కొన్ని గీ ద్యాలు ..

కొన్ని గీ ద్యాలు ..

ఉత్పలమ్ములటంచు ఉత్తనే నసబెట్టి 

చంపకమ్ములజెప్పి చంపునతడు 

మత్తకోకిలయంచు మెత్తగా సుత్తేసి 

మత్తేభములనెత్తి మొత్తునతడు 

శార్ధూలమో వాడి శ్రార్ధమో అసలేమి 

అర్ధమవ్వనిదేదొ అరచునతడు 

విద్దెలెరిగినట్టి పెద్దలేతెంచుచో 

పద్దెంపు పటముతో సిద్ధమతడు

తెలుగు తెలుగంచు తెగమూల్గు తిక్కవాడు 

తెలుగుయే దక్క అన్యమ్ము తెలియనోడు 

తెలియునావాడు ఎవ్వడో తెలుగు లారా? 

శరము రవ్వంతయునులేని శర్మ గాడు 

.

తిక్కన్న ఎవ్వడో తిక్కసన్నాసంచు 

నన్నయ్య అవ్వానికన్నయంచు 

వెర్రి రాతలవాడు ఎర్రన్నయేనంచు 

పూతన మామయే పోతనంచు 

చంపకమాలన్న జయమాల్ని చెల్లెలొ 

చూడ కాంచనమాల చుట్టమంచు 

తేటగీతననేమొ తెలియునా మీకంచు 

గాజువాకా పిల్ల గానమంచు

తెరను వెలిగేటి తారలే దేవులంచు 

దొరల మాటాడువారలే దొడ్డలంచు 

తెలుగుతనమన్న ఇదె యంచు తెలుగులుండ 

కవనమల్లంగ నీకేల కాముడన్న

ఇంకోటి ఇలా

కవుల పల్లకిమోయు భువినేలు మారాజు 

పచ్చలపల్లకీ పట్టిపోయె 

అక్షరమ్ముకు లక్షలిచ్చి కైతల మెచ్చు 

లచ్చిపుత్రులు నాకమిచ్చగించె 

శ్రీనాధ కవిరాజు చీకాకు పాలాయె 

గండపెండెరమాయె బండ శిలలు 

భాగ్యనగరి యశోభాగ్యమూర్తుల పంక్తి 

విశ్వనాధకు లేదు విగ్రహమ్ము

భువన విజయమ్ము బుగ్గియైపోయెనన్న 

కవుల విభవమ్ము అగ్గిలోకాలెనన్న 

అవని కవిగాంచి ప్రజ మేలమాడుచున్న 

కవనమల్లంగ నీకేల కాముడన్న

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!