తెనాలి రామకృష్ణుడి పద్యాలు!

తెనాలి రామకృష్ణుడి పద్యాలు!

-

ప్రెగడరాజు నరస కవితో వాదన సందర్భంలో-

-

తృవ్వట బాబా తల పై

బువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే

బువ్వట చూడగ హుళులు

క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!

-

ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వమం

దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్

మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో

సికమొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !!

తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్

పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ

పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా

రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!

(".... భావ్యమెరుంగవు ... నిరసింతువా..." అని పాఠాంతరం)

-

భట్టు మూర్తి కవిత్వం గురించి అవహేళన చేస్తూ)

చీపర బాపర తీగల

చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ

కాపు కవిత్వపు కూతలు

బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!

-

(అల్లసాని పెద్దన కవిని "అమవస" అనే మాట వాడినందుకు వెటకరిస్తూ)

ఎమి తిని సెపితివి కపితము

బెమ పడి వెరి పుచ్చ కాయ మరి తిని సెపితో

ఉమెతక్కయ తిని సెపితో

అమవస నిసి యన్న మాట నలసని పెదనా !!

-

(రాయల వారిని పెద్దన పొగడిన పద్యం)

శర సంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులన్ గల్గి దు

ర్భర షండత్వ బిల ప్రవేశ కలన బ్రహ్మఘ్నతల్ మానినన్

నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా 

నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణా ! రాజ కంఠీరవా !

-

అర్జునుడు, సింహము, క్షితి - ఈ మూడింటిలోని లోపాలు గణించక పోతేనే వీటిని నీతో పోల్చ వచ్చు అని భావం. ఐతే ఒక పాదం లో సింహం తోపోల్చ రాదంటూనే పద్యం చివర "రాజ సింహమా" అని పిలవడం ఏం సబబు ?అని తప్పు చూపించి 

తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం-

=

కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం

డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్ తార కుం

డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో

గలగంబారుతునేగె నీవయనుశంకన్ కృష్ణరాయాధిపా !!

(ఇంకొక పద్యం)

-

నరసింహ కృష్ణ రాయని

కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్

కరి కరిభిత్ గిరి గిరిభిత్

కరిభిత్ గిరిభి త్తురంగ కమనీయంబై !

--

("కుంజర యూధంబు.." అనే సమస్యా పూరణ నిచ్చినందుకు కోపం తో)

-

గంజాయి తాగి తురకల

సంజాతుల గూడి కల్లు చవి గొన్నావా 

లంజల కొడకా ఎక్కడ

కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్ !!

(అదే సమస్యను రాయల వారు అడిగినప్పుడు)

-

రంజన చెడి పాండవులరి

భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా

సంజయ విధి నే మందును

కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్ !!

("గొల్వు పాలై రకటా" అని పాఠాంతరం)

--

(నంది తిమ్మన ను పొగడుతూ)

మా కొలది జానపదులకు

నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట

ద్భేకములకు గగనధునీ 

శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

(మూడో పాదంలో "గగన ధునీ" అనే ప్రయోగాన్ని "నాక ధునీ" అని మార్చి "రాజ కవి" (కృష్ణ రాయలు) "కవి రాజు" (రామకృష్ణుడు) ప్రశంసను పొందాడని ప్రతీతి)

-

వాకిటి కాపరి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పధకం వేసి చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి.

-

వాకిటి కావలి తిమ్మా ! 

ప్రాకటముగ సుకవి వరుల పాలిటి కొమ్మా !

నీకిదె పద్యము కొమ్మా !

నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!

-

ధూర్జటి ని స్తుతిస్తూ రాయలు 

-

స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ

యతులిత మాధురీ మహిమ ?

దానికి రామకృష్ణుని చమత్కార సమాధానం

-

హా తెలిసెన్ భువనైక మోహనో

ద్దత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం

తత మధురాధరోదత సుధా రస ధారల గ్రోలుటంజుమీ !!

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!