ఆరుద్ర గారి అపురూపమైన నవల “ఆడదాని భార్య”!


-

ఆరుద్ర గారి అపురూపమైన నవల “ఆడదాని భార్య”!

-

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు

**************

మహాకవి ఆరుద్ర సినిమా రంగప్రవేశం చేసి డిటెక్టివు కథారచన పట్ల ఆసక్తి చూపిన పందొమ్మిదివందల యాభై దశకం నాటికే తెలుగు అపరాధ పరిశోధక నవలల రాజధాని వేంకట పార్వతీశ్వర కవుల పిఠాపురం నుంచి టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు గారల చెన్నపట్నానికి తరలివచ్చింది. అప్పటికే ఇంగ్లీషు, బెంగాలీ, రష్యన్ భాషల గ్రంథానువాదయుగం ముగిసి పూర్తిగా స్వతంత్రస్థాయిలో రచనలు వెలువడటం మొదలయింది. తొలినాటి రచనలలో లాగా గరళగ్రాంథికంలో రాయటం మాని రచయితలు సరళమైన వ్యావహారికాన్ని అభిమానింపసాగారు. క్రౌను కంటె చిన్నగా చేతికి అనువైన పోట్ ఆక్టెవో పాకెట్ బుక్ సైజులో న్యూసుప్రింటు కాగితం మీద జైహింద్ వారి స్పష్టమైన 10 పాయింటు, 12 పాయింటు ఇంగ్లీషు బాడీ ఫాంటులో 22 పాయింటు గ్రేట్ ప్రైమర్ శీర్షికలతో, త్రివర్ణ ముఖచిత్రంతో అందంగా అచ్చయి అందుబాటులోకి వచ్చిన ఆ నవలల కేర్పడిన ప్రచారం ఆ రోజుల్లో అంతా ఇంతా కాదు. అందులో కొన్ని అంచులకు ఎర్రరంగు అద్ది, చూడగానే ఇది అపరాధ పరిశోధక నవల అని గుర్తుపట్టడానికి వీలుగా ఉండేవి. ఆంధ్రాంగ్లాలలో నిష్ణాతులై అప్పటికే సృజనరంగంలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకొన్న కొవ్వలి లక్ష్మీనరసింహారావు, టెంపోరావ్, వై.వి. రావు, కొమ్మూరి సాంబశివరావు, కనకమేడల వెంకటేశ్వరరావు, విశ్వప్రసాద్, శ్రీభగవాన్, విజయా బాపినీడు, కొమ్మిరెడ్డి వంటి రచయితలు పుంఖానుపుంఖంగా రచిస్తున్న రోజులలోనే రచయితలుగా చెప్పుకోదగిన ప్రసిద్ధికి రాని వి.ఎస్. అవధాని ‘ఇంటిదొంగ’, ‘సినిమారంగం’ పత్రిక ఉపసంపాదకులు గడియారం వెంకట గోపాలకృష్ణ (జి.వి.జి) గారి ‘తేనెపూసిన కత్తి’, ‘ముగ్గురు కుంటివాళ్ళు’, ఉషాకిరణ్ ‘దేవతా? దెయ్యమా?’, డి. మనోహరి ‘లేడీ కిల్లర్’, నరేంద్ర ‘మొండిచెయ్యి’, కృష్ణమోహన్ ‘నలిగిన నల్లగులాబి’, డాక్టర్ మల్లికార్జునరావు ‘శవం రాసిన వుత్తరం’, గుత్తా బాపినీడు ‘చంపు చూద్దాం’, తారా రామమూర్తి ‘పెళ్ళిరోజు ప్రమాదం’, ముక్కామల ‘జేబుదొంగ జగ్గూ’ వంటి నవలలన్నీ మూడేసి నాలుగేసి పునర్ముద్రణలకు కూడా నోచుకొన్నాయి.


