పురుషునకు విద్యయే ఆభరణము !

పురుషునకు విద్యయే ఆభరణము !

శ్లోకం:

యూరాణి, న భూషయన్తి, పురుషం, హారాః, న, చన్ద్రోజ్జ్వలాః,

న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలఙ్కృతాః, మూర్ధజాః, 

వాణీ, ఏకా, సమలఙ్కరోతి, పురుషం, యా సంస్కృతా, ధార్యతే,

క్షీయన్తే, అఖిల భూషణాని, సతతం, వాగ్భూషణం, భూషణమ్.

శబ్దార్థం:

కేయూరాణి = భుజ కీర్తులు లేదా దండ కడియాలు, న భూషయన్తి = అలంకరింపవు, పురుషం = పురుషుని,

హారాః = ముత్యాల హారములు, న = న భూషయంతి = అలంకరింప బడవు, చన్ద్రోజ్జ్వలాః = చంద్రును వలె ప్రకాశించునటువంటి,

న స్నానం = పన్నీటి జలకాలు అలంకరింపవు, న విలేపనం = పచ్చ కర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, మంచి గంధము మొదలగు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన మైపూత అలంకరింపవు, న కుసుమం = పూవులు ధరించుట అలంకరింపదు, నాలఙ్కృతాః = అలంకరణలని ఈయజాలదు, మూర్ధజాః = వివిధ రకాల కేశాలంకరణలు,

వాణీ = ఏ వాక్కు, (సా = ఆ వాణి) ఏకా = ఒక్కటియే, సమలఙ్కరోతి = సరిగా అలంకరించునది, పురుషం = పురుషుని, యా సంస్కృతా = వ్యాకరణాది శాస్త్రములచే సంస్కరింప బడినటువంటి, ధార్యతే = ధరింపబడుచున్నదో,

క్షీయన్తే = కాలక్రమేణా నశించును, అఖిల భూషణాని = మిగిలిన అఖిలములైన భూషణాలు, సతతం = ఎల్లప్పుడూ, వాగ్భూషణం = వాక్కు అనే ఆభరణము, భూషణమ్ = నిజమైన ఆభరణము.

ఖలు = కదా!

.

భావార్థం:

వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.

భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.

చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణల పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.

వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.

భర్తృహరి యొక్క సుభాషితములలోని నీతి శతకములో వాక్కు యొక్క ప్రాసస్థ్యాన్ని తెలియపరచే తలమానికమైనట్టి ఈ సుభాషితమునకు, ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి ధీటైన తెలుగు సేత ఈ క్రింది పద్యము.

ఉ.భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,

భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ 

భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా

గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్ .

All India Radio ఆకాశవాణి సంస్కృత భాషాధ్యయన కార్యక్రమములో గత 40 సంవత్సరాలకి పైగా ఆ కార్యక్రమము ఈ శ్లోకముతోనే ఆరంభమగుట ఈ శ్లోకము యొక్క విశిష్టతని తెలియజేస్తోంది. ఇది చాలామందికి సుపరిచితమైన సుభాషితము. పురుషునకు విద్యయే ఆభరణము కాని వేరు కాదు అని సుస్పష్ఠము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!