ఒక మంచి పద్యం !

ఒక మంచి పద్యం !

"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే

వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ

భేరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై

యీరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!

.

దానం ఈయవద్దని చెప్పిన రాక్షసగురువైన శుక్రాచార్యుడితో 

బలిచక్రవర్తి పలికిన పలుకులు. 

ఓ గురుదేవా! ఆదినుండీ ఎందరెందరో రాజులు కాలేదా? 

వారికి ఎన్నెన్నో సామ్రాజాలు సిద్ధించలేదా? 

ఆ రా జ్యాధీశులు ఎంతెంత గర్వాహంకారాలు ప్రదర్శించారో

కదా? మరి వారంతా యేరి? 

సిరిమూటకట్టుకొని వెళ్ళగలిగారా? లేదే.

ఈ భూమిపై వారి పేర్లైనా మిగిలి ఉన్నాయా? 

కానీ శిబిచక్రవర్తివంటి మహాదాతలు కీర్తికాములై, ప్రేమతో అడిగినవారి కోర్కెలు తీర్చలేదా? 

వారిని ఈనాటికైనా ఎవ్వరైనా మరచిపోగలిగారా?

.

బలి: ప్రహ్లాదుని మనవడైన బలి అవడానికి రాక్షసుడే 

అయినా తాతలోని సద్గుణాలన్నింటినీ పునికి పుచ్చుకున్నాడు.

కానీ త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో, బలిని సంహరించక తప్పింది కాదు విష్ణుమూర్తికి. అందుకోసం వామనుడి అవతారంలో వచ్చిన విష్ణువు తనకు మూడడుగుల స్థలం దానంగా కోరుకుంటాడు. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే! మొదటి పాదంతో ఆకాశాన్నీ, రెండో పాదంతో భూమినీ కప్పివేసి ఇక మూడో పాదం కోసం అడగగా... తన శిరస్సునే చూపుతాడు బలి చక్రవర్తి. తన దానగుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. చిరంజీవివి కమ్మంటూ వరాన్ని పొందుతాడు..


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!