కొమ్మూరి నవలల సంగతి చెప్పనక్కరలేదు. ఆయన ‘ఆధునిక గ్రంథమాల’ను స్థాపించి అచ్చువేసిన డిటెక్టివు నవలలు ఆంగ్ల విద్యాధికుల ఇండ్లలో సైతం గౌరవార్హమైన చోట పుస్తకాల బీరువాలలో దర్శనమిచ్చేవి. వై.వి. రావు గారి ‘డిటెక్టివ్’ మాసపత్రిక, చక్రపాణి గారి ప్రోద్బలంతో వెలువడిన ‘ఆంధ్రజ్యోతి’, ’యువ’ పత్రికల మూలాన పాంచకడీదేవు, రమేశ చంద్ర దత్తు, నీహార రంజన్ గుప్తా తెలుగిళ్ళలోకి చొచ్చుకొని వచ్చారు. ఆ ప్రాచుర్యానికి ప్రాతిపదికగా చందమామ పబ్లికేషన్స్ వారు ‘నేరపరిశోధన’ సంపుటాలను వెలువరించారు. కొమ్మూరి సాంబశివరావు గారి ‘మంజూష’ పత్రికలో ఆయన కథలే గాక సుప్రసిద్ధ భాషాంతర రచనల అనువాదాలు, ధారావాహికాలు, ఆరుద్ర వంటి ప్రఖ్యాతకవుల రచనలు కూడా వెలువడుతుండేవి. ఆర్థర్ కానన్ డయల్ సృష్టించిన షెర్లాక్ హోమ్సు, ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ కల్పించిన లాయర్ పెర్రీ మేసన్ పాత్రలకు దీటుగా పాంచకడీదేవు ప్రచారంలోకి తెచ్చిన డిటెక్టివు అరిందముడు, నీహార్ రంజన్ గుప్తా సృష్టించిన డిటెక్టివు కిరీటి రాయ్ ల లాగానే టెంపోరావ్ గారి డిటెక్టివు పరశురామ్, కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివు యుగంధర్, అసిస్టెంటు రాజు, అప్పుడప్పుడు అసిస్టెంటు కాత్యా, ఇన్‌స్పెక్టరు స్వరాజ్యరావు ఆంధ్రుల అభిమానపాత్ర లయ్యారు. ఉషాకిరణ్ రచనల్లో డిటెక్టివు సుధాకర్, భార్య సుధ; విశ్వప్రసాద్ డిటెక్టివు భగవాన్ (కథలలో “భగవాన్ గారు” అని వ్యవహరించేవారు); ఆదనేని ఈశ్వర్ డిటెక్టివు సవ్యసాచి; మనోహరి డిటెక్టివు రవీంద్రుడు; గిరిజశ్రీ భగవాన్ డిటెక్టివు నర్సన్, అసిస్టెంటు కృపాల్, చక్రధర్ డిటెక్టివు శోభన్ తెలుగిళ్ళలోని ఆత్మీయవ్యక్తులైన రోజులవి. కొడవటిగంటి కుటుంబరావు ‘కెయాస్ ఆనంద్ కథలు” చెప్పుకోదగినవి. కనకమేడల వెంకటేశ్వరరావు వంటి విద్వాంసుడు, సత్కవి పద్యరచన మానివేసి, సినిమాలలోకి దిగి హీరో కాంతారావు గారితో “విజయ ఢంకా” అని విడుదలకు నోచుకోని విఫలచిత్రాన్ని తీసి చేతులు కాల్చుకొని, సొంతంగా ఇంటి వెనకే చిన్ని ట్డ్రెడిల్ ప్రెస్సును పెట్టుకొని డిటెక్టివు కిషోర్ నాయకుడుగా ‘ఒంటికంటి రహస్యం’, ‘మోసగించిన వీలునామా’ వంటి నవలలను రాసి, మళ్ళీ నిలదొక్కుకోగలిగారు. పాలగుమ్మి పద్మరాజు ‘చచ్చి సాధించేడు’ కూడా అప్పట్లో పేరెన్నిక గన్న అపరాధ పరిశోధక నవల. టెంపోరావ్ గారు ‘టెంపో’ అని ఇంగ్లీషు పత్రికను స్థాపించి డిటెక్టివు వాలి, అసిస్టెంటు గిరి పాత్రలను ప్రకల్పించి తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా ఆ నవలలను ప్రకటించేవారు. వాటి ప్రాచుర్యాన్ని, ఆ రచయితలకు సమాజంలో ఏర్పడిన గౌరవాన్ని ఈ రోజు ఊహించటం కూడా సాధ్యం కాదు.


