శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’

శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి

బ్రాహ్మణులను బ్రతికించిన లెక్క యుక్తి:

సీ.

తార్కికుల్ నలుగురు, తస్కరు లేవురు,

శ్రోత్రియు లిద్దరు, చోరుఁ డొకఁడు,

భూసురుల్ ముగ్గురు, ముడియవి ప్పొక్కఁడు

సకలార్థనిపుణుఁడు శాస్త్రి యొకఁడు,

యల్లాపు లిద్దఱు, యాచకు లిద్దఱు,

బరివాండ్రు ముగ్గురు, బాపఁ డొకఁడు,

ఆగడీ లిద్దఱు, ఆరాధ్యు లిద్దఱు,

దుష్టాత్ముఁ డైనట్టి దొంగ యొకఁడు,

తే.గీ.

అరసి వారల నొక శక్తి యశనమునకు

సగము గోరఁగ, నవసంఖ్య జగతిసురుఁడు

చెప్ప, దొంగలు హతమైరి, చేటుదప్పి

విజయ మందిరి యావేళ విప్రు లెల్ల.

ఈ పద్యంలోని కథ ....

కొందరు బ్రాహ్మణులు అడవిలో వెళ్తుంటే దొంగలగుంపు అడ్డగించింది. ఎంత బతిమాలినా వదలలేదు. దొంగలు ఆ బ్రాహ్మణులను దగ్గరే ఉన్న శక్తిగుడికి తీసికొనివెళ్ళి బాధించడం మొదలుపెట్టారు. ఇంతలో గుడిలోని మహాకాళి ఘోరాకారంతో ప్రత్యక్షమై "మీలో సగంమంది నాకు బలి కావాలి. లేకుంటే మమ్మల్నందరినీ భక్షిస్తా" నన్నది. దొంగలు పదిహేనుమంది. బ్రాహ్మణులూ పదిహేనుమంది. అందువల్ల ‘బలికావలసిన పదిహేనుమంది ఎవరు?’ అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు బ్రాహ్మణులలో ఒక యుక్తిశాలి "అమ్మా! నీవు పూర్తిగా బ్రాహ్మణులను కాని, పూర్తిగా దొంగలను కాని బలితీసుకొనడం ధర్మం కాదు. మేమంతా నీముందు వరుసగా నిలుచుంటాము. నీవు లెక్క ప్రకారం ప్రతి ఆవర్తనంలో తొమ్మిదవవాణ్ణి బలి తీసుకో" అన్నాడు. శక్తి సమ్మతించింది. దొంగలూ సరే అన్నారు. అతడు చెప్పిన ప్రకారం అందరూ వరుసగా నిలుచున్నారు. ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడు దొంగే అయ్యాడు. అది అతని గణితశాస్త్ర కౌశలం. ఆ విధంగా పదిహేను ఆవర్తనాలలో పదిహేనుగురు దొంగలు బలి అయ్యారు. బ్రాహ్మణులంతా మిగిలారు. 

అతడు బ్రాహ్మణులను, దొంగలను నిలబెట్టిన వరుసక్రమం ఇది ...

(X - బ్రాహ్మణుడు; O - దొంగ)

XXXX OOOOO XX O XXX O X OO XX OOO X OO XX O

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!