తిరుపతి వేంకట కవుల సమయ స్ఫూర్తి!

తిరుపతి వేంకట కవుల సమయ స్ఫూర్తి!

-

అవధాన నిర్వహణంలో ఆశుకవితా ప్రసారంలో అనుపమాన చాతుర్యం వారిసొత్తు. సమయానుకూలంగా చమత్కార భాజనంగా ఆశువును నడిపించటంలో ఆరితేరిన వారు తిరుపతి వేంకట కవులు. వారు అవధాన జైత్ర యాత్రలు చేస్తూ వివిధరాజాస్థానలను దర్శించేవారు.సమయాను కూలంగా ఆప్రభువులను రంజింపచేస్తూ వారిచే సన్మానింప బడుచుండెడివారు. ఆపరంపరలో భాగంగా వారు విజయనగర( తూర్పుకోస్తా) సంస్థానానికి విచ్చేశారు. పండితాభిమానియు,కవిజన పోషకుడును అగు ఆనంద గజపతి సన్నిధిలో వారు చెప్పిన పద్యాన్ని యిప్పుడు విందాం!

ఉ: ఎందరిఁ జూపెనేని వరియింపదు మాకవితాకుమారి, క 

న్నందుకు దేశముల్ దిరుగుటబ్బెను, సౌఖ్యము లేకపోయె, నా 

నంద నృపాల! నీదు సుగుణంబుల నే వివరించునంత వెం 

టం దలయూచె;ఁ గావున, తటాలున దీని బరిగ్రహింపుమా!!

తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!

దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా

రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ

మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.

తిరుపతి వేంకటకవులు- నానారాజ సందర్శనం;

తమ కవిత నొక యీడేరిన యాడపిల్లగా ఆమెకు వరాన్వేషణ చేయుచున్న కన్యాదాతగా తమనువర్ణించు కొనుచు,రాజా! మాకవితా కుమారికి వరునకై బయలుదేరితిమి. యెమదరిజూపినా వరింపదాయె? యేమిచేతుము? కన్నందుకు దేశదేశములు తిరుగు చుంటిమి సుఖమాశూన్యమాయెను. నేడు మాభాగ్యము పండినది. నీసుగుణములను విని నిను వరించుటకు తలయూపినది. యీమె మనసు మారకుండ వెంటనే యీమెను వరింపు మని చమత్కార రంజితముగా పద్యము లల్లి ఆనంద గజపతిని మెప్పించి ఘనసన్మానముల నందిరి.

" సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్"

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!