ఆంగ్లవిద్యాధికులైన పెద్దలకు మాత్రమే పరిచితమైన దేశకాలపరిస్థితులు ఈ పుస్తకాల మూలాన అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో అస్తిత్వసమస్యలతో, చీకాకులతో నిత్యం వ్యాకులితులై ఉండే సామాన్యులు ఈ రచయితలు సృష్టించిన అపూర్వమైన కాల్పనికజగత్తులో సంచరిస్తూ దైనందినజీవితంలో పరిష్కరించలేకపోతున్న అంశాలను తమకెంతో అభిమానపాత్రుడైన పరిశోధకునితోపాటు కథాగతంగా తామూ భాగస్వామ్యాన్ని వహించి పరిష్కరించినప్పటి వారి ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించటం సాధ్యం కాదు. అందువల్లనే ఈ నవలలను అంత తాదాత్మ్యంతో మనసుపెట్టి చదవటం జరిగేది. వాటి అసాధారణమైన ప్రభావశీలిత వల్ల పుస్తకాలను అద్దెకిచ్చే కొన్ని వేల ఇంటింటి గ్రంథాలయాలు తెలుగుదేశ మంతటా వెలిశాయి. అక్షరాస్యతావృద్ధికి దోహదం చేశాయి. క్రమంగా విద్యాధికులు సైతం ఈ ప్రక్రియను అభిమానింపసాగారు. దేవరాజు వెంకట కృష్ణారావు గారి ‘వాడే వీడు’, ‘నేనే’, ‘కాలూ రాయ్’; అబ్బూరి రామకృష్ణారావు గారి ‘మంగళసూత్రము’, ‘దుర్గాప్రసాద విజయము’ నవలలను చదివి ప్రభావితులై శ్రీశ్రీ ‘వాడే వీడు’ రాశారట. అటువంటి సాహిత్యవాతావరణంలో పెరిగిన ఆరుద్ర ఆధునికతకు మారుపేరయిన ఈ డిటెక్టివు నవలా సాహిత్యం పట్ల ఆకర్షితులు కావటం వింతేమీ కాదు.


Arudra‘పలకల వెండి గ్లాసు’, ‘అణాకో బేడ స్టాంపు’, ‘అహింసా రౌడీ’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘ఆనకట్ట మీద ఆత్మహత్య’, ‘త్రిశూలం’, ‘కొండచిలువ’ అన్నవి ఇప్పటికి తెలిసిన ఆరుద్ర గారి డిటెక్టివు నవలలు. ఇవి గాక ‘పందిట్లో పెళ్ళవుతుంది’, ‘జ్వాలాముఖి’, ‘ఎర్రని ఆకుపచ్చ సైకిల్’, ‘నేరం ఎందుకొప్పుకొన్నాడు’, ‘సరియైన పరిష్కారం’, ‘వారిజాక్షులందు …’, ‘చెలియా కనరావా’ అన్నవి ఏడు డిటెక్టివు కథలు దొరికాయి.


1950లో ఆరుద్ర ‘పలకల వెండి గ్లాసు’ వెలువడింది. ఆ తర్వాత ‘అణాకో బేడ స్టాంపు’, ‘రెండు రెళ్ళు ఆరు’ వెలువడ్డాయి. మే 1956లో ఎం.వి.యస్ పబ్లికేషన్స్ వారి ప్రచురణగా ‘ఆనకట్ట మీద ఆత్మహత్య’ తొలిముద్రణ అచ్చయింది. వీటికేర్పడిన ప్రాచుర్యం వల్ల ఆయన 1957లో ‘ఆరుద్ర ప్రచురణలు’ సంస్థను స్థాపించి తన నవలలతోపాటు మరికొన్నింటిని పంపిణీకి తీసుకొన్నట్లు కనబడుతుంది. ఈ వ్యాసంగం ఎంతకాలం సాగిందో తెలియదు. డిటెక్టివులే గాక సాహిత్యగ్రంథాలేవైనా అచ్చువేశారో లేదో తెలియదు. టెంపోరావ్ గారి ‘మంచి మనిషికి మంచిరోజులు’, ‘మిస్టర్ వై’ లాంటి పుస్తకాల మీద కూడా ప్రచురణకర్తగా ఆరుద్ర పేరు కనబడుతుంది. ఆ పుస్తకాలకు ఉత్కంఠాపాదకంగా విడుదల ముందు నెలకే మంచి ప్రకటన వెలువడేది. 1957 ఫిబ్రవరిలో ఈ సంస్థ పక్షాన ‘అహింసా రౌడీ’ అచ్చయింది.


