బంగారు ముంగిస చెప్పిన కథ

బంగారు ముంగిస చెప్పిన కథ


-

బంగారు ముంగిస చెప్పిన కథ

-

బంగారు ముంగిస చెప్పిన కథ బంగారు ముంగిస చెప్పిన కథకురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ పూర్తయ్యాయి. పెద్దలందరూ కలిసి ధర్మరాజుని హస్తినాపుర సింహాసనం మీద కూర్చుండపెట్టారు. ధర్మారాజు రాజ్యభారాన్ని వహించగానే, అశ్వమేధ యాగాన్ని సంకల్పించాడు. ఆ యాగమూ దిగ్విజయంగా పూర్తయ్యింది. ధర్మరాజు వదిలిన అశ్వం అనగానే, ఏ ఒక్క రాజూ దానిని నిలువరించే సాహసం చేయలేదు. ఒకటీ అరా రాజులు తెలిసీ తెలియక ఆ యాగాశ్వాన్ని నిలువరించినా, వారికి అర్జునుడి చేతిలో ఘోర పరాజయం తప్పలేదు.

 

యాగం ముగిసిన తరువాత ధర్మరాజు తన దానగుణానికి తగినట్లుగానే భూరిదానాలను అందించాడు. యాగానికి దక్షిణ కింద వేదవ్యాసునికి భూమిని సమర్పించాడు. కానీ వేదవ్యాసుడు తనకు భూమి బదులుగా బంగారాన్ని అందించమని కోరుకున్నాడు. దాని మీద కొంత తర్జనభర్జనలు జరిగిన పిమ్మట, తాను వ్యాసునికి సమర్పించిన భూమిని తిరిగి తానే కొనుక్కునేందుకు నిశ్చయించుకున్నాడు ధర్మరాజు. అలా ధర్మరాజు భూమిని దానం చేసినట్లూ అయ్యింది, దానిని వ్యాసుడు ధనం కిందకి మార్చుకోవడమూ జరిగింది. కోటానుకోట్ల బంగారు నాణేలకి తన భూమిని అమ్మిన వ్యాసుడు, తిరిగి ఆ ధనాన్ని రుత్విజులందరికీ పంచిపెట్టేశాడు.

 

ఈ అశ్వమేధయాగం సందర్భంగా జరిగిన దానాలు, చేజిక్కించుకున్న విజయాలు, సాగిన వైభవం... ముల్లోకాలలోనూ వ్యాపించింది. దేవతలు సైతం ఇలాంటి యాగాన్ని చూడలేదనీ, దీనికి సాటి వచ్చే మరో యాగం జరిగే అవకాశం లేదనీ తేల్చిచెప్పేశారు. అలాంటి సమయంలో ఒక ముంగిస యాగవాటిక దగ్గరకు చేరి పొర్లడం మొదలుపెట్టింది. దాని చేష్టలని ఆసక్తిగా చూసినవారు, దాని రూపుని గమనించాక మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

 


 

ఆ ముంగిస ఒళ్లు సగం మామూలుగానే ఉన్నా, మిగతా సగం బంగారు వర్ణంలో ఉంది. రుత్విజులంతా ముంగిసను ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా ‘అబ్బే! సక్తుప్రస్థుడు చేసిన ధర్మంతో పోలిస్తే ఈ యాగం ఏపాటిది. దానికే ఇంతగా పొగడాలా!’ అనేసింది ముంగిస.

 

ముంగిస మాటలకు చూపరులంతా ఆశ్చర్యపోయారు. దేవతలంతా కీర్తించిన యాగాన్ని ఒక ముంగిస చులకన చేయడం వారికి రుచించలేదు. వారి హావభావాలను గమనించిన ముంగిస, సక్తుప్రస్థుని కథను ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ‘‘పూర్వం ఉంఛవృత్తిలో జీవించే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు సక్తుప్రస్థుడు. ఉంఛవృత్తి ద్వారా తనకు లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ, ఆ కాస్త ఆహారాన్నే అతిథులతో పంచుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. ఒకనాడు సక్తుప్రస్థుని పరీక్షించేందుకు ధర్మదేవతే ఒక అతిథి రూపంలో వారి ఇంటికి వచ్చాడు.

 

‘‘అది కరువు కాలం! ఆ రోజున సక్తుప్రస్థుని కుటుంబం ఆకలి తీర్చుకునేందుకు కేవలం ఒక కుంచెడు పేల పిండి మాత్రమే అందుబాటులో ఉంది. దానినే వారు నాలుగు భాగాలుగా చేసుకుని తినేందుకు సిద్ధపడుతున్నారు. ఎప్పుడైతే అతిథి ఆకలితో తన ఇంట ముందు నిలిచాడో, సక్తుప్రస్థుడు తన భాగాన్ని ఆ అతిథికి నిస్సంకోచంగా అందించేశాడు. కానీ ఆ కాస్త పిండీ, అతిథి ఆకలిని తీర్చలేకపోయింది. దాంతో సక్తుప్రస్థుని భార్య, కొడుకు, కోడలు కూడా తమతమ భాగాలను అతిథికి అర్పించారు. ఒక పక్క ఆకలి బాధతో విలవిలలాడుతున్నా, అతిథి కడుపు నిండిందన్న తృప్తితో వారంతా మరణించారు. వారి దానగుణన్ని మెచ్చిన ధర్మదేవత వారంతా బ్రహ్మలోకానికి చేరుకునేలా ఆశీర్వదించాడు.

 

‘‘ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. సక్తుప్రస్థుడు తన అతిథి కాళ్లను కడిగిన నీరు, అతిథికి అర్పించిన పేలపిండి వాసనా నా శరీరాన్ని సోకడంతో... సగభాగం బంగారుమయం అయిపోయింది. అప్పటి నుంచి నా మిగతా శరీరం కూడా బంగారం కాకపోతుందా అన్న ఆశతో ఎన్నో ధర్మక్షేత్రాలను దర్శించాను, యాగవాటికలలో సంచరించాను. అయినా సక్తుప్రస్థుని ధర్మనిరతికి సాటి వచ్చే ఫలం నాకు దక్కలేదు. ఇన్నాళ్లకి ధర్మరాజు చేస్తున్న ఈ అశ్వమేధయాగం చూసి, ఇక్కడైనా నా కోరిక నెరవేరుతుందని ఆశించాను. ప్చ్‌! ప్రయోజనం లేకపోయింది,’’ అంటూ తన దారిన తను చక్కగా పోయింది.

 

అందరూ సక్తుప్రస్థునిలాగా తమ కుటుంబాలను అర్పించుకుని దానాలు చేయలేకపోవచ్చు. కానీ ధనవంతుడు తనకు మిగులు ఉన్న సొమ్ము నుంచి దానం చేసేకన్నా, పేదవాడు తనకు ఉన్నదానిలోంచి కొంతభాగాన్ని ఇతరులతో పంచుకోవడమే గొప్ప అన్న సూత్రాన్ని ఈ కథ స్పష్టం చేస్తోంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!