రంగి నీలాటి రేవు!


-

రంగి నీలాటి రేవు!

-

రంగి.. రోజూ మా ఇంటికి చల్లకొచ్చేది.

రంగి సంగతి చెప్పనే లేదు. రంగంటే గజ్జెల గుర్రమన్న మాట, పూచిన గున్న మామిడిలా ఉండేది 

ఒక్క ఓరచూపుతో ఊరు ఊరంతా గుబులు పుట్టించేది. ఒక్క మేని విరుపుతో పడుచువాళ్ల గుండెల్లో గుబులు రేపేది. కుర్రకారు అసలు రంగిని చూడటానికే అక్కడి కొచ్చేది.

.

మా ఊరు తెల్ల వారుజామ్మునే మేలుకునేది. జొన్నలు తొక్కుతున్న రోకళ్ల చప్పుడు కడుగు నీళ్లు కుడితిలో పోస్తున్న చప్పుడు.నీళ్లు తోడుతున్నప్పుడు నూతి గిలక చేసే చప్పుడు, ఆడవాళ్లు కళ్లాపి చల్లుతున్న చప్పుడు. మజ్జిగ చిలికే కవ్వాల చప్పుడూ, లేగదూడలు ’అంబా అంటూ చేసే చప్పుడు’ అప్పుడు పదహారణాల పల్లెటూరు మా ఊరు.

.

ఆ రోజు రంగి నీలాటి రేవు నుంచి వస్తున్నది. నీలం రంగు చీర పల్లెవాటు వేసి కట్టు కున్నది. నల్లగా నిగనిగ మెరిసిపోయే పెక్కలు కనబడేటట్టు కుచ్చిళ్లు ఎగదోపుకున్నది. కొప్పు ముడిచి ఒకపక్క ముద్దబంతి పువ్వు పెట్టుకున్నది. నేరేడు పండులా మెరిసిపోతున్నది రంగి.

-

రంగిని చూడగానే నా చెయ్యి అప్రయత్నంగా మీసం మీద పడ్డది. ఎదురుగా వెళ్లి ధైర్యంగా రంగికి కన్ను కొట్టాను.

నమ్మలేనట్టు ఓ క్షణం నన్ను ఎగాదిగా చూసింది రంగి.

సరిగా చూసిందో, లేదో నని ఇంకా దగ్గరికి వెళ్లి, ఘాట్టిగా కన్ను కొట్టాను.

-

"అత్తోయ్! యియ్యాల మా బావొచ్చిండు. మరింత పొయ్యి చల్ల!" అన్నది రంగి. ఊళ్లోని వారంతా పిన్నీ అనో బాబాయి అనో, అత్తా అనో అక్కా అనో పెదనాన్నా అనో వరసలు పెట్టుకునే పిలుచుకునే వాళ్లు.అలా పిలుచుకోవడానికి ఏ కులాలు, మతాలు,అంతస్తులు అడ్డొచ్చేవి కావు. ఏంకాల మది!

"ఏ బావే?" నవ్వుతూ అడిగింది మా అమ్మ.

"నా కెంతమంది బావలున్నారే"? బుంగమూతి పెట్టింది రంగి,

"ఊరంతా నీ బావలే కదనే!" నవ్వుతూనే అన్నది అమ్మ.

"మరింకేం, నీకొడుక్కి సేస్కోరాదు నన్ను! ఏం పిలగా పెళ్లి సేసుకుంటావా నన్ను?"

ఎగరాళిగా నా వైపు చూస్తూ అన్నది రంగి.

నా బుగ్గలు ఎరుపెక్కాయి. ఆడపిల్లలా సిగ్గుపడిపోతూ ఇంట్లోకి తుర్రుమన్నాను.

రంగిమాటలు నన్ను సవాలు చేసినట్టనిపించింది. ఉక్రోషమొచ్చింది. నా కేమిటి తక్కువ? వెళ్లి అద్దంలో చూసుకున్నాను. అప్పుడే మొలుస్తున్న నూనుగు మీసాలను చూస్తుంటే గర్వమనిపించింది. అమ్మగానీ రావడం లేదు గదా అని అటూ ఇటూ చూశాను. దర్జాగా మీసం మీద చెయ్యి వేసి ఓహో మొగాణ్ణంటే నేనే కదా అని రొమ్ము విరుచుకున్నాను. ఈసారి రంగి గానీ కనిపించాలి నా సామిరంగా అప్పుడు చెబుతా దాని సంగతి అనుకున్నాను.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!