భోగినీ దండకము బమ్మెర పోతన!

భోగినీ దండకము బమ్మెర పోతన!

**సింగభూపాల వర్ణనము**

శ్రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాకలాదుర్లభున్‌ దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్‌ సింగభూపాలు

**సింగభూపాలునిఁ గాంచి భోగిని మోహించుట**

భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో నుండి జాలాంతరాళంబులన్‌ వారయోషాతనూజాత విద్యానయోపేత సౌందర్య చాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగనాలబ్ధ కేళీ మహాహస్తకంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషు నీకాశయై యుండి దర్శించి తద్వైభవంబుల్‌ విమర్శించి సంతోష బాష్పాంబు పూరంబు వర్షించి హర్షించి కందర్పబాణాహతిం జెంది లోఁ గుంది మోహించి సంగంబు నూహించి యే వేళఁ దల్లిన్‌ బ్రమోషింతు? నేలీల భూపాలకున్‌ జేరి భాషింతు? నేరీతిఁ గామానలంబున్‌ నివారింతు? నేనాతితోడన్‌ విచారింతు? నే వెంట రాచూలి వంచింతు? నేవంకఁ గోర్కుల్‌ ప్రశంసింతు? మున్నేఁ బ్రశస్తార విందంబు నైనన్‌ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబునై యుందుఁబో రత్నహారంబునైనన్‌ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో! యేల యిట్లైతి? నెట్లో గదే! యంచు శంకించుచున్‌ నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్‌ మనోవీథి నంకించుచున్‌ ఘోషమాణాలికిన్‌ మందవాతూలికిన్‌ జంద్రమః కీలికిన్‌ గోకిలారావ దంభోళికిన్‌ జిత్తభూభల్లికిన్‌ దల్లికిన్‌ లోఁగి సంతాప ఘర్మాంబులన్‌ దోఁగి కామానలజ్వాలలన్‌ వేఁగి చింతా భరా క్రాంతయై క్రాఁగి చింతించు నింతిన్‌ బరీక్షించి బుద్ధిన్‌ విచక్షించి తన్మాతమాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత లోకైక విఖ్యాత వారాంగనాధర్మ శిక్షాది సంభూత సమ్మోహితానేక రాజన్య సంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి కూఁతున్‌ బరీక్షించి నీతిన్‌ విచారించి బాలన్‌ గళత్కుంతల వ్రాతఫాలన్‌ గరాంభోజ రాజత్కపోలన్‌ సమందోష్ణ నిశ్శ్వాసజాలన్‌ విపర్యస్త సన్యస్తచేలన్‌ మహాందోళన ప్రేంఖిత స్వర్ణడోలన్‌ మృగేంద్రావలగ్నన్‌ దయావృష్టిమగ్నన్‌ మనోజాగ్నిభగ్నన్‌ నిరంధన్‌ బరిస్రస్త ధమ్మిల్ల బంధన్‌ సముద్విగ్న మోహాను బంధన్‌ నిరాలాప నాలాపనస్వీకృతానేక కేయూరహారన్‌ గలద్పాష్పధారన్‌ బరిత్యక్త లాస్యన్‌ బరాభూత లీలావయస్యన్‌ బదాలేఖనాలక్షిత క్షోణిభాగన్‌ బరిక్షీణరాగన్‌ విలోకించి బుద్ధిన్‌ విచారించి లోనం బరాయత్తయై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై విన్నయై ఖిన్నయై యున్న భావంబు భావించి నెయ్యంబు గావించి రావించి

