తెలుగు క్రికెట్ (పాతకాలం ఆట)

తెలుగు క్రికెట్ (పాతకాలం ఆట)

మా చిన్నతనంలో అనగా 1936 కుపూర్వం చాలామందికి క్రికెట్ అనే ఆట ఒకటివుందని తెలీదు. అల్లాంటి ఆటే కొద్ది మార్పులతో, పెద్ద హంగామా లేకుండ మరొక ఆట ఆడేవాళ్ళం. దానికి కావల్సిన వస్తువులు రెండేరెండు. 18 అంగుళాల కర్ర, మరొక 6 అంగుళాల చిన్న కర్ర. ఇప్పుడు ఆడుతున్న క్రికెట్ కు కావల్సిన వికెట్లుగాని, గ్లవుస్ కాని, ప్యాడ్ లుకాని గీతలుగీసిన గ్రౌండ్ కాని ఇవేవీ అవసరం వుండేది కాదు. ఇప్పటికే తమకు అర్ధమైవుంటుంది అదేం ఆటో. దానిపేరు కర్ర బిళ్ళ లేదా గూటీ బిళ్ళ.

గూటీ బిళ్ళ సరైన పేరని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నేలమీద నాలుగు అంగుళాల పొడువు చిన్న కన్నం చేసి దానిమీద చిన్న కర్ర బిళ్ళను అడ్డంగా పెట్టాలి. ఈ చిన్న కర్రబిళ్ళకు అంచులు కొంచెం సూదిగా చెక్కాలి. ఇప్పుడు నేలమీద గొంతుకు కూర్చొని పెద్ద కర్ర ను చిన్న కార్ర బిళ్ళకు ఆనించి ఎడమచేత్తో పట్టుకొని కుడి చేత్తో ఆకర్రను గట్టిగా చిన్న కర్ర బిళ్ళ గాలిలోకి ఎగిరేలా కొట్టాలి. ఎదురుగా కొంత దూరంలో నిల్చున్న ప్రత్యర్ధి ఆ బిళ్ళను పట్టుకుంటే కొట్టిన వాడు అవుటయినట్టు. లేకపోతే అది ఎక్కడపడిందో అక్కడనుంచి కన్నం దగ్గరకు దూరం అంచనా వేసి ఇన్ని లాలు అని చెప్పాలి. లాల అంటే ఈ బిళ్ళ పడ్డచోటునుంచి కన్నం వరకు వున్న దూరాన్ని పెద్ద కర్రతో కొలిస్తే వుండే దూరం. ప్రత్యర్ధికి అనుమానం వస్తే కొలవ వచ్చు. సరిపోతే ఆకొట్టిన వాడే ఆటను కంటిన్యూ చేస్తాడు. ఒకవేళ దూరం తక్కువ వుంటే వాడు అవుటయినట్టు. అంతేకాదు, ప్రత్యర్ధి కిందపడ్డ బిళ్ళను కన్నంవైపు గిరవాటేస్తాడు. అది కన్నానికి 18 అంగుళాల లోపునే పడితేకూడా అవుటయినట్టే. అలా పడేలోగా మళ్ళీ ఆ బిళ్ళను కొట్టవచ్చు. లాలు ఎవరు ఎక్కువ కొడితే వారి గెలిచినట్టు. క్రికెట్ లో పరుగుల లెక్క లాల అంటే.

ఈ ఆటకు అధమం ఇద్దరైనా వుండాలి. లేదా జట్టు జట్లుగానైనా వుండ వచ్చు. బహుశా చాలామందికి ఈ ఆటగురించి తెలియకపోవచ్చు. శ్రీమొక్కపాటి నరసింహం గారు వ్రాసిన బ్యారిస్టరు పార్వతీశం రెండో భాగంలో ఈ ఆటను పార్వతీశం ఇంగ్లండులో వుంటున్న మనవాళ్ళతో ఆడి ఇదికూడా క్రికెట్ లాంటిదే అని తెలియచేసినట్టు వుదహరించారు. కాలక్రమేనా ఈ ఆట మరుగున పడిపోయింది.

ఇది ఆరోజుల్లో దేశవాళీ ఆటల్లో ఒకటిగా కూడా పరిగణింపబడేది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!