బేరాలు!!

జామపళ్ళోయ్ జామపళ్ళు
ఏయ్ జామపళ్ళబ్బాయ్ ఇలారా!
ఏంటండి అమ్మగారూ! తమరు ఈ మధ్య వూళ్ళో లేరాండి అగపడ్డంలేదు
అవునయ్యా! అమెరికానుంచి అబ్బాయి వస్తే వాడితో చుట్టాలిళ్ళకు వెళ్ళి తిరిగొచ్చాం
అమెరికానుంచి బాబు వచ్చారా! వున్నారాండి
మొన్నరాత్రే వెళ్ళరయా! అది సరే జామ పళ్ళు ఎలా ఇస్తున్నావ్ ?
ఎన్ని కావాలండి?
వంద కావాలయ్యా! మా ఆడబడుచు కోడలకి సూడిదలు ఇవ్వాలిట. పళ్ళు కూడా పెట్టి ఇద్దామని
వంద నూట ఏభై చేసుకు ఇస్తానండి
అబ్బో నూటేభయ్యే? ఉహు! ఎనభైకి ఇస్తావా?
అమ్మొ అంతవారాండి. వంద చేసుకోండి
ఎనభైకి ఇస్తే వంద ఇచ్చెయ్యి లేకపోతే వెళ్ళిఫో
సరే! పెద్ద బేరం ఎందుకు పోగొట్టుకోవాలండి. ఇదిగో లెఖ్ఖెట్తాను చూసుకోండి ఆ సంచీ ఇల్లా ఇవ్వండి అందులో వేస్తాను
లాభం ..ఒకటి..రెండు..మూడు.. అబ్బాయిగారికి పిల్లలా?
ఒక కూతురయ్యా!
ఎన్నో ఏడండి?
ఎనిమిది
చిత్తం ఎనిమిది..తొమ్మిది..పది.అమ్మాయిగారికండి?
దానికోకొడుకు
ఎన్నేళ్ళండి
పదమూడు
సరిజోడేమోనండి పదమూడు..పద్నాలుగు పదిహేను, పదహారు, పదిహేడు తమకి అమ్మాయి తర్వాతండి …?
ఆ ఇంకో అమ్మాయి వుంది. ఇరవై నాలుగేళ్ళు వచ్చాయి. సంబంధాలు చూస్తున్నాం
అలాగాండి ఇరవై నాలుగు, ఇరవై ఎయిదు, ఇరవై ఆరు, ఇరవై ఏడు, ఇర్వై ఎనిమిది , కోడలుగారివయస్సు ముప్ఫై వుంటాయాండి?
మొన్ననే ముప్ఫై ఎనిమిది వచ్చాయి
ముప్ఫై ఎనిమిది,ముప్ఫై తొమ్మిది, నలభై.. పెద్దబ్బాయిగారికెన్నేళ్ళంది
నలభై అయిదయ్యా
నలభై అయిదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నల్భై తొమ్మిది, ఏభై
ఏంటోనండి సోతంత్రం వచ్చి ఏభై ఏళ్ళైనా మా బతుకులు ఇలాగేవున్నాయండి
అదేమిటయ్యా! మనకు స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళైంది
అవునాండి. అయినా చూడండి లేనోడు అట్టానేవున్నాడు. వున్నోడు ఎదిగిపోతున్నాడు అరవై, అరవై ఒకటి అరవై రెండు, అరవైమూడు అరవైనాలుగు , అయితే బాబుగారికి సొతంత్రం వచ్చిన్నాటికి పెళ్ళయిపోనాదాండి
అహా! ఇప్పుడాయన వయస్సు ఎంతనుకున్నావ్ ? ఎనభై ఒకటి.
అలాగా! ఎనభై ఒకటి, ఎనభై రెండు, ఎనభై మూడు, ఎనభై నాలుగు, తమ తల్లిగారు?
మూడేళ్ళైందయ్యా పోయి.
అయ్యో పాపం ఏం జబ్బండి?
జబ్బేంలేదు తిరుగుతూనేవుంది. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది
అలాగాండి. ఏం మాయదారి జబ్బులో! ఆరు పోయేనాటికి తొంభై వున్నాయాండి
తొంభై నాలుగయ్యా
అల్లాగా! తొంభై నాలుగు, తొంభై అయిదు, తొంభై ఆరు, తొంభై ఏదు, తొంభై ఎనిమిది, తొంభై తొమ్మిది, నూరు. ఇదిగో అమ్మగారు. లెఖ చూసుకోండి
అదేమిటి వంద వేసి వూరుకుంటావా? కొసరు ఒక చెయ్యి వెయ్యి
ఏమిటో అమ్మగారూ! అక్కడకీ గిట్టకపోయినా ఎనభైకి ఒప్పుకున్నా. ఇంకా కొసరంటే ఎలాగండి!
కొసరు వెయ్యకపోతే నాకు అక్కర్లేదు. తీసుకుఫో
కోపం పడకామండి. ఇందండి అయిదు వేసా
వందకి చిల్లర వుందా?
ఇదిగో ఇరవై ..వస్తానండి అమ్మగారు..
జామపళ్ళోయ్ జామపళ్ళు
హు! వంద నూట ఏభైట!! నా దగ్గరా వీడి బేరాలు!!

x

Comments

  1. జామపళ్ళ కధ చాలా బాగుంది.వీధిలో తిరిగి అమ్ముకునే వాళ్ళదగ్గరకూడా బేరం చేస్తే ఎలా.. వాళ్ళ కష్టం గ్రహించాలి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!