''అమృతాభి షేకము ''

దాశరధి కృష్ణ మాచార్యులు రచించిన ''అమృతాభి షేకము ''లోని..

''నిశి ''వర్ణన.. రాత్రి ఏవిధముగా చీకట్లు అలుముకున్నాయో వర్ణన

(సేకరణ ... మరియు వివరణ ....@Kalyani Gauri Kasibatla.)

ఇరులు నిశాసతీ భుజములెక్కి, శిరమ్మున నిక్కి తారకా

తరుణి కపోల పాళిక లు తాకి,విహాయస వీధి ప్రాకి,చం

దురు పయి సోకి, భూమి ధర దుర్గమ వీధుల దూకి ,మెల్లగా

ధర పయి కాలు మోపిన వుదారములై హరినీల కాంతులన్

ఇటు ప్రాకి అటుప్రాకి ఇందు బింబాననా

ముఖము పై కస్తూరి బొట్టు పెట్టి

ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా

భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి

ఇటు సాగి అటు సాగి ఇందీవ రేక్షణా

పక్ష్మ భాగములపై వచ్చి వ్రాలి

ఇటు వీగి అటు వీగి మృగ నేత్ర బంగారు

చెక్కిలి పై అగర్ చుక్క నునిచి

వెండి కొండ పయిన్ మబ్బు విధము దోచి

చంద్రకేదారమున లేడి చాయ తిరిగి

ఆది శేషుని పై విష్ణువై శయించి

చీకటులు కూర్చె నందమ్ము లోకమునకు...

కాటుక వంటి చీకటులను కవి ఎంత అందముగా వర్నిచారో కనుగొనుమా..

చాలా మంది మిత్రులు భావం కూడా అడుగుతున్నారు.. వారికోసం

భావం ;;- చీకట్లు నల్లని కాంతులతో భూమిమీద అడుగు పెట్టాయి. నిశ అనే స్త్రీ భుజాల మీద ఎక్కి. శిరస్సుమీద నిలబడి,నక్షత్రాలనే స్త్రీల చెక్కిళ్ళను స్పృశించి,ఆకాశం లోకి పాకి,చంద్రుని తాకి.కొండలలోకి దూకి,మెల్లగా భూమి మీద చీకట్లు అడుగుపెట్టాయి

చీకట్లు లోకానికి అందాన్ని చేకూర్చాయి. చంద్ర ముఖి ముఖం మీద కస్తూరి బొట్టు పెట్టాయి

నల్లని వంకుల ముంగురులు కలిగిన స్త్రీ కనుబొమ్మలనే విల్లుకు బాణాన్ని తొడిగాయి.

కలువ వంటి కను రెప్పల మీద వాలాయి.లేడి కన్నులవంటి కన్నులు గల స్త్రీ బంగారు చెక్కిలి మీద అగరు చుక్కను పెట్టాయివెండి కొండ మీద అమ్బ్బు లాగా కనిపించాయి

చంద్రుడనే పొలం లో జింక లాగా తిరిగాయిఆది శేషుని మెడ విష్ణువులా గా పడుకున్నాయి

ఇన్ని విధాలు గా చీకట్లు లోకానికి అందాన్నిచ్చాయి..( కస్తూరి బొట్టు,కనుబొమలు,కనురెప్పలు,అగరు చుక్క. మబ్బు,చంద్రునిలోని మచ్చ.విష్ణువూ అన్నీ నలుపే.. ఇవన్నీ సౌందర్యాపాదకాలే). చంద్రుని లోని మచ్చను జింక గా వర్ణిస్తారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!