లోకులకి జోహార్లు – (*కోతి కొమ్మచ్చి , బాపు రమణీయం *)


-

లోకులకి జోహార్లు –

(*కోతి కొమ్మచ్చి , బాపు రమణీయం *)

.

మాతమ్ముడి పెళ్లి విశాఖపట్నంలో జరిగింది. ముప్పాళ్ళ రంగనాయకమ్మ డిఫెన్సు కాలనీలో ఉన్నారని తెలిసింది.

పదిహేను మైళ్ళన్నారు . నేనూ శ్రీదేవి టాక్సీ కట్టించుకుని ఆ కాలనీకి వెళ్లాం.

స్వామిగారు ఆఫీసుకు వెళ్ళారు. రంగనాయకమ్మ గారు బియ్యం నెరిపి వడ్లూ బెడ్డలూ ఎరుతుంది.

చిన్నప్పటి దద్దనాల రంగనాయకమ్మగా బాల రచనలు చేసినప్పటినించీ తెలుసు. గొప్ప కథలూ నవలలూ రాయడమూ తెలుసు – ఆంధ్రపత్రిక వారి ఆడపడుచు అనుకుంటూ ఉండేవాళ్ళం.

శుభలేఖ ఇచ్చి పెళ్ళికీ భోజనాలకీ రావాలని చెప్పాను.

“మేం రానండి” అందామె.

నేను నెవ్వర పోయాను.

“మేం బ్రామ్మలం కాదు. భోజనాలకొస్తే వసారాలోనో అరుగుమీదో వడ్డిస్తారు. ఆకులు మేమే తీయాలంటారు – నాకు చిరాకు” అంది.

“అమ్మా – మా ఇంట్లో అలాంటివి ఉంటె పిలవడానికి ఇంత దూరం రాను కదా – సాటి రచయితగానే పిలవ వచ్చాను. నాకలాటి తేడాలు లేవు” అన్నాను.

“మీకు లేకపోయినా మీ యమ్మావాళ్ళ కుంటాయి.”

“మా అమ్మ సత్సంగం – దయాళ్ బాగు – రాధాస్వామి మతం ; కులాల్లేవు.”

“మీ యమ్మక్కాపోతే వాళ్ళమ్మకుంటాయి – మిగతా వాళ్లకుంటాయి” అందావిడ బియ్యంలో బెడ్డలు ఎరుతూనే.

నాకు చిరాకేసింది.

చేతులు జోడించి దండం పెట్టాను.

“అమ్మా – కులం పట్టింపులు నాకు లేవుగాని మీకు చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి – నిన్ను రిపేరు చెయ్యడానికి నాకు తీరికలేదు. దయచేసి మీరు పెళ్ళికి రావద్దు – ఆ ఒక్కరోజూ వైజాగ్ కూడా రావద్దు” అన్నాను.

ఇంటికొచ్చిన ఇల్లాలికి కుంకం బొట్టు కూడా ఇవ్వలేదు.

పిలుపులకోసం తెచ్చుకున్న కుంకంబరిణలోంచి తీసి శ్రీదేవి తను బొట్టుంచుకుని ముందుకు వంగి ఆమెకు బొట్టు పెట్టింది.

వెళ్ళిపోయాం. కారులో వెళ్తుంటే – నాదే తప్పనిపించింది. దూడుడుగా మాట్లాడాను.

ఆమెను ఇంతకుముందు ఎవరో చాలా నొప్పించి ఉండాలి. అందుకే అంట రోషంగా పెడసరంగా మాట్లాడింది అనిపించింది.

కారు తిప్పి వెనక్కి వెళ్లి సారే చెబుదామనుకున్నాను. కాని వెళ్లి సారీ చెబితే – ఆ బియ్యం చాట నా నెత్తిన బోర్లించి చాటాడు అక్షింతలు వేస్తుందని భయంవేసి – చంద్రబాబుగారిలా ‘ముందుకే పోదాం’ (ఎందుకేనా మంచిది) అన్నాను డ్రైవర్ తో .

నాలుగు రోజులు పోయాక ఆవిడే సారీ చెప్తూ నాలుగు పేజీల లెటర్ రాసింది.

కో. కొ ఒకోసారి ‘’ఇన్సల్ట్ కన్న క్షమాపణే ప్రమాదకరం.”

అన్నాడు ఒక జోకర్.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!