మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 2

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

-

శ్లోకం - 2

మూఢ జహీహి ధనాగమతృష్ణాం

కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |

యల్లభసే నిజకర్మోపాత్తం

విత్తం తేన వినోదయ చిత్తం ||

-

శ్లోకం అర్ధం : ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.

తాత్పర్యము : హృదయమున తృప్తిలేని వారికి ఎంతయున్నను సుఖము, సంతోషము రావు. ధన సంపాదనలో చిక్కిన జీవికి ఆశ వదలదు, ఆశ వదలనిచో తృప్తి చేకూరదు, తృప్తి లేనిచో ఎంత గడించినా సంతోషము రాదు. 

కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమగును. కోట్లు గడించినా కాటికి చిల్లి గవ్వరాదు కదా, ఆ సంపాదనకు చేసిన క్రూర కర్మలవల్ల పాపపు మాటలు పెరిగి, అవి మాత్రము మనతో వచ్చును. కనుక ఉన్న దానితో తృప్తి పడుచు, బ్రతుకుటకు మాత్రము ఎంత గావలెనో అంత మాత్రమే సంపాదించుచూ, మనసు భగవధ్యానము పై మళ్లించిన వాడే నిజమైన ధన్యజీవి. 

లక్షలు గడించిన మాత్రమున నీ ప్రభావము అధికము కాదు, నీ కీర్తి చిరస్థాయిగా మిగులదు. ఎందరో రాజులు, ప్రభువులు, కోటీశ్వరులు, లక్షాధికారులు, ఎంతమందో కాలగర్భంలో కలిసి పోయారు. వారి పేర్లు, ఊర్లు కూడా ఎవరికీ తెలియదు. 

మరి త్యాగధనులు, భగవంతుడి భక్తుల పేర్లో, అవి ఆచంద్రార్కము భువిలో చిరస్థాయిగ మిగులుట లేదా? కండ, అండ, ధన, మద బలంతో, మంచివారిని అణగ ద్రొక్కి, అధికార పగ్గాలు చేతబట్టి, అరాచకాలు సృష్టిస్తూ, ధనాన్ని సంపాదిస్తున్న ఎందరో, అదే రీతిలో అకాల మరణాల పాలై, ఎంత దైన్యస్థితి నొందుచున్నారో! 

బ్రతికి ఉన్నా వారికి శాంతి లేదు, ఎప్పుడు ఎవరి వల్ల అపకారం జెరుగుతుందో అని ప్రతిక్షణము భయపడుతూ బ్రతుకుతారు, అత్యంత హీనమైన చావు చస్తారు. కనుక, సంపాదనకు సమయము వృధా చేయక, హరి ధ్యానము పై మనసును మళ్ళించుము.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!