మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 6

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

-

శ్లోకం - 6

యావత్పవనో నివసతి దేహే 

తావత్పృచ్ఛతి కుశలం గేహే|

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మిన్కాయే||

-

శ్లోకం అర్ధం : శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.

-

తాత్పర్యము :

శరీరంలో యీహంస సాగిన వరకే బంధువులు,

మిత్రులు నీ క్షేమ సమాచారములు అడుగగా వత్తురు. 

నీపై అతి ప్రేమ, వాత్సల్యము కురిపింతురు. అది అంతా నీ గుండెలలో ప్రాణ వాయువులు సాగు వరకే. ఒక్కసారి ఉఛ్ఛ్వాస నిశ్వాసములు ఆగి, నీవు విగత జీవుడవై నేల బడియుండ, నీ భార్య కూడా నీదరి చేరుటకు భయపడును. 

నీవారందరూ నీ శరీరమును తాకుటకు కూడా శంకింతురు. నీవు తనువు చాలించిన కొన్ని క్షణముల వరకే అందరూ శోకము ప్రదర్శింతురు, ఆపై నీ ఊసును కూడా ఎవ్వరూ ఎత్తరు.

అందమైనదని ఊహించుకునే మన ఈ శరీరము రోగముతో, రోతతో, మలిన గంధ భూయిష్ఠమగును. శరీరమున ప్రాణ వాయువులు ఆగి పోవగానే, అది పనికిమాలినదై పోవును. ఎంత త్వరగా దానిని వదిలించుకొందామా అని అందరూ భావింతురు. 

పంచ భూతములతో నిర్మితమైన ఈ దేహం, చివరకు ఈ పంచ భూతములలోనే కలిసి పోవలె. అట్టి ఈ హీన శరీరం పై మమతలు ఏల?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