**వేశ్యమాత కూఁతునకు బుద్ధులు చెప్పుట**

బాలా! జడత్వంబు మేలా? విచారింపనేలా? విలోకింపు బేలా! వయోరూపసౌందర్యముల్‌ రిత్తగాఁజేయు నీవృత్తికిన్‌ మెత్తురే? వత్తురే కాముకుల్‌? చొత్తురే డాయఁ? గాయంబు విద్యున్నికాయోపమేయంబు హేయంబు ప్రాయంబు ధారాధరచ్ఛాయ మెన్నే నుపాయంబులన్‌ విత్తమాయత్తముం జేయ కీ రిత్తవాదంబు లాడంగ లాభంబె? లాభానకుం గారణంబైన నా మాట నేరంబె? నేరంబుగా దీ విచారంబు వంశానుచారంబు సంసారసారంబు లాభాధికారంబు చర్చింప నీబోఁటికిన్‌ బిట్టలంకారమే కాని ధిక్కారముం జేయరాదీ విచారంబు లేలే? శుభాకార! యేలే! గుణోదార! యేలే? శుభోదార! యేలే? తటిద్దేహ! యేలే? వరారోహ! యేలే? లలాటాలకవ్యూహ! యేలే? మహోత్సాహ! యేలే? విరాజమ్మ ఖాంభోజ! యేలే? మహోరోజ! యేలే? కలాలాప! యేలే? జగన్మోహన ద్రూప! యేలే? చలచ్చంచలాలోకన వ్రాత! యేలే? నయోపేత! యేలే? మహామర్మ భేదంబులై కౌముదీ మూలకందంబులై చూడనందంబులై సుప్రసాదంబులై మోహనశ్రీవిలాసంబులై యున్న నీ చారు హాసంబులన్‌, సోలి యోలిన్‌ భుజంగాలి జాలిన్‌ బడన్‌ దార్చుటో కాకలోలంబులై మోహ జాలంబులై చంచలాభంబులై మోహితాశేష లోకంబులై యొప్పు లీలావలోకంబులన్‌ బ్రౌఢలోకంబులన్‌ సద్వివేకంబులన్‌ బాపి తాపాతిరేకంబులన్‌ గూర్చుటో కాక తోరంబులై మధ్య భారంబులై నిర్జితానంగ సౌధోపరి స్వర్ణ కుంభంబులై యొప్పు నీ విప్పు వక్షోజకుంభంబులన్‌ జూపి పౌరావళిన్‌ నర్మలీలాకురంగావళిం జేసి నిర్జించి వర్జించుటో కాక రాజత్రిలోకీవశీకార మంత్రంబులై యుల్ల సత్కామ తంత్రంబులై దర్పకోద్రేక యంత్రంబులై మోహవారాశి భంగంబులై సూచితానేక నర్మ ప్రసంగంబులై కామకేళీ కలాపంబులై యొప్పు నీ భాసమా నానులాపంబులన్‌ విత్తవల్లోక చిత్తంబులన్‌ రాగమత్తంబులం జేసి తత్తన్నిమిత్తంబులన్‌ నిత్యమున్‌ విత్త మెల్లం బ్రమోషించి దూషించి నిర్జించి తర్జించుటో కాక నీకీ కులాచారముల్‌ మాన నేకీర సల్లాప బోధించెనో? నేఁడు నీతోడు నాతోడు మాటాడుమా చూడుమా! కన్యకాలోకచింతామణీ! బంధుచింతామణీ! గోత్రరక్షామణీ! ధీమణీ! యెవ్వరెవారి భూషించిరే? యేమి భాషించెరే? నేఁడు నీతోడఁ గ్రీడించు ప్రోడల్‌ కుమారీ! కుమారాన్న పోతావనీనాథ సూనున్‌ వధూచిత్తవిత్తాపహారావధానున్‌ సదాదానవిద్యానిరూఢున్‌ మనోజాతహృద్యానవద్యైక విద్యావలీఢున్‌ ప్రభాభానురాగానుసంధాను మాయారమానాథు సర్వజ్ఞసింగక్షమానాథు నే సన్నిధానంబునన్‌ జెప్పిరో? ఏమి