నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది!

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది!

మాటల ఐంద్రజాలికుడు శేషేంద్ర...................- 


.

శేషేంద్ర వచన కవితా కళను గురించి చాల తక్కువే పరిశోధన జరిగిందని చెప్పాలి. శేషేంద్ర పద్యరచనా సామర్థ్యం గురించి నేను కాదు నన్నయకన్నా ప్రాచీనుడైన విశ్వనాథ సత్యనారాయణ అంతటి ప్రాచీన కవే చెప్పాడు. శేషేంద్ర లాగా పద్యం రాయగలిగిన వాడు తెలుగు దేశంలో నలుగురైదుగురు కూడా లేరని అన్నాడు. 

ఆయన ఋతు ఘోష పద్య కావ్యం నాకు చాలా కాలం పారాయణ గ్రంథంలా ఉండేది. అంతటి పద్యరచనా కళను సొంత చేసుకున్న శేషేంద్ర వచన కవితలో కూడా చాలా మంచి ప్రయోగాలు చేశాడు. అంతే కాదు నేను ఎప్పుడూ అంటుంటాను అదేమంటే మామూలు వచనాన్ని అంటే కేవలం కమ్యూనికేషన్ కోసం అంటే విషయాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చే వచనాన్ని రాస్తూ కూడా అలాంటి వాక్యనిర్మాణాలు చేస్తూ కూడా దాన్ని అద్భుతమైన కవితగా మార్చే శక్తి ఒక రసాయనిక చర్య అని అది ఒక కళ అద్భుత కళ. ఇదే వచన కవితాకళ. అయితే అలాంటి పరిణతి ఈ కాలానికి వచ్చింది. తొలి తరం వచన కవులు చాలా మంది అంతకు ముందు పద్యాలు గేయాలు రాసిన వారే. ఆనాటి వచన కవితల్లో అర్థగేయాల లాగా కనిపించేవి చాలా ఉంటాయి. 

పాదాల విరుపును మార్చినా ఉద్దిష్ట అర్థాలు మారవు. అంటే ఇక్కడ పాదాల దైర్ఘ్యం యాదృచ్చికం అన్నమాట. అలాంటప్పుడు పాదాల విభజన ఎందుకు అని పాదాలు లేకుండా నవలలో లాగా కథలో లాగా బారుగా పంక్తులు పంక్తులుగా వచన కవితను రాస్తే తప్పేంటి అది కవిత ఎందుకు కాదు అనే ఆలోచనతో తొలిసారిగా వచన కవితను అలా ప్రచురించినవాడు (నాకు తెలిసి) శేషేంద్ర. 

నా దేశం నా ప్రజలు కావ్యాన్ని ఇలా ప్రచురించాడు. వచన కవితను కథలాంటి ప్రచురణతో అంటే పాదవిభజన లేకుండా ప్రచురించాడు. కాని ఇది వచనం కాదు అని కవిత అని చెప్పడానికి ప్రతి వాక్యం లేదా వాక్య శకలం అందులో సాక్ష్యంగా నిలుస్తాయి. . శేషేంద్ర వచనకవితా కళను గురించి ప్రత్యేకించి చెప్పవలసే ఉంది.

.

ఆయన రాసిన ఒక కవితను ఇక్కడ వివరంగా విప్పిచెప్పాలనుకుని ఈ పనిచేస్తున్నాను. 

ఆ కవిత “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అనేది. ఇది అందరికీ తెలిసినట్లు గా 1975లో ముత్యాల ముగ్గు సినిమాలో వచ్చింది. ముత్యాల ముగ్గు సినిమా షూటింగ్ చాలా భాగం జ్ఞాన్ భాగ్ ప్యాలెస్ అది అప్పటి శేషేంద్ర నివాసంలో జరిగింది. ఈ పాటగురించి చాలా సమాచారం ఉంది. ఇది శేషేంద్ర రాసిన ఒకే ఒక సినిమా పాట. కాని దీన్ని గురించి వేరే పెద్దలు చెప్పిందేమంటే ఇది అంతకుముందు రాసిన ఒక కవితకు పరిణామ రూపం అని. కాని శేషేంద్ర కుమారుడు సాత్యకి చెప్పడం మాత్రం వేరు. ఇది కేవలం ఆసినిమా కోసమే ఆయనతో రాయించారు. అని నూటనాలుగు డిగ్రీల జ్వరంలో పాట రాసారని. మద్రాసు సవేరా హోటల్ లో ఉండి రాసారని సాత్యకి స్వయంగా నాతో చెప్పారు.

కాని ఈ పాట, పాట లక్షణాల కన్నా వచనకవితలోని నిర్మాణ లక్షణాలను బాగా పుణికి పుచ్చుకున్నది. శేషేంద్ర వచన కవితను రాసే శైలి ఇందులో బాగా కనిపిస్తుంది.

.

“నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.

కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది.”

పాటలో నిజానికి సమతూకం ఉన్న పాదాలు అక్షర పునరావృత్తులు ఒక చోట ఎక్కడో యతి సాధారణంగా ఉంటుంటాయి. ఇందులో కొన్ని పాదాలలోనే మైత్రి కనిపిస్తుంది. మిగతా చోట్ల వచన కవిత నిర్మాణపు పోకడలు కనిపిస్తాయి.

