'శృంగార నైషధము'

-

'శృంగార నైషధము'

- ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు

.

శ్రీనాథుఁడు వ్యభిచారియను ప్రతీతి లోకమునందున్నది. అది యెంతవఱకు సత్యమో మనము చెప్పఁజాలము. కాని శృంగార రసపోషణమున నాతని కభినివేశము మెండని చెప్పుటలోమాత్ర మతిశయోక్తి లేదు. రచనలలో శృంగార రసమును చక్కఁగా పోషించు వారందఱును జీవితములోఁ గూడ శృంగార క్రియాలాలసులై యుందురని భావించుట యుక్తము కాదు.

-

శృంగార రసపోషణాసక్తి కలవాఁడయ్యును నైషధమున శ్రీనాథుఁ డౌచిత్య దృష్టితో కావించిన మార్పులావిషయమున నాతనికిఁగల నిగ్రహమును ప్రదర్శించును.

హంస దమయంతికి నలుని సౌందర్యమును వర్ణించిచెప్పునప్పుడు

మూలకర్త రంభాద్యప్సరలనేకాక యింద్రాణియు త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ లక్ష్మీ పార్వతులను గూడ నాతని యతిలోక సౌందర్యమును గూర్చి విని చిత్త విభ్రాంతికి లోనైరని వర్ణించియుండెను.

-

లోకమాతలైన ఆ సతీమతల్లుల కట్టి చిత్త వికారము కలిగెనని యూహించుట యసంభావ్యమును అనుచితమును అగుటచే శ్రీనాథుఁడా శ్లోకము లనువదింపక విడిచివైచెను. దేవవేశ్య యగుటచే రంభయందట్టి వికార మసంగతము కాదని తలంచుటచే కాఁబోలు నా శ్లోకమును మాత్ర మనువదించెను.

ఆ శ్లోకమిది.

.

అస్మత్కిల శ్రోత్ర సుధాం విధాయ

రంభాచిరంభామతులాం నలస్య

తత్రానురక్తా తమనాప్య భేజే

తన్నామగంధా న్నలకూబరం సా. (3-26)

.

(రంభ నలుని సాటిలేని కాంతినిగూర్చి చిరకాలము నా వలన విని శ్రవణామృతమును బొంది, యతని యందనురక్తయై యతని బొందలేక తన్నామ వాసన యుండుటచే కుబేర సుతుడైన నలకూబరుని పొందెను.)

దీనిని శ్రీనాథుఁడు

విను కలిఁ గూర్మిజిక్కి పృథివీ భువనంబునకుం డిగంగనే

యనువునులేక రంభయను నచ్చరలేమ, నలున్‌ వరింపఁబూ

నిన తనకోర్కి నొక్కమెయి నిండఁగఁ జేయుటకై భజించె దాఁ

గొనకొని వేల్పులందు నలకూబరుఁ డచ్ఛుభనామవాసనన్‌. (2-54)

-

అని యథామాతృకముగా ననువదించెను. మూలమునందలి 'అనాప్య' అను పదము నాతఁడు "పృథివీ భువనంబునకున్‌ డిగంగనే యనువునులేక" యని కారణసూచనపూర్వకముగా చక్కగా వివరించెను.

-

(చిత్రం - వడ్డాది పాపయ్య గారు )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!