ఆరుద్ర సృష్టించిన అసమాన సజీవపాత్ర

ఇన్స్పక్టర్ వేణు విజయం సాధించిన మరొక పరిశోధన

అహింసా రౌడీ

వేణు ఒక రౌడీని విశ్వసించాడు. అందమైన ఒక యువతిని ఆ రౌడీ హత్య చేశాడని అందరూ భావించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రం సాక్ష్యం కూడా సేకరించాడు. రౌడీ కూడా ఒప్పుకొన్నాడు. గాని వేణు నిర్ణయం ఏమిటి?

త్రివర్ణ ముఖచిత్రం * వెల 75 నయా పైసలు


అని చిన్న కరపత్రాన్ని విడుదల చేశారు. 1957లో సెప్టెంబరులో ‘ఆడదాని భార్య’ వెలువడింది.


ఆ తర్వాత ‘ఆరుద్ర ప్రచురణలు’ కొనసాగినట్లు లేదు. ఆరుద్ర రచనలపై పరిశోధన చేసినవారికి కూడా ‘ఆడదాని భార్య’ నవల ఆచూకీ గాని, ‘ఆరుద్ర ప్రచురణలు’ సంస్థ వివరాలు గాని తెలియలేదంటే ఆశ్చర్యమే.


‘ఆడదాని భార్య’ దర్శకుడు ఆర్. జగన్నాథ్ కు అంకితమైంది. కథాక్రమపరిగతి అప్పట్లో చలనచిత్రాలకు వస్తువును సమకూరుస్తున్న ఆరుద్ర కృతిత్వానికి అనుగుణంగానే ఉన్నది. ఆరుద్ర రచన అనుకోకపోతే దీనినింతగా పట్టించుకొనేవాళ్ళు ఉండరేమో! కెమెరా ఏంగిల్సుతో సహా కొంత స్క్రీన్ ప్లే రచన, కొంత అతినాటకీయ చిత్రణ, పాత్రలకు ఊత పదాలు, వింత వింత పేర్లు, ట్రెయినుతో పోటీగా టాక్సీ పరుగులు, బాహాబాహీలు, ఎత్తులకు పైయెత్తులు సినిమాటిక్ గా ఉన్నప్పటికీ ఆరుద్ర మార్కు దేశీయత, తెలుగిళ్ళలోని ఆత్మీయతలు, చమత్కార సంభాషణలు మురిపిస్తూనే ఉంటాయి.


స్థూలంగా కథ ఇది: ఇన్‌స్పెక్టరు వేణు రైల్వే స్టేషను దగ్గరొక భయంకరవ్యక్తిని చూస్తాడు. అతని మొల నుంచి రక్తసిక్తమైన కత్తి జారి పట్టాల మీద పడుతుంది. అతను రైలెక్కి పారిపోతాడు. వేణు అతనొక జమిలి హత్యల కేసులో నిందితుడని గుర్తుపట్టి, ముందు స్టేషనుకు హెచ్చరిక చేయించి, కత్తిని రైల్వే ఆఫీసరయిన తన బావమరిదికి అప్పజెప్పి, టాక్సీలో బయలుదేరి ఆ రైలును వెంబడిస్తాడు. భయంకరవ్యక్తి అంతకు ముందే ఔటర్లో దిగిపోయాడని తెలుసుకొని, ఆ దారిని గుర్తుపట్టి వెంబడిస్తాడు. ఊరి చివర విచారంలో ఉన్న నాగయ్య అనే యువకుడు, ఒక దొరసాని వేషంలో ఉన్న లీలమ్మ కనిపిస్తారు. ఎంతటికైనా తెగించి ప్రేమను దక్కించుకోమని ఆమె అతనికి పిస్తోలును ఇస్తుంది. వేణు స్పందించే లోపునే ఆ స్త్రీని బెదిరిస్తూ భయంకరవ్యక్తి అక్కడికి వస్తాడు. అతను, వేణు ఘర్షణ పడతారు. ఆ పోరాటంలో భయంకరవ్యక్తికి స్పృహ తప్పుతుంది. వేణు దిగుడుబావిలో పడిపోతాడు. లీలమ్మ అతనిని కాపాడుతుంది. భయంకరవ్యక్తి మాయమైపోతాడు. టాక్సీ డ్రయివరు వచ్చి వేణును ఇంటికి తీసుకొనివెళ్తాడు. ఎవరో పొట్టి వ్యక్తి ఒకరు టాక్సీలో ఇంటికి వచ్చి కత్తిని తీసుకొనివెళ్ళారని తెలుస్తుంది. బయటి వెళ్ళి చూస్తే టాక్సీ ఉండదు. వేణు గూడ్సు రైల్లో మళ్ళీ పక్క స్టేషనుకు బయలుదేరుతాడు. ఆ వెంటనే ఆ ఊరి పోలీసులు వచ్చి వేణు పోలీసు అధికారి అని భార్య చెబుతున్నా వినక అతని దుస్తులను జప్తుచేస్తారు. హత్య కేసులో వేణు అనుమానితుడని చెప్తారు. చిన్న బావమరిది ద్వారా వేణుకు తను లేనప్పుడు జరిగిన విషయాలు తెలిసివస్తాయి.


