👉బాపూబొమ్మాయణంలో ఆవకాయ .👈


ఆలూమగల అనురాగానికి ఆనవాలు ఆవకాయ అంటాడు బాపు.


గోరంత ఆవకాయముద్దపెట్టించి కొండంత దాంపత్యమమకారం


చూపుతాడు. ఇంటికి వచ్చిన అల్లుడికి మినపసున్ని,


కూతురు కోసం ఆవకాయ పుట్టింటివారు ఇస్తారని కూడా అనేశాడు.


తండ్రి కూతురు అనురాగానికి, భార్యాభర్తలప్రేమకు వారథి


ఆవకాయనేట. కూతురు కలిపిన ఆవకాయన్నం అలనాడు


అమ్మపెట్టిన గోరుముద్దలు ఒకటే అని ఒక తండ్రి భావన.


కూతురు అల్లుడు సఖ్యతకు ఆవకాయకలిపి అన్నం ముద్దలే


తార్కాణంగా అత్తమామలు తెలుసుకుంటారు.


తెలుగు వారి జీవితాల్లో పెనవేసుకుపోయిన ఆవకాయను


తన సినిమాల నుంచీ దూరం చేయని నిరంకుశుడు బాపు.


ఆవకాయ, నెయ్యితో హాస్యం పుట్టించవచ్చని అల్లూరామలింగయ్య


ద్వారా 8PMకి నిరూపిస్తాడు. ఆవకాయలోనే ఆయుధం


కూడా ఉందని కళ్లలోకి చల్లి నిరూపించేస్తారు మనఊరిపాండవులు.


అందాల రాముడికైనా భక్తశబరి వంటి బామ్మగారు


తరవాణిలోకి ఆవకాయబద్దవేయలేకపోయానని బాధపడిపోయి


అడగలేదేంరా రాముడూ అని నొచ్చుకుంటుంది.


నాన్న తిండిపెట్టద్దని శాసిస్తే జొన్నకూడు తో వెళ్లిన చెల్లి


ఆవకాయతోనే అన్నకు తూర్పు వెళ్లే రైలు చూపిస్తుంది.


ఒకటేమిటి రెండేమిటి. ఆవకాయలేనిదే బాపూ సినిమా లేదు,


తెలుగుతనమే లేదు. బాపూ బొమ్మకు లావణ్యరహస్యం ఆవకాయే.


🙏


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!