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. ఈ పాదం నిజానికి ఆరోజుల్లో కాని తర్వాతి రోజుల్లో కాని ఏ సినిమా పాటల్లోను కనిపించని తరహా వాక్యం ఇది అచ్చు వచన కవితలోనే కనిపించే లాంటి వాక్యం. ఇలాంటిది మామూలు వచనం రాస్తే 

1. నిశ్శబ్దంగా ఉన్న గదిలోకి పనిమనిషి వచ్చింది. 

2. ఎవరూ లేని ఇంట్లోకి ఆవు జొరబడింది. 

3. గడ్డి ఏపుగా పెరిగిన తోటలోకి ఎద్దు వచ్చేసింది. 

ఇక్కడ చెప్పిన మూడు వాక్యాలు మామూలు వచనం అంటే వీటిలో వాచ్యార్థం తప్ప మరే అర్ధాలు లేవు. పని మనిషి వచ్చింది. ఆవు జొరబడింది, ఎద్దు వచ్చేసింది అనే క్రియా పదాలు కేవలం అక్కడ యదార్థంగా ఉన్న పనిని తెలిపే క్రియాపదాలు. కర్తలు పనిమనిషి, ఆవు, ఎద్దు ఈ మూడింటిలోను ఉన్న ఇల్లు పాసివ్ గా ఉండిపోయిన అచేతన వస్తువు. ఇది ఒక వాక్య నిర్మాణం, ఇలా మామూలు వాక్య నిర్మాణంతో ఎన్ని వాక్యాలైనా చేయవచ్చు. కాని వీటికి ఉన్నది వాచ్యార్థమే.

సరిగ్గా ఇలాంటి వాక్యాన్నే శేషేంద్ర ఇక్కడ రాసాడు. 

అది – నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది—- తోట నిదురించదు. కారణం నిదురించే లక్షణం ఉన్న సజీవికాదు తోటని నిర్జీవి అని చెప్పలేము కాని మనిషిలాంటి చలనశీలమైన జంతువులాంటి చలనశీలమైన జీవి కాదు. ఇలాంటి అచేతన వస్తువును ఇంగ్లీషులో చెబితే ఇనానిమేట్ ను ఒక సజీవంగా అంటే ఒక మనిషి గుణాన్ని ఆపాదించి అంటే ఏనిమేట్ లక్షణాన్ని ఆపాదించి నిదురించే తోట అని చెప్పాడు. అక్కడితో ఆగలేదు నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. పైన చెప్పిన వాక్యాలలో పనిమనిషి వచ్చింది, ఆవు వచ్చింది ఎద్దు వచ్చింది అనే నిర్మాణం లాంటి వాక్య శకలమే ఇది. కాని ఇక్కడ వచ్చింది అని చెప్పింది పాట. ఇది కూడా నిర్జీవం దీనికి కూడా జీవ లక్షణాన్ని ఆపాదించి వాక్యాన్ని రాశాడు. పూర్తయ్యే సరికే నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే వాక్యం పూర్తిగా వాచ్యార్థం ఏమాత్రం లేకుండా వ్యంగ్యార్థం అంటే అక్కడ లేని భిన్న ఉద్దిష్టార్థాన్ని ఇస్తుంది. ఇక్కడ నిజానికి తోటలేదు పాటా లేదు. ఒక నిర్జీవంగా ఉన్న నిరాశామయంగా ఉన్న నాయిక జీవితంలోనికి ఒక వ్యక్తి జీవితంలోనికి ఒక సంతోషకరమైన అమితానందకరమైన సంఘటన జరిగింది. ఒక అల్పుడైన కవి రచయిత రాస్తే ఇలాంటి శుష్కవచనాన్ని రాస్తాడు. కాని శేషేంద్ర వాక్యం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే వాక్య రచనలోనే మామూలు వచనాన్ని అద్భుతమైన వచన కవితగా మార్చిన ఇంద్రజాలం ఉంది. ఈ ఇంద్ర జాలం మిగతా పాటలోని వాక్యాలన్నింటిలో ఉంది.

దీని తర్వాత రెండు వాక్యాలు చూడండి —- రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ/ దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ —- ఈ రెండు పాదాల్ని మీరు గమనిస్తే ఇందులో పాట లక్షణమైన మైత్రి మీకు కనిపిస్తుంది. కాని వాక్యాలుగా పై వాక్యం వంటి వాక్యాలు కావు. వీటికి వాచ్యార్థాన్ని చెప్పవచ్చు, లక్ష్యార్థాన్ని ధ్వనినీ చెప్పవచ్చు. కాని నిదురించే తోటలోకి అనే వాక్యంలో వాచ్యార్థాన్ని చెప్పడం కుదరదు. తర్వాతి వాక్యం —శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ— ఈ వాక్యానికి వాచ్యార్థం చెప్పడం కుదరదు. నాయిక భావనాస్థితే వర్ణితం ఇక్కడ.

