కల్పవృక్షంలో కైక !


కల్పవృక్షంలో కైక .!


రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది


ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే.


దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే,


రామాయణం అక్కడితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు


తిప్పినది కైక.


అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని,


చాలా పరిమితమైనది.


కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి,


పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే


ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో.


ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత.


రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే.


ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి


రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే.


అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి


“సీతాయాశ్చరితం మహత్” అన్నది. 

అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా


కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.

రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు


అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని


యిలా అంటుంది:


కైకెయి సీత గౌగిటికి గైకొని,


“ఓసి యనుంగ! నీవుగాగైకొని యీ వనీచయ నికామ


నివాసభరంబిదెల్లనున్లోకము నన్ను తిట్టుట తలోదరి!


మార్చితి, కైక పంపెనేగాక దశాననాది వధ


కల్గునె యన్న ప్రశంస లోనికిన్”


“కైక రాముడిని అడవులకి పంపేసింది” అనే నిందని,


“ఆహా! కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం


చేసి 

రాముడు దిగంత కీర్తి సంపాదించాడు” అనే ప్రశంసగా


మార్చేసిందట సీత.


అంతే కదా! రామాయణానికి మరో పేరు “పౌలస్త్య వధ”.


అంటే, రామాయణ కథకి అంతిమ గమ్యం రావణ వధ.


దానికి కైక వరాలే కదా కీలకం!


విశ్వనాథవారీ కీలకాన్ని గ్రహించి, కైక పాత్రని దానికి అనుగుణంగా


తీర్చిదిద్దారు.


మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్నకొడుకు భరతుడే


కల్పవృక్షం చివరలో,


“కైకేయీ సముపజ్ఞ మియ్యది జగత్కల్యాణ గాథా


ప్రవాహాకారంబయి పొల్చు రామకథ” అని అనుకుంటాడు.


అదీ రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!