భారతీయులమండీ మేం భారతీయులం:

-

భారతీయులమండీ మేం భారతీయులం !

రచన: అనంత శ్రీరామ్ ( గీత రచయిత)

భారీ డైలాగులు కొట్టడానికీ,బార్ల షాపులలో కూర్చోడానికీ బాగా అలవాటు పడ్డాం

భారాలు ఎత్తుకోమంటే ఎలా ఎత్తుకొంటాం

వీలయితే దించేసుకొంటాం

లేదా వదిలించేసుకొంటాం

ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూస్తాం,

ఒక వేళ ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే ఎగతాళి చేస్తాం.

భారతీయులమండీ మేం భారతీయులం.

మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం, కానీ మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదు.

ఒక్కొక్క లంచపు కొడుకుని ఏరిపారేయాలంటాం, ఓట్లప్పుడు మేం అడిగే లంచాల జోలికి మాత్రం రావద్దు.

దోచుకొన్న దొరల పళ్ళు రాలగొట్టేయాలంటాం, మేం ఎగ్గొట్టిన పన్నుల గురించి మాత్రం అడగకూడదు.

దేశమంటే మట్టి కాదు మనీ అనేది మా నినాదం, అందుకే మనీ మొత్తం మట్టిలో (రియల్ ఎస్టేట్) దాచుకొంటాం

పైవాడు వచ్చి ఆ మట్టిని తవ్వితే తప్ప మా ఇంటి ముందున్న మట్టి రోడ్డు గుర్తుకు రాదు.

నువ్వు పనులు చేస్తే కానీ పన్నులు కట్టమని జనం, నువ్వు పన్నులు కట్టితే కానీ పనులు చేయమని ప్రభుత్వం

ఇదీ మా కోడి,గుడ్డు సూత్రం.

అంతేకానీ మేం కోడిగుడ్డు వేసుకోవడం ఆపం

అరే బాబూ దేశంరా అంటే ఆ! గాడిదగుడ్డు లే !అనడం ఆపం

ఆ అడిగేదేదో ప్రభుత్వంలో పడుకొనున్నొడు ఉన్నంతకాలం అడగం

పరిగెత్తించే వాడు ఉండేవాడు అడిగితేనే మాకు ఆవేశం, ఆయాసం 

ఏమండీ ఎక్కువ మాట్లాడకండి

భారతీయులమండీ మేం భారతీయులం

మా పెద్దలు ప్రతిదానికీ కథలిచ్చేశారు కదండీ

ఎదవ కథలకు మా దగ్గర లోటు లేదు.

మొసళ్ళను వెల్లగొట్టేశామని, చేపలను ఎండబెట్టేశామని,

ఇలా ఎన్నైనా చెప్పేస్తాం.

నీటిలో ఉన్న మొసలి ఏనుగునైనా తినగలదని, బయట ఉన్న మొసలిని కుక్క కూడా తరమగలదని మాకు తెలియదేంటండి.

అయ్యబాబోయ్ మా ముసలాళ్ళు అని మొసలి కన్నీరు కారుస్తాం కానీ వాళ్లకు కొంచెం మంచినీరు అందించడానికి మనసు రాదు ఎందుకంటే 

మేం భారతీయులమండీ

సిపాయిల శవాల మీద పడి చిరునవ్వులు ఏరుకొన్నప్పుడు సిగ్గులేదు కానీ

చలామణిలో లేని నోట్లకు చిల్లర తీసుకొమ్మంటే ఎక్కడ లేని కష్టం అండీ

జన్మలో లైన్లే చూడనట్టు

అమ్మాయిలకు లైన్లే వేయనట్టు

ఎదవ పత్తిత్తు కబుర్లు చెప్పేస్తాం

ఇదంతా చదివేక ఒకటే మాట చెబుతామండి, ఈ రాసేవాడిది ఏం పోయింది a.c.లో కూచోవటం రాయటం

మేం ఎండలో నిలబడటం నేరం

నవంబరు..నడి వేసవి ఎండలో???

భారతీయులమండీ మేం భారతీయులం

# Anantha Sriram

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!