వాతప్పిరో? యప్పరో! యప్పయోజాతగంధల్‌ సదాసత్యసంధల్‌ పురిన్‌ నీ వయస్యల్‌ మహాసౌమనస్యల్‌ సువర్ణా! సువర్ణంబు లార్జించుటల్‌ చూడవా? చూడ వాంఛింతురా రాజులన్‌? వారలా రాజులం గానరా? రాజుఁ గామింతురా? రాజబింబాననా! రాజరాజాధి రాజోన్నతిన్‌ రాజులన్‌ మించి రాజిల్లు నారాజు వంచింప నెంచంగ శోభిల్లునే చెల్లునే? భూమి నేజాతి యీరీతి నీతిం బ్రకాశింప కీభంగి రాజిల్లునే? చెల్లఁబో! నీ పటుత్వంబు వాచాకటుత్వంబు బాలేందుశోభాలికా! బాలికా! బాలికల్‌ సేయు యత్నంబులే నీ ప్రయత్నంబు? లంభోజనాళాంతరాళ స్ఫురత్తంతుయోగంబునన్‌ జిక్కునే గంధనాగంబు? మిథ్యా మమత్వంబులన్‌ రంజకత్వంబులన్‌ గూఢయంత్రంబులన్‌ మోహమంత్రంబులన్‌ మారుతంత్రంబులం జిక్కఁడే చొక్కఁడే దిక్కులన్‌ జిక్కులం బెట్టు మేధన్‌ మహావేధనైనన్‌ విరోధించి వాకట్టు నీతిన్‌ బలారాతి మంత్రిన్‌ బ్రమోషించు భాషావిశేషంబులన్‌ శేషుతోనైన భాషించు మాయావిధానంబులన్‌ మాధవున్‌ మెచ్చఁడచ్చోట నెచ్చోట మెప్పించెదే! చీటికిన్‌ మాటికిన్‌ బోటి! యామేటి యిచ్చోటికిన్‌ రాఁడు పాటించి నీపాటి పాఠీననేత్రల్‌ ధరిత్రీశు చిత్తంబు మత్తంబుగాఁ జేయఁగాఁ జాలరే యేల రేలుంబగళ్ళున్‌ విచారింపఁ? జాలింపవే! వారవేశ్యాభుజంగుండు గాఁడే మహారాజవేశ్యా భుజంగుండు నిన్నేల యేలున్‌? బరస్త్రీలకున్‌ వేళ యీఁ డెన్నఁడున్‌ దత్తుఁ బాంచాలు భద్రున్‌ మరున్‌ గూచి మారున్‌ వినంగోర కేరీతి నేనాతిచే వింటి వేమంట నీవంటి దీవెంటలన్‌ దంటయై గెంటిపోఁ జూచునే? తమ్మికంటీ! నినుంగంటి నీవెంటకాహా! కనుంగంటి నీగొంటు చైదంబు దైవంబు క్రేఁగంటి కేనెంత కంటైతినో! జంట నింటింటికిన్‌ వెంటవెంటం బడన్‌ బంటనే? తాళనంటిన్‌ జిరంటీ! చెనంటీ! గుణం బేటికే? మాయలాఁడీ! విభుండైనఁ బోఁడే! నిమగ్నుండు గాఁడే! మముం జేరనీఁడే! నినుంజేరరాఁడే! ప్రవేశింప రాదే! ప్రమోషింప వాదే! ప్రవర్తింపఁ గాదే! ప్రవర్తింతువెచ్చోట నచ్చోటి కేమేఁ బ్రియంబాడ రామే! నినుం బాయలేమే! మహోపాయవై కన్యకా! ధన్యు నన్యున్‌ మదిం గోరుమా! చేరుమా చేరు మా కిష్టముల్‌ వీట లేరే మగల్‌? చేర రారే నినుం గోరి తారే విహారేహులై గేహళీ వాటికిన్‌ మాటికిన్‌? వచ్చు నేవారి నీవారిగాఁ జూడవున్‌ గూడవున్‌ వారిజామోద! యీ వారరామల్‌ మనోరాములన్‌ రిత్తపోరాములన్‌ గాని నిక్కంపుఁ బోరాములం జేసి గారాములం జిక్కిరే? సొక్కిరే? వారు వారాది కృత్యంబులం జేయు వార క్రియల్‌ చెల్లవే తల్లి!