వేణు ఆలోచిస్తాడు. ఎవరి హత్య జరిగి ఉంటుంది? తనపై అనుమానం ఎందుకు కలిగింది? అని. లీలమ్మను కలుసుకొంటే నిజం తెలుస్తుందని అనుకొంటాడు. ఆమె పిచ్చిదని, ప్రేమలో మోసపోయిందని, అప్పటినుంచి భగ్నప్రేమికులకు సహాయపడుతుంటుందని స్టేషను మాస్టరు చెప్తాడు. వేణు ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమె మాట్లాడుతూనే వేణును గదిలో తాళంవేసి బంధించి, పోలీసులను పిలవమని నౌకరును పంపిస్తుంది. భయంకరవ్యక్తి పేరు పోలయ్య అని, అతను మరణించాడని, అతనిని చంపినది వేణు అని, శవం ఇంకా బావి దగ్గరే ఉన్నదని అంటుంది. అంతలో నాగయ్య అక్కడికి వస్తాడు. తను ప్రేమించిన సుబ్బులుకు పరదేశితో పెళ్ళయిపోయిందని, వాళ్ళను చంపేందుకు చేతులు రాక పిస్తోలును తిరిగి ఇవ్వటానికి వచ్చానని చెబుతాడు. నీలాంటి ఆడదానికి భార్య కావడం కంటె చావటం మేలని లీలమ్మ అంటుంది. నాగయ్య పిస్తోలు తీసుకొని మళ్ళీ పరిగెడతాడు. వేణు గదినుంచి బయటపడి అతనిని వెంబడిస్తాడు. అతను సుబ్బులు ఉన్నచోటికి వెళ్తాడు. ఇద్దరూ మళ్ళీ వాదించుకొన్నా నాగయ్య సుబ్బుల్ని చంపలేక, పిస్తోలును పారవేసి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళి, అంతలోనే భయపడి బైటికి పారిపోతుంది. అంతలో ఒక టాక్సీ అక్కడికి వస్తుంది. ఒక ఆజానుబాహువు దిగుతాడు. ఇంట్లోంచి పెళ్ళిదుస్తులతో ఒక యువకుడు బయటికి వచ్చి, అందరూ కారెక్కి వెళ్ళిపోతారు. అంతలో ఊళ్ళోవాళ్ళు వస్తారు. వెయ్యి రూపాయలు కట్నం తీసుకొని సుబ్బుల్ని ఏలుకోకుండా మగపెళ్ళివాళ్ళు పారిపోయారని తెలుస్తుంది. వేణు నాగయ్య పారేసిన పిస్తోలుకోసం వెతుకుతాడు. అది మాయమైపోయింది.


వేణు వెనక్కి తిరిగి ఊళ్ళోకి వచ్చేసరికి సబ్ ఇన్‌స్పెక్టరు సత్యం పోలయ్య హత్యకేసులో శవపంచాయితీ జరుపుతుంటాడు. పరాంకుశం అన్నతను పోలయ్యను చివరిసారిగా చూసినది తానేనని చెబుతూ, హంతకుని పోలికలు చెప్పమంటే వేణును వర్ణిస్తుంటాడు. దెబ్బతిన్న పోలయ్యను బుజాన వేసుకొని నడిచినా అతని దుస్తులకు నెత్తురంటలేదని సత్యం అనగానే పరాంకుశం తెల్లపోతాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొంటారు. వేణు, సత్యం శవాన్ని చూడటానికి ఆసుపత్రికి వచ్చి వెళ్తారు. అది భయంకరవ్యక్తి పోలయ్య శవం కాదని వేణు గుర్తిస్తాడు. కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. చనిపోయినది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొన్న గజదొంగ అని తెలుస్తుంది. శవం వెన్నులో కత్తిపోటును చూసి వేణు తనకు మొదట దొరికిన కత్తి ఇతని హత్యాసాధనం అని గ్రహిస్తాడు. ఇంతలో కోటమ్మ కోనేరులో ఎవరో ఆత్మహత్య చేసుకొన్నారని వర్తమానం వస్తుంది. వెళ్ళి చూసేసరికి, అది సుబ్బులు శవం.