తర్వాతి చరణం మరింత గాఢంగా ఉంటుంది. చూడండి. విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో/ ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి. —విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో— వాక్యాన్ని ఇలా చెప్పడం అద్భుతమైన వచన కవితా ప్రయోగం. కోర్కెలు అనేవి సజీవ ప్రాణులు కాదు అంటే ఇవి మనః స్థితిని చెప్పేవి. గుమ్మంలో కోర్కెలు వేలాడడం అన్నది నిర్జీవ అమూర్త విషయానికి మూర్తమైన ఒక వస్తువు లక్షణాన్ని ఆపాదించడం. మామిడి ఆకులు వేలాడాయి అంటే మాములు వచనం అవుతుంది. ఇక్కడ కోర్కెలు గుమ్మంలో వేలాడాయి అని చెప్పాడు. ఇలా అమూర్త విషయాలకు మూర్త లక్షణాన్ని ఆపాదించి వచన కవితలో వాక్యాన్ని రాయడం అన్నది అద్భుతమైన టెక్నిక్. శేషేంద్ర చేసిన దీన్ని బాగా ప్రతిభావంతంగా పట్టుకున్న తర్వాతి తరపు వచన కవి అఫ్సర్. అఫ్సర్ రాసిన రక్త స్పర్శ కవితల్లో చూస్తే ఇలా అమూర్త విషయాలకు మూర్త లక్షణాన్ని ఆపాదించే టెక్నిక్ కనిపిస్తుంది. సైగల్ పాటమీద రాసిన కవితలో ఈ లక్షణం ఉంది. చాలా చోట్ల ఉంది.

ఈ టెక్నిక్ ని అఫ్సర్ ఇప్పటికి కూడా చాలా విరివిగా వాడుతున్నాడు. యాకూబ్ తన కవితల్లో దీన్ని ఇంకా రిఫైన్ చేయడం కనిపిస్తుంది. ఇంకా ఇద్దరు ముగ్గురు కవులు ఈ టెక్నిక్ ని చాలా ప్రతిభావంతంగా వాడుకున్నారు. అంటే ఇక్కడి నాఉద్దేశం శేషేంద్రని అనుసరించారని చెప్పడం కాదు. ఒక వచనకవితా కళని వారు పట్టుకున్నారు. దాన్ని మరింత ప్రతిభతో మరింత గట్టిగా పాఠకులకి అందజేశారు.

ఇక పాటలో తర్వాతి వాక్యాలు పూర్తిగా ఇదో ధోరణిలో సాగుతాయి.—–కొమ్మల్లో పక్షుల్లారా!/ గగనంలో మబ్బుల్లారా! / నది దోచుకుపోతున్న నావను ఆపండీ!/ రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ—- పాటలో చివరి వాక్యం రేవు బావురు మంటూందని నావకు చెప్పండి అనేది గుండెను పిండేస్తుంది. రేవు బావురు మనడం కూడాపైన చెప్పిన కళే. నావ నదిని దోచుకు పోతుంది అని చెప్పడం శేషేంద్ర వంటి అత్యంత ప్రతిభాశాలి సృజన శీలి మాత్రమే అనగలిగే మాటఇది. నాయకుని కోల్పోయిన ఒక నాయిక మనఃస్థితిని ఇంత గాఢంగా ఇలా వర్ణించిన కవిత కాని సినిమా పాట కాని మరొకటి కనిపించదు.

నిజానికి ఈ పాట సినిమా పాట లక్షణాలతో రాయలేదు. సినిమా పాటలో లేని సాధారణంగా పనికి రాని వచన కవితా లక్షణాలతో రాసిన పాట ఇది. ఈ పాట క్లాస్ పాఠకులను కవితా ప్రియులను గాఢంగా ఆకట్టుకున్నట్లుగా మామూలు సినీమా ప్రేక్షకులను మాస్ శ్రోతలను ఆకట్టుకోలేదు. ఈ పాట బాగుందని ఏ సినిమా నిర్మాత కాని, సంగీత దర్శకుడు కాని శేషేంద్రని పాటలు రాయమని కోరలేదు. ఆలా ఊహించి కూడా శేషేంద్ర ఈ పాట రాయలేదు. కావాలంటే సినిమా మాస్ పాటని అవలీలగా రాయగలిగిన ప్రతిభావంతుడు శేషేంద్ర కాని తన కవితావ్యక్తిత్వానికి భిన్నంగా రాయలేదు. వచనంలో శేషేంద్ర చేసే ఐంద్రజాలిక చర్యకి మంచి ఉదాహరణ సినిమా పాటల్లో అనర్ఘరత్నం ఈ నిదురించే తోట పాట.

——————————————————-

చిత్రం : Muthyala Muggu(ముత్యాలముగ్గు) (1975)

రచన : గుంటూరు శేషేంద్ర శర్మ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి.సుశీల

Song Lyric : Nidurinche thotaloki paata okati vachindi

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ

దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ

ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ

విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో

ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి

కొమ్మల్లో పక్షుల్లారా!

గగనంలో మబ్బుల్లారా!

నది దోచుకుపోతున్న నావను ఆపండీ!

రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!