ప్రద్యుమ్నుడు!


శివుడు కాల్చిన మన్మథుడే కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు!

-

ఇదొక ఆసక్తికరమైన కథ… 

కామదేవుడిగా పిలిచే మన్మథుడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడికి కొడుకుగా పుట్టడం! తన పేరు ప్రద్యుమ్నుడు!!


శృంగారానికి పేరు రతీమన్మథులని తెలుసు కదా… 

ఆ మన్మథుడినే రాగవృంత, అనంగ, కందర్ప, కామదేవ, మనసిజ, మదన, రతికంఠ, పుష్పావన, పుష్పధన్వ తదితర పేర్లతో పిలుస్తారు


ఓసారి పార్వతి కోసం శివుడిలో మదనోత్సాహాన్ని రేకెత్తించటానికి మన్మథుడు ప్రయత్నించి, శివుడి మూడో కన్ను వెలువరించిన జ్వాలల్లో దహనమైపోతాడు. దీన్నే మనం కామదహనం పేరిట పలు పురాణాల్లో చదువుకున్నదే… ఐతే తరువాత రతీదేవి, పార్వతి బతిమిలాడటంతో పునర్జన్మలో రతి, మన్మథులు మళ్లీ ఒకటవుతారని చెబుతాడు శివుడు


త్రేతాయుగంలో శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి అతిలోక సుందరుడైన ఓ కొడుకును కోరుకుంటుంది. కృష్ణుడు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసినప్పుడు శివుడు ఆ మన్మథుడే నీకు కొడుకుగా పుడతాడంటూ ఆశీర్వదిస్తాడు. తరువాత ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. ఐతే ప్రద్యుమ్నుడి వల్లే తన మరణం రాసిపెట్టి ఉందని తెలిసిన శంబరుడు అనే అసురుడు ఆరు రోజుల వయస్సున్న ప్రద్యుమ్నుడిని ఎత్తుకెళ్లి సముద్రంలో పారేస్తాడు.



ఆ శిశువుని ఓ చేప మింగుతుంది. ఆ చేపను పట్టిన మత్స్యకారులు తిరిగి దాన్ని ఆ శంబరుడికే అమ్మేస్తారు. దాన్ని వండమని శంబరుడు ఆదేశిస్తాడు. శాపవశాత్తూ మాయాదేవిగా జన్మించిన రతీదేవి అప్పటికే శంబరుడికి చిన్న భార్యగా ఉంటుంది. (అక్కడ దాసిగా పనిచేస్తున్నదనీ మరో కథనం) చేపను కోసిన సేవకులు ఈ పిల్లవాడిని చూసి మాయాదేవికి అప్పగిస్తారు. ఆమె ఆ పిల్లవాడి అందం చూసి ముగ్ధురాలై తనే పెంచుకుంటూ ఉంటుంది. ఈలోపు నారదుడు ఆమె దగ్గరకు వెళ్లి తను ఎవరో కాదనీ, మన్మథుడే శ్రీకృష్ణుడికి కుమారుడిగా జన్మించడనీ మొత్తం కథ అంతా వివరిస్తాడు. ఆమెకు గత జన్మ వృత్తాంతం అంతా తెలిసి వస్తుంది. వేగంగా ఎదిగిన ప్రద్యుమ్నుడు మాయావతిగా జీవిస్తున్న రతీదేవి ప్రేమలో పడతాడు


తరువాత కొన్ని అవమానాల పాలైన ప్రద్యుమ్నుడు ఓసారి శంబరుడిని ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడు. హోరాహోరీ జరిగిన పోరులో చివరకు శంబరుడు హతమవుతాడు. తరువాత ప్రద్యుమ్నుడు మాయాదేవిని పెళ్లాడి ద్వారకకు వెళ్తాడు. అంతా తెలిసిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదిస్తాడు…


యాదవ కులం యావత్తూ పరస్పరం కలహించుకుని ఒకరినొకరు హతమార్చుకునే ఘటనలోనే ప్రద్యుమ్నుడు కూడా మరణిస్తాడు. అతని కొడుకే అనిరుద్ధుడు. తను బాణుడనే దైత్యుడి కూతురు ఉషను పెళ్లాడే కథ మరో ఆసక్తికర అధ్యాయం. వారికి కలిగిన కొడుకే వజ్రుడు (వజ్రనాభుడు). యాదవకుల స్వీయ విధ్వంసంలో సజీవంగా మిగిలిపోయింది ఇతనే. తరువాత కాలంలో తనే అరుదైన బ్రజ రాయితో కృష్ణుడికి 16 విగ్రహాలు చేయించి, మధుర పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టిస్తాడు…

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!