దగ్గరలో ఉన్న కణ్వాశ్రమంలో, కణ్వుని దర్శించి, నమస్కరించి వస్తానని, మంత్రులు, సేన అంతనూ దూరంగా వదలి కాలి నడకను కణ్వాశ్రం చేరి, అక్కడ కణ్వుని ఆశ్రమంలో, అపురూప లావణ్యవతి అయిన శకుంతలను చూశాడు. 

అందంలో జయంతునిలా ఉన్న దుష్యంతుని రాజుగా తెలుసుకుని అర్ఘ్య పాద్యాలిచ్చి కుశలమడిగింది, శకుంతల. అప్పుడు దుష్యంతుడు “వేటకని బయలుదేరివచ్చాను, ఆశ్రమం దగ్గరలో ఉన్నది కనక మునిని దర్శించి పోదామని వచ్చాను, వారెక్కడికెళ్ళేరు, వారి దర్శనభాగ్యం కలగలేదు” అని అడిగాడు. 

అందుకు శకుంతల “వారు ఇప్పుడే, అడవిలోకి పండ్ల కోసం వెళ్ళేరు, మీరు వచ్చేరని తెలిస్తే వెంటనే వచ్చేస్తారు” అంది. “వారు వచ్చేదాక ఒక ముహూర్త కాలం ఉండమని” కోరింది.

అప్పుడు దుష్యంతుడు ఆమెను కన్యగా ఎరిగి, ఆనందపడి, ఆమెను సర్వాంగ సుందరిగా చూసి, సంచలించిన మనసుతో, “నీవెవరి కుమార్తెవు, ఇక్కడికెందు కొచ్చావు, ఇక్కడ ఉండడానికి కారణం ఏమి” అని అడిగాడు. 

దానికి శకుంతల “నేను కణ్వ మహాముని కుమార్తెను” అని చెప్పింది. ఈమె ముని కన్య అయితే నా మనసెందుకు లగ్నమయిందని దుష్యంతుడు అలోచించి, ఈమె మాట నమ్మలేను, బ్రహ్మ చర్యవ్రతుడైన కణ్వుని కి కుమార్తె ఏమిటి అని ఆమె జన్మ వృత్తాంతం అడిగాడు. 

అప్పుడు శకుంతల తన జన్మ వృత్తాంతం చెప్పింది ( ఇది నిన్నటి టపాలో చెప్పుకున్నాం, కనక మళ్ళీ చెప్పటం లేదు.) ఈమె ముని కన్యేమోనని భయపడ్డాను, కాదని తెలిసింది, ఈమె కూడా నాయందనురాగయైయున్నదని, మదనాతురుడై, “ఈ నార చీరలు కట్టనేల, ఈ కుటీరాలలో నివాసమేల, ఈ మునిపల్లెలో ఉండనేల, నాకు భార్యవయి సౌఖ్యాలను పొందు, గొప్పవైన భవనాల్లో నివసించు” అన్నాడు. 

“వివాహాలుఎనిమిదిరకాలు,బ్రాహ్మ్యము,దైవము,ఆర్షము,ప్రాజాపత్యము,

రాక్షసము, ఆసురము,,గాంధర్వము,పైశాచికము. 

రాచవారికి గాంధర్వము, రాక్షసము యోగ్యమైనవి. మనకిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉన్నది కనక గాంధర్వ వివాహము ఉచితము” అనగా,

సిగ్గు పడుతూ శకుంతల ఇలా అన్నది. “మా తండ్రి ధర్మ స్వరూపుడు, మా నాన్నగారొస్తారు, వారు వచ్చి నన్ను నీకు ఇస్తే పెళ్ళి చేసుకో” అంది. 

అందుకు దుష్యంతుడు, “ఎవరికి వారే చుట్టాలు, గాంధర్వ వివాహం అంటేనే రహస్యం, మంత్రాలు లేనిది” అని ఆమెను ఒప్పించాడు. అప్పుడు శకుంతల, “నీ వల్ల నాకు కలిగే కుమారుడికి యువరాజ్య పట్టాబిషేకం చేస్తానంటే నీకూ నాకూ సంగమం అవుతుంది” అని చెప్పింది.

అందుకు దుష్యంతుడు ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుని ఆమెతో భోగాలనుభవించి, వెళ్ళిపోతూ, నిన్ను తీసుకు వెళ్ళడం కోసం మంత్రులు మొదలయిన వారిని కణ్వ మహాముని వద్దకు పంపుతానని చెప్పి తన పట్టణానికి వెళ్ళేడు.

ఒక సారి సింహావలోకనం చేదాం. 

శకుంతల తండ్రి లేనపుడొచ్చిన అతిధికి చేయగల సత్కారం చేసింది. అందరు మాట్లాడినట్లే మాట్లాడింది. దుష్యంతుని వైపు ఆకర్షితురాలయింది.

పరస్పరం మోహానికిలోనయ్యారు.

“నాన్నగారేరీ” అని అడిగినపుడు “ఇప్పుడే వచ్చేస్తార”ని దుష్యంతుని ఉంచే ప్రయత్నం, సంభాషణ కొన సాగించే ప్రయత్నం చేసింది. 

వివాహ ప్రసక్తి తెస్తే, ఒక సారి మాత్రం “నా తండ్రికి ఇష్టమయి నీకిస్తేతే వివాహం చేసుకో”మన్నది, రాజు గాంధర్వ వివాహం చేసుకోడం ధర్మమేనన్న 

మాటకూ, తనకూ అతనియందున్న కామోపభోగ లాలసకు లొంగి వివాహానికి ఒప్పుకుని, ఒక షరతు మాత్రం పెట్టింది, పుట్టబోయే పుత్రునికి యువరాజ పట్టాభిషేకం కావాలని. 

దీనికి దుష్యంతుడు ఒప్పుకుని సంగమించారు, గాంధర్వ వివాహం చేసుకుని. అప్పటికీ, ఇప్పటికీ అమ్మాయిల, అబ్బాయిల మనస్తత్వం మారలేదన్నదే నా ఉద్దేశం. 

తండ్రి వచ్చిన తరవాత వివాహం చేసుకుందామన్న మాటమీద నిలబడలేకపోయింది, ఇంద్రియ నిగ్రహం లేక. ఇప్పటి అబ్బాయిల లాగే దుష్యంతుడూ ప్రవర్తించాడు.

గాంధర్వ వివాహం అనగా పరస్పర ప్రేమతో అంగికారంతో జరిగే వివాహం, అప్పటికి, ఇప్పటికి, సమ్మతమే, కాదనడానికి లేదు కాని భద్రత దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినపుడు చిక్కులు కలుగుతాయి, అదే శకుంతల కూడా పడింది 

తరవాత, ఇప్పటివారు కూడా అటువంటి చిక్కులు ఎదుర్కుంటున్నారు…. శకుంతల చిక్కులు ఎలా పరిష్కారం చేసుకున్నదీ తర్వాత చూదాం.

శాకుంతలం అంటే శృంగారమే చూస్తున్నారు, ఈ తరవాత జరిగినదాన్ని పెద్దగా పట్టించుకోటం లేదు. మను చరిత్రలో మాయా ప్రవరునితో వరూధిని సంగమం తరవాత చదవక్కరలేదంటున్నారు, అలాగే శాకుంతలంలో కూడా, నిజంగా నేటి కాలానికి ఈ తరవాత జరిగినదే చాలా అవసరం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!