తాపసుని జీవయాత్ర!


-

-

తాపసుని జీవయాత్ర!

(పోతనామాత్యుడు..భాగవతంలో..)

పరమాత్మకు భిన్నమైన పదార్థమంటు ఏదీ లేదు.

సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదులుతారు. 

ఇతర విషయాలమీద వ్యామోహం విడుస్తారు. 

మహనీయైలైన మాధవుని చరణారవిందాలను మనస్సులో అనుక్షణమూ నిల్పుకుంటారు. విష్ణుసంబంధ మగు పరమపదమే అన్నింటికంటె ఉత్తమస్థానమని గ్రహిస్తారు. 

ఈ రీతిగా శాస్త్ర జ్ఞాన బలము అనే మంటలో విషయవాసనలను తగులబెట్టి వారు దేని మీదా అపేక్ష లేకుండా ఉంటారు.

.

శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదలనివాడు వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండంలో ఖేచరులు, సిద్ధులు, విహరించడానికి అనువైనది, అణిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినట్టి బ్రహ్మలోకం చేరుతాడు. విద్య, తపస్సు, యోగం, సమాధులను అనుష్ఠించి లింగశరీరాన్ని వాయులీనం చేసిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల, వెలుపల సంచరిస్తుంటారని పెద్దల మాట. 

కల్పాంతంలో అనంతుని వదనమునుండి వెలువడే కరాళాగ్ని 

జ్వాలల్లో దగ్ధమయి పోతున్న త్రిలోకాలను చూస్తాడు. 

అందువల్ల జనించే అగ్ని దాహం సహించలేక అక్కడనుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు, అక్కడే నివసిస్తాడు.

.

ఇలమీఁద మనువు లీరేడ్వురుఁ జనువేళ; 

దివసమై యెచ్చోటఁ దిరుగుచుండు

మహనీయ సిద్ధవిమాన సంఘము లెందు; 

దినకరప్రభములై తేజరిల్లు

శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ; 

నివహంబు లెందు జనింపకుండు 

విష్ణుపదధ్యాన విజ్ఞాన రహితుల; 

శోకంబు లెందుండి చూడవచ్చు

-ఆ.

పరమసిద్ధయోగి భాషణామృత మెందు 

శ్రవణ పర్వమగుచు జరుగుచుండు

నట్టి బ్రహ్మలోకమందు వసించును

రాజవర్య! మరల రాఁడు వాఁడు.

.

భావము:

భూలోకంలో పదునల్గురు మనువులు పుట్టి గిట్టే కాలమంతా కలిస్తే 

బ్రహ్మలోకంలో ఒక్క దినమవుతుంది. అక్కడ మహనీయులైన సిద్ధుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతుంటాయి. శోకం, వార్ధక్యం, 

మృత్యువు, కృశత్వం, భయం, దుఖం – ఇలాంటి బాధ లక్కడలేవు. 

హరిచరణాలను ధ్యానించాలనే తెలివి లేక మూఢులైన వారి శోకస్థితిని బ్రహ్మలోకం నుండి గమనించవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులూ, యోగులూ అమృతాప్రాయంగా సంభాషించుకోవడాన్ని చెవుల పండువుగా అక్కడ వినవచ్చు. అలాంటి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు. మళ్ళీ ఆ లోకంనుండి తిరిగి రానేరాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!