వేణు సుబ్బులు శవాన్ని చూసి అది ఆత్మహత్య కాదని నిర్ధారిస్తాడు. సుబ్బులు తండ్రి రామయ్య నాగయ్యే హత్య చేశాడని ఆరోపిస్తాడు. అంతలో వేణు ఆ పరిసరాలలో ఒక లేఖను గుర్తిస్తాడు. పెళ్ళిపందిట్లో జరిగిన అవమానాన్ని భరించలేక, సుబ్బులు నాగయ్య సలహాపై ఈ పని చేస్తున్నట్లు, “ఇంతవరకు నిర్భాగ్యురాలైనా ఇకమీదట సౌభాగ్యవతి కానున్న మీ కూతురు సుబ్బులు” అని అందులో వ్రాసి ఉంటుంది. వేణు నాగయ్యను అడిగి అసలు విషయం తెలుసుకొంటాడు. సుబ్బులుకు పెళ్ళికొడుకని చెప్పి ఆడపిల్లనిచ్చి చేసినట్లు తెలుస్తుంది. తామిద్దరమూ పారిపోవాలని నిర్ణయించుకొన్నామని, సుబ్బులు మాత్రం సమయానికి రాలేదని, నాగయ్య చెబుతాడు. సుబ్బులుకు ఈ సంబంధం తెచ్చినది పరాంకుశమే అని తెలుస్తుంది.


వేణు మళ్ళీ సుబ్బులును చివరిసారి చూసిన చోటికి వెళ్తాడు. కురులపేట కుండల వీధికి రమ్మని పైడయ్య అనే అతను ఎవరికో రాసిన ఉత్తరం ముక్కలు అక్కడ కనబడతాయి. కోటమ్మ కోనేరులో సుబ్బులుతోపాటు ఒక ఆజానుబాహువు ఉన్నాడని తెలుస్తుంది. తను సుబ్బులు ఇంటిముందు చూసినది హంతకుడినే అని వేణు గ్రహిస్తాడు. వెంటనే కురులపేట కుండల వీధికి వెళ్ళి, మొత్తానికి నిందితుల ఇంటిని కనుగొంటాడు. అక్కడ మరొక పెళ్ళి సంబంధం కుదురుస్తున్న ఆజానుబాహుడు, ఇతరులు ఉంటారు. వేణు ఇంట్లోకి జొరబడి వెళ్తాడు. మూతికి మీసాలున్న ఒక అందమైన అమ్మాయి కనబడుతుంది. అంతలో వెనుకనుంచి తలపై దెబ్బ తగిలి పడిపోతాడు. స్పృహ తెలిసేసరికి వేణు పక్కనే భయంకరవ్యక్తి శవం ఉంటుంది.


పారిపోయేముందు హంతకులు బయట తన జీపును పాడుచేసి వెళ్ళారని తెలుస్తుంది. ఇంతలో మొదట తను బాడుగకు తీసుకొన్న టాక్సీ అక్కడికి వస్తుంది. వేణు ఆ డ్రయివరుకు చెప్పి, ఆ దొంగలను వెంబడించాలనుకొంటాడు.


హత్య చేసినది ఎవరు? ఎందుకు హత్య చేసినట్లు? భయంకరవ్యక్తి (అతను తర్వాత హత్య చేయబడ్డాడు), నాగయ్య (నిరపరాధి కావచ్చు), లీలమ్మ (మతి స్తిమితం లేక చేసిందా?), పరాంకుశం (ఆడపెళ్ళివాళ్ళకు మోసపు సంబంధాలను తెచ్చి కుదురుస్తున్నది ఇతనే; పైగా పచ్చి అబద్ధాలకోరు), బ్లేజరు సూటు పెళ్ళికొడుకు (ఇతనిని ఏకాంతంగా చూసిన వెంటనే సుబ్బులు మనసు మార్చుకొని ఆత్మహత్యకు సిద్ధపడింది), ఒక పొట్టి వ్యక్తి (వేణు లేనప్పుడు ఇంటికి వెళ్ళి కత్తిని అపహరించినవాడు), ఆజానుబాహుడు (తప్పక అనుమానింపదగినవాడు), మీసాల యువతి (ఈమె కథేమిటో తెలియదు) మొత్తానికి అనుమానితుల జాబితాలో తేలినవాళ్ళు.