**రాజదూషణము**

రాజుల్‌ బహువ్యాజులే భోజులే? చంచలచ్చిత్తులే! మత్తులే! వ్రేతఁ కాయత్తులే! నూతనాసక్తులే! లోభ సంయుక్తులే! దోషసంసిక్తులే! రంధ్రసంపాదులే! వీత మర్యాదులే! వారి సేవింప భేదింప జీవింపఁ బోరామిఁ గావింపఁగా రాదులే! కాదులే వాదులేలా? నవైలాలతా దేహ! సందేహమే దేహమేలే యలంపన్‌? నిలింపాంగ నాభా! సునాభా! మదిన్‌ మానవే మానవేశాభిలాషంబు లేమా! భరింపంగ లేమా? కరంగింప లే మానరేశున్‌ జితశ్రీసురేశున్‌ గతస్త్రీజితోద్దండ వేదండ చండాహితా ఖర్వగర్వాంధ వేదండ గండస్థలీఖండితారాతిదండంబు గండంబుగా నుండు నమ్మండలేశున్‌ విరాజన్ముఖాంభోజు నాభోగినీ రాజుతో నోజతో నీకుఁ బొత్తుండఁగాఁ బోలునే? నీకు మాదండ నేదండమున్‌ జెందదే చెల్లునే? రాజదండంబు గండంబు గండంపుటండంబుగా నిక్షుకోదండ విభ్రాజిత భ్రూయుగా! భూమిపాలావరోధంబు లేలా? విరోధంబు నీకున్‌ మహాభద్రమా? భద్రమాతంగకుంభస్తనీ! కన్న వారంబు గామా? హితాదేశముల్‌ సేయఁగా మాకు ధర్మంబు కామాశుగా లోకనా! యేల కామాతురత్వంబునుం జెంద? రామా! త్రిలోకాభిరామా! వరాలేపహేమాదులున్‌ నీకు నీమా? కులోత్తంస! యే మాకులత్వంబునుం బొంద మామాట లేపాటివే? మాటు లాలించు వారిన్‌ నిరీక్షింప కీ మానవాధీశుపై మానసం బేల పట్టించెదే? ముద్దుపట్టీ! భవచ్చాతురిం బట్టి సర్వజ్ఞసింగ క్షమానాథుఁ దప్పించి దర్శించి లోకత్రయిన్‌ నీకు నర్పింతునే మారునిన్‌ జారునిన్‌ జేసి రప్పింతునే బ్రాఁతియే పైఁడి? నా పైఁడి! యే పైఁడి లేదింటిలో? వింటివా? రాచపోరామి యిట్టట్టుఁ బోరామికిన్‌ మూలమే! మేలమే? యింత రవ్వేలనే? యిందు నవ్యార విందాననా! ముందు విందానవే! లాట కర్ణాట పాంచాల నేపాళ బంగాళ చోళాది రాజన్యకన్యల్‌ వయోరూప ధన్యల్‌ సదాసక్తలై డాసి యున్నారఁటే! రారఁటే పాసి తత్పాద రాజీవ సందర్శనారంభ సంరంభులై వీతహృద్దంభులై కుంభినీశుల్‌ బహూపాయన ద్రవ్యహస్తుల్‌ సురూప ప్రశస్తుల్‌ మహాసక్తి నక్తందినంబుల్‌ ప్రవేశించి యున్నారు కన్నారు విన్నారు లోకుల్‌ వరాలోక! నీకేల లీలావకాశంబు సిద్ధించు? సిద్ధించెనా మన్మథాకారుతోఁ గూడి క్రీడింపఁగాఁ బోలదే పోలినన్‌ వాని వాణిన్‌ మహావాణి కాఁపున్నదే! మన్నదే రత్న గర్భంబుతో భూమి తద్భాహుపీఠిన్‌ దిశా కుంభికుంభీనసాగేంద్ర కూర్మాదులన్‌ బాసి కూర్మిన్‌ విలోకంబులన్‌ లచ్చి వర్తించునే దిక్కులందెల్ల కీర్తుల్‌ ప్రవర్తించునే దుర్లభుండే బహుప్రేయసి వల్లభుండే! సదైకానుషంగంబు భంగంబు పణ్యాంగనాజాతికిన్‌ ఖ్యాతికిన్‌ నీతికిన్‌ దప్పితే? చెప్పితిం గూన! సిద్ధంబు