అరోజు మహిళామండలి వార్షికోత్సవం. ఈ సారి సెలిబ్రేషన్ లో ప్రత్యేకత ఏమిటంటే, సభ్యురాండ్రతోబాటు వారి భర్తలు కూడా ఆహ్వానింపబడడం. భార్యలపోరు పడలేక చాలమంది భర్తలుకూడా హాజరవడంతో హాలు కిక్కిరిసి వుంది.
రాధాభాయమ్మగారు లేచి సభకు నమస్కరించి మైకు దగ్గరకు వచ్చి సుతారంగా వ్రేలితో మైకును మీటి అది పనిచేస్తోందని నిర్ధారించుకొని, కళ్ళజోడు సవరించుకొని తమ వుపన్యాసం ప్రారంభించారు.
సరే విషయంలోకి డైరెక్ట్ గా వచ్చేస్తా. ఇక్కడకు వచ్చిన మగవారికి ఒక చిన్న ప్రశ్న. మీరూ మీభార్య లక్షరూపాయలున్న ఒక బ్రీఫ్ కేసు తో ఒకనదిలో చిన్న పడవమీద వ్యాహాళికి వెళ్తున్నారనుకోండి. అహ! ఉదాహరణకు. మీరే నావకు తెడ్డువేస్తున్నారు మాయాబజారు సినిమాలో ఎ ఎన్ ఆర్ లాగ. ఇంతలో విధిబలీయమైనది. (ఇది కూడా వారు వాడే పడికట్టు మాటే) మీనావ తిరగబడి మీరు మీభార్య బ్రీఫ్ కేసుతో సహా నదిలో పడ్డారనుకోండి పాపం శమించుగాక. ఇది కేవలం వూహ మాత్రమే. అలాంటప్పుడు మీరు మీభార్యను రక్షిస్తారా లేక లక్షరూపాయలున్న మీబ్రీఫ్ కేసుకోసం తాపత్రయపడతారా? భార్యను రక్షిస్తామనే వారు దయచేసి చేతులు ఎత్తండి.
హాలులో వున్న మగవారందరూ చేతులెత్తారు ఒక్క రామారావు తక్క.
అంతా అతనికేసి పురుగును చూసినట్టు చూసారు .
రాధాభాయమ్మగారు అతనికేసి చూసి తమపేరు అని అతివినయంగా వ్యంగ్యంగా అడిగారు.
రామారావు
ఆపేరా!! అందుకనేనా బాబూ భార్యను వదలి వెధవడబ్బుకోసం వెంపరలాడడం ?
వెధవ డబ్బా? లక్షరూపాయలంటే సామాన్యమాండి??
అయితే ఆలక్షరూపాయలకోసం అలనాటి రాముడిలా భార్యను ఆమె మానాన్న ఆమెను వదిలేస్తారా? ఆమే మునిగిపోతూవుంటే చూస్తూ వూరుకుంటారా? అని క్రోధంగా అడిగారు రాధాబాయమ్మ గారు
షేం షేం అని సభలో కేకలు
నాభార్య ఎందుకు మునిగిపోతుంది?? ఆమెకు ఈత బాగావచ్చు. చక్కగా ఈదుకుంటూ వస్తుంది.
సభలో పిన్ డ్రాప్ సైలెంట్
ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముందేల సందేహముల్??
Comments
Post a Comment