‘అప్పడాభరణం’

‘అప్పడాభరణం’ 

‘‘వేచే వారెవరురా

కరకరా...టటటటా...

గరగరా...టటటటా...

‘పాపడ్’ వేచేవారెవరురా!

మరిగిన ఈ నూనెలోన

వేగజాల ...అప్పడాలవాల..

వేచే వారెవరురా’’ 

‘‘ఏవి ఉండనీ, ఉండకపోనీ, ‘అప్పడం’ లేని భోజనం భోజనంలా తోచదు! ‘అప్పడం‘ ఒక్కటి ఉంటే-అది మామూలు ప్లేట్‌మీలే అయినా, కడుపునిండా భోంచేసిన ‘తృప్తి’ కలుగుతుంది. బహుశా అది ‘అప్పడం’ మహత్యం ఏమో’’ .


‘‘ ‘అప్పడం’ ఈజ్ ఈక్వల్టూ ‘విందు భోజనం’ క్రిందే లెక్క! కరకర లాడుతూ పంటికింద అది కరిగిపోతున్నప్పుడు ఉండే మజా, మాటలతో చెప్పలేం! హోటల్లో భోం చేయడానికి వెళ్లినప్పుడు ముందు సలాడ్, అప్పడాలు పెడితే-కంచం వచ్చేలోగానే అప్పడాలు ‘హుష్ కాకీ’ అయిపోతాయి. మునుపు అప్పడాలు ఇళ్లల్లోనే ఒత్తుకుని, ఎండబెట్టుకుని, వాడుకునేవారు. పాపం! ఆర్థిక వెసులుబాటు అంతగా లేని విధవరాండ్రు కూడా-అప్పడాలు, వడియాలు అమ్ముకుని ఆణాకానీ సంపాదించుకోవడం ఉండేది’’ .


‘‘మా తాతయ్యగారికి ‘అప్పడాలపిండి’ అన్న బహుఇష్టంగా ఉండేది! వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి ముద్దవేసుకుని, అప్పడాల పిండి నంచుకుతింటే, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న ఆనందం కలిగేదనేవారు. ఏమున్నా లేకపోయినా-ఇంట్లో అప్పడాలు, వడియాలు తప్పనిసరి. వడియాలకన్న, అప్పడాల క్రేజ్ మరీ ఎక్కువ! ఎవరయినా అతిథి భోజనానికి వస్తే-ముందు వేగేవి ‘అప్పడాలే’. డబ్బా అప్పడాలు వేయించి పోసి, వడ్డనకు ముందు పెడితే, ‘ఒహ్హోహ్హో! అప్పడాలు..’ అంటూ మాయా బజారు ఘటోత్కచుడి విందు భోజనపు పట్టుపట్టాల్సిందే’’ .


‘‘కారపు అప్పడాలు అన్నంలో గొప్ప అధరవులర్రా! కూర,పచ్చడి లేకపోయినా, అప్పడాలుంటే అన్నం లాగించేయచ్చు! గుంటూరు కారం అప్పడాలు బాపు, రమణకు బోలెడు ఇష్టం అని సరసి కాబోలు, ప్రత్యేకించి చేయించి పంపాట్ట! అసలు అప్పడాలల్లో ఉన్నన్ని రకాలు బోలెడు!! మినప అప్పడాలు,పెసర అప్పడాలు, నువ్వులపప్పు అప్పడాలు, కందిపప్పు అప్పడాలు, వరిపిండి అప్పడాలు, ఆవిరి అప్పడాలు, కారపు అప్పడాలు, మసాలా అప్పడాలు, పచ్చికారం అప్పడాలు, క్యారెట్ అప్పడాలు...ఒకటేమిటి?...‘అప్పడం’ ఏదయినా రుచే! ముఖ్యంగా మద్రాసు అప్పడాలు బోలెడు ప్రసిద్ధి! మాంబళంలో చిన్న అరచేతి సైజు అప్పడం నుండి పెద్ద మినపట్టు సైజు అప్పడం వరకు బోలెడువెరైటీవి ఉంటాయి. వేపుకు తినేవి, కాల్చుకు తినేవి ఏవయినా రుచి రుచే మరి!’’


‘‘ ‘పప్పుఅన్నం’లో ‘అప్పడం’ నంచుకోవడం కొందరి అలవాటైతే, ‘రసం’లోనో, ‘సాంబార్’లోనో, ‘పప్పు పులుసు’లోనో కొందరు నంచుకుంటారు! నూనెలో వేయించిన అప్పడాల రుచే రుచి! కాల్చినవి కూడా బాగుంటాయి, నిజానికి వంటికి మంచివే కానీ, మైక్రోవేవ్‌లో కాల్చడం కాక, బొగ్గుల కుంపట్లో నిప్పుల మీద కాల్చిన వాటి-రుచే రుచి. పెళ్లి భోజనం అంటే-‘అప్పడం’ లేనిదే పరిపూర్ణం కాదు. అప్పడాలు ముక్కలుచేసి పెట్టడం కాదు- ‘అప్పడం పళంగా’ నిండుగా,గుండ్రంగా దొంతరులుగా కనిపిస్తే...ఆ తృప్తే వేరు’’ .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!