చివరికి వేణు తెలివిగా దొంగలను వెంటాడి ఒక్కొక్కరినీ బంధించటం ‘ఆడదాని హత్య’లో కొసమలుపు.


ఆజానుబాహువు ఒక మీసాలున్న యువతిని పెళ్ళికొడుకుగా పరిచయం చేసి, కట్నం డబ్బులు తీసుకొని, అమాయకులను మోసం చేస్తుంటాడు. పరాంకుశం అతనికి తోడు. భయంకరవ్యక్తి పోలయ్య వీళ్ళ ఆచూకీ కనుక్కొంటాడు. అతన్ని వదిలించుకోడానికి గజదొంగ పైడయ్యను వాడుకొంటారు. టాక్సీ డ్రైవరు రత్తయ్య డబ్బుకు ఆశపడి వీళ్ళకు సహాయపడతాడు.


లీలమ్మ నాగయ్యతో నీలాంటి ఆడదానికి భార్య కావటం కంటె సుబ్బులు చావటమే మేలని అంటుంది. కాని, సుబ్బులు నిజంగా తండ్రి కుదిర్చిన ఆడదానికి భార్యనయ్యానని ఆత్మహత్య చేసుకోవాలనుకొంటుంది. కాని, నాగయ్య ప్రేమను గుర్తించి అతనితో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. అంతలో ఆజానుబాహువు చేతిలో హత్యకు గురవుతుంది. ఆ క్రమంలో నవలకు ‘ఆడదాని భార్య’ అన్న శీర్షిక అర్థవంతంగా అమరింది.


కథ అంతటా ఆరుద్ర ప్రవేశపెట్టిన దేశీయవాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అధ్యాయాలకు తెలుగు అంకెలను వేయటం ఆరుద్ర ప్రత్యేకతే. భయంకరవ్యక్తిని వెంబడించినప్పుడు వేణు కాలికి పంచె అడ్డుతగిలి ముందుకు పరిగెత్తలేకపోతాడు. అతని ఆహార్యంలోని తెలుగుతనం అప్పటిదాకా పాఠకుల మనోనేత్రం ముందు ప్రత్యక్షం కాదు. ఇన్‌స్పెక్టరు వేణు, భార్య రుక్కు, బావమరిది ఆనందరావు అంతకు మునుపు పాఠకులకు పరిచితులైనవాళ్లే. మనఃస్తిమితం లేని లీలమ్మ తన పేరును పదే పదే ‘లీలా వనలతా స్వదేశీ ఖాదీ దొరసాని’ అని చెబుతుండటమూ, ఆమె తీరుతెన్నులూ సినిమా ఫక్కీలోనే ఉంటాయి. కథాంతంలో హత్యారహస్యం పొరలు విప్పి మలుపులన్నిటినీ వేణు ఛేదించిన విధం కొంత హఠాత్తుగా కనిపించి ముగింపును చివరి రీలులో తొందర తొందరగా లాగించివేసినట్లు అనిపిస్తుంది. కథాపాత్రల పేర్లను చెప్పక ఆజానుబాహువు, పొట్టి మనిషి, భయంకరవ్యక్తి అంటూ కథను నడిపించటం మొదట కుతూహలజనకంగానే ఉన్నప్పటికీ చివరిలో కథ పట్టుతప్పిన తర్వాత వాళ్ళ వ్యవహారం విసుగనిపిస్తుంది. కథానైపథ్యానుసంజనమంతా విరులపాలెం చుట్టుప్రక్కల పల్లెపట్టుల్లో జరుగుతుంది. ఎస్.ఐ సత్యం వేణును అనుమానించినా, కొంత సహకారిగానూ, మరొక ఎస్.ఐ పానకాలరావు వేణును కేవలం అనుమానితునిగానూ చూడటం పెర్రీ మేసన్ కథలను గుర్తుకు తెస్తుంది. కథాసంవిధానానికంటె కథ చెప్పటంలోని హుందాతనం పాఠకులను ఆకట్టుకొంటుంది.


ఆరుద్ర గారు రచించి, దురదృష్టవశాన మరుగున పడిపోయిన నవల ఇది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!