తద్ధాత మున్‌ వారభామా తనూజాతకున్‌ గూఁతుగా మాతనూజాతఁ గావించె నిర్ణీతమే యేతదర్థంబు మర్యాద నిమ్మేదినిన్‌ వారమే నాదినుండిం బ్రయోగింతునే దాదినై కామశాస్త్రాదివిద్యాసమేత\న్‌ భవన్మాత నుద్దామ మాయా ప్రభూతన్‌ గురంగీవిలోకా! నిరంగీకృతా కారతల్‌ మాని నామాట నీమాటు పాటింపవే నందినీ! నిందనీయంబు గాదే మహానందనీయంబు చిత్తంబుతో నుండు నీవే జనానందనీయా! కఠోరాచలోద్దండకాఠిన్యమున్‌ డింప రత్నాకరశేణి లోఁతున్‌ నివేదింప విత్తేశు గేహంబులున్‌ రిత్తసేయన్‌ జగచ్చక్షువున్‌ గన్ను మూయన్‌ సదాగామి నాఁకట్ట నుద్యద్భుజంగావళిం బట్ట వారాంగనాజాతికిన్‌ న్యాయమే? మామకన్యాయ సంపన్నవై పన్ని యోకన్య నీవన్యులన్‌ బౌరసంపన్నులన్‌ భిన్నులన్‌ ఖిన్నులన్‌ జేసి మన్మందిరాళిందభూమండలాసన్నులం జేయుమీ! రాచబిడ్డేటికే? బిడ్డ! వాచాటతల్‌ సాఁగవే సాఁగినన్‌ నీకు జూదంబులా? కాక వీణావినోదంబులా? గద్యపద్యాదివాదంబులా? మాళవీముఖ్య రాగానుగానంబులా? దండలాస్యాది నృత్యావధానంబులా? యింద్రజాలాది మాయావిధానంబులా? వశ్యమంత్ర ప్రయోగోపసంహారవిద్యావిచార ప్రభావంబులా? రామ! యారామవాటీలతాజాలమూలాభిషేక ప్రచారంబులా? హేమడోలావరోహంబులా? కాక కేళీసరోవ్యూహవీచీ సమూహావగాహంబులా? బంధుగేహ ప్రవేశంబులా? రాజ హంసావళీమందయానోపదేశంబులా? నీలకంఠావళీనృత్య శిక్షావిశేషంబులా? కాముకవ్రాతచిత్త ప్రమోదంబులా? బొమ్మరిండ్లాటలా? యాటలా? పాటలా? పాటలామోద! రాజోపకంఠాటనంబుల్‌ కఠోరాసిధారా వలేహంబులే! సింహ యోగంబులే! సర్పవల్మీకభోగంబులే! శైలశృంగాగ్రవీథీ విహారావధానంబులే! తుంగ తాళాగ్రకోటీ తపస్సంవిధానంబులే! మత్తశార్దూలకుంజప్రవేశంబులే! గంధశుండాలశుండా వినోదంబులే! సప్రమాదంబులే! కొమ్మ! మా కొమ్మ కేరాజు సఖ్యం బసౌఖ్యంబు మేమొల్లమే మొల్లముల్‌ మాకు లాభంబులే? డించ కేవేళ నెమ్మోము సొంపారు? నేవేళఁ బాలిండ్లు పెంపారు? నేవేళ ఫాలంబునన్‌ గుంతలశ్రేణు లల్లాడు? నేవేళ మైదీఁగెయున్‌ వీడు? నేవేళ నాయాసముల్‌ తీఱు? నంచుం బ్రతీక్షింప నీవింతవై వంత లెన్నేనిఁ గల్పించెదే? యింత నీవంతయై నేఁడు నాసింగభూపాలు పాలై ప్రవర్తించుచోఁ గంబుకంఠీ! భవద్దర్శనో త్కంఠతన్‌ రాజ గేహోపకంఠంబులన్‌ వచ్చునీవారి వారింతురే వారిదౌవారికుల్‌ వారధర్మంబువా రంచు దుర్వారులై తన్మహాగేహ నిర్యూహసేవారతాయాత భూపాలక వ్రాతవేదండగండస్థలీ నిస్సరద్దానధారావళీ జాతజంబాలసంఘంబు దుర్లంఘనీయంబు మాకున్‌ మహాదుర్గమంబే చొరన్‌ నిర్గమింపన్‌ మహోత్సాహవై వత్స! మత్సాహచర్యంబుఁ గైకొమ్ము! రమ్మంచు లెమ్మంచు

**భోగిని విరహముచేఁ దల్లిపైఁ గోపించుట**

బోధించు తల్లిన్‌ ధనాదానవిద్యామతల్లిన్‌ విటస్వాంత భల్లిన్‌ నిరూపించి కోపించి బుద్ధిన్‌ బ్రదీపించి యమ్మా! వినంజూడ నేనొల్లఁ బొమ్మా! విచారించుకొమ్మా! భవన్నీతి దుర్నీతి సన్మానుషం బింతయున్‌ లేని దుర్మానవశ్రేణి నీవేల? యీవేళభూషించెదే! యేలభాషించెదే? యేల నన్నుం బ్రమోషించెదే? రాయచౌహత్త మల్లున్‌ వధూటీసరోజాతభల్లున్‌ మహారాజవేశ్యాభుజంగన్‌ హయానేకప గ్రామహేమాది నానామహాదానచంగున్‌ వధూలోకపాంచాలు సర్వజ్ఞసింగభూపాలుఁ గైకొంట తప్పే? కకుప్పాలసంకాశుఁడే! వానియొప్పుల్‌ సతుల్‌ చెప్పరే? యేల నొప్పింప? మాతల్‌ తనూజాతలన్‌ జాతవిత్తాశలన్‌ బేశలత్వంబు లే కర్మిలిం బాసి నారోటు? రారోటు రక్షారతిన్‌? గోర్కు లేరోటు! నీవింత నెగ్గింప నెగ్గేమి గావించితిన్‌? లోకనిర్మాత నిర్మాతగాఁ జేయ కేలా సదుర్మాతఁ గావించె? విజ్ఞాతయోషామనోవృత్తసంఘాతవున్‌ మాతవున్‌ గామసిద్ధాంతవిఖ్యాతవున్‌ జూడ నేతద్దురాలాపముల్‌ చిత్తసంతాపముల్‌గాఁబ్రయోగింతురే? కూఁతుఁ జింతానదిన్‌ ముంతురే? పిన్న నాఁడెల్ల నాఁడెవ్వరింగోరవే? మున్ను రంభోర్వశీమేనకాదుల్‌ సుకందర్ప సిద్ధాంతవేదుల్‌ వశీకార విద్యా ధురీణల్‌ ప్రవీణల్‌ వరశ్రేణి నూహింపరే? చూచి మోహింపరే? వారలూహింపరే నీతులన్‌? నిర్దయా లాపవై పాపవై పాపవేలా మనోజన్యథన్‌? నిన్ను నేమందు నేమందులన్‌ మానదే మానసత్త్వంబు చింతింపు మవ్వా! విభుండేమిదవ్వా? యెఱింగించి రప్పించెదో? కాక కామానలజ్వాలకున్‌ నన్ను నొప్పించెదో? యింతఱంతేల నీకున్‌? గొఱంతేల సద్ద్రవ్యముల్‌ తల్లి! నేనెల్ల వేళన్‌ మనోజాగ్నిఁ గంది లోఁగుందఁగా మ్రంద నీమందటల్‌ చాలు ముందేటికిన్‌ గంటివే? కెంటసం బేల? ఘంటాభవై మ్రోసెదే? యన్యకున్‌ గన్య గానైతి నుద్దామశృంగారుపై దీనమందారుపై భూమిభృద్గాయగోవాళుపై రాయశుండాలహర్యక్షుపై రాయ కందర్పఫాలాక్షుపై రాయగోపాంగనా బృందగోవిందుపై సంతతానందుపైఁ బోచమాంబా లసద్గర్భసంజాతుపై లోకవిఖ్యాతుపైఁ బాదపీఠాంకితారాతి భూపావళీపాలుపై సింగభూపాలుపై వ్రాలి నా చిత్తమున్‌ మత్తమై సోలి కామానలాయత్తమై రాదు తేరాదు నే నా మరుండైన గౌరీవరుండైన వాణీధరుండైన దేవోత్తరుండైన నన్యున్‌ మదిన్‌ గోరఁగా నొల్లనే యుల్లసత్ఫుల్ల మందార రాజన్మరందంబు నందంబునన్‌ గ్రోలు మత్తాళి దుత్తూర మున్‌ గోరునే? హేమరాజీవ రాజీరజోరాజితాకాశగంగానదీ లోలకల్లోలడోలానటద్రాజహంసంబు శైవాలగండూపదీభేక భేకీఢులీసంకులాసారకాసారమున్‌ జేరునే? మండితాఖండలానీత జీమూత నిర్యత్పయోధారలన్‌ ద్రావు సారంగి కుంభాంతరాంభః ప్రపూరంబులన్‌ ద్రావునే? మాధవోజ్జాతచూతాంకుర స్వాదులీలాలసత్కోకిలేంద్రంబు ఝిల్లీవర క్రూరభల్లాతకీ శాఖకున్‌ బోవునే? సింగభూపాల బాహాపరీరంభసంరంభసంభోగమున్‌ గోరు యోషా శిరోరత్న మాశించునే, నీచసంభోగ మంబా? కుతర్కావలంబా! చలంబా! విలంబానులాపంబులన్‌ బాల సూర్యాభునిన్‌ బాయ నాడన్‌ బురోభాగినీ! భోగినీ రాజు కంటెన్‌ మహాభాగు నాభాగసౌభాగ్యశోభాగరిష్ఠున్‌ బ్రవేశించి నృత్యావధానంబులన్‌ మంజుగానంబులన్‌ జిత్తమార్జింతునే విత్తమున్నే నివర్జింతునే యెట్టిదిన్‌ విత్తమేరిత్తమై యేటికే? నిత్యదంభా! దురాలాపయుక్తిన్‌ బ్రలోభింప విద్వేషినే? యేలనే? గోలనే? బాలనే? నేరనే! మానలేనే వరాధీశచూడామణిన్‌ వారకన్యాజన గ్రామణీ! పాపజాతీ! భవజ్జాతి దుర్జాతి పొమ్మంచు లెమ్మంచు నోచెల్ల! రేచెర్లగోత్రోద్భవున్‌ మానలేనంచు మాయోన్నతా! యన్యులన్‌ జేరలేనంచు హృద్భల్లితో వక్రవాగ్భల్లితోఁ దల్లితో మాటఁ జాలించి ధైర్యంబుఁ గీలించి శాతోదరిన్‌ సోదరిన్‌ జూచి యక్కా! ప్రసూనాస్త్రు ధిక్కారమున్‌ జూచితే? నేఁడు రాకేందురాకన్‌ దురాకంపమున్‌ బొందె డెందంబు చైతన్యసంచాలియై కీలియై గాలి యేతెంచెఁ గోదండియై దండియై తూణియై బాణియై కంపిత ప్రాణియై కాముకారాతి యేతెంచె వాసంత వేళారమాకందమాకందశాఖావళిన్‌ గోకిలారావ కోలాహలంబుల్‌ విటస్వాంత హాలాహలంబుల్‌ దిశల్‌ మించి యేతెంచెనే! సింగభూమీశుతో భోగదేవేశుతోడన్‌ నివేదింపవే! కాము సంతాపమున్‌ డింపవే! డింపి పుణ్యంబునం బోఁగదే! రాఁగదే! వేగఁదే! యంచుఁ జింతించు నాత్మానుజాతన్‌ గృశీభూతఁ గన్గొంచు

**వేశ్యమాత భోగినిని భూపాలునితోఁ గలుపుట**

బాలా! లలాటాక్షు దర్శించుమీ! శేషభోగిన్‌ బ్రకర్షింపుమీ! రాహు భావింపుమీ! చంపకశ్రేణి వర్షింపుమీ! యంచు భీతిన్‌ నివారించి నీతిన్‌ విచారించి యారామసౌధాంతరాళస్థలిన్‌ నర్తనాగారవేదిన్‌ మహారాజభోజున్‌ మణిస్వర్ణపర్యంకికా భాసమానున్‌ మనోభూసమానున్‌ ఘనున్‌ రావుసింగక్షమానాథ పౌత్రున్‌ సమీచీన రేచెర్ల గోత్రాంబుజాత్మమిత్రున్‌ మహోదారచారిత్రు సర్వసింగోర్వరాధ్యక్షు నీక్షించి దండ ప్రణామంబు సాపేక్షఁ గావించి హస్తాబ్జముల్‌ మోడ్చి దేవా! భవన్న్యస్త సౌజన్యధన్యన్‌ జగన్మాన్యన్‌ఁ గన్యన్‌ నిరన్యాంక పీఠాధిరోహన్‌ నిరన్యోపగూహన్‌ నిరన్యాభిలాషన్‌ నిరన్యాభిభాషన్‌ నిరన్యావకాశన్‌ నిరన్యప్రకాశం బ్రసూలోచన క్షిప్త బాష్పాంబుపూరన్‌ మనోజాత బాణావళీశంకిత ప్రాణభారన్‌ సఖీమానస న్యస్తచింతాసమూహన్‌ భగిన్యంక సంప్రాపితానేక దేహన్‌ భవద్వైభవాకృష్టచిత్తన్‌ బరాయత్తవృత్తన్‌ గృపం జూడు మంచున్‌ బ్రశంసింప

**సింగభూపాలుఁడు భోగిని నాదరించుట**

నా భోగదేవేంద్రుఁ డా సత్యభాషాహరిశ్చంద్రుఁ డా కామినీలోకపాంచాలుఁ డా సింహభూపాలుఁ డాబాల నా బాలశీతాంశుఫాలన్‌ సరోజాతహస్తన్‌ గుణైకప్రశస్తన్‌ శుకాలాపవాణిన్‌ లసన్నీలవేణిన్‌ మృగేంద్రాపలగ్నన్‌ మనోజాగ్నిమగ్నన్‌ దయాదృష్టి రావించి భావించి నెయ్యంబుఁ గావించి బాహాపరీరంభ సంరంభ నిర్ముక్తసంతాపఁ గావించి కందర్ప కేళిన్‌ వినోదించి సద్భోగినీపట్టమున్‌ దిట్టమౌ నట్టుగా వే ప్రసాదించి తన్మాత రావించి యుద్యద్గజారూఢఁ గావించి విఖ్యాతి మ్రోయించి యిష్టంబు గావించి యొప్పించె నీ భోగినీ దండకం బిద్ధరామండలంబందుఁ జెల్వొంది యాచంద్రతారార్కమై యొప్పుచుండున్‌.

**దండకాంత పద్యము**

ఉ. పండితకీర్తనీయుఁడగు బమ్మెర పోతన యాసుధాంశు మా

ర్తాండ కులాచలాంబునిధి తారకమై విలసిల్ల భోగినీ

దండకమున్‌ రచించె బహుదాన విహర్తకు రావుసింగ భూ

మండల భర్తకున్‌ విమత మానవనాథ మదాపహర్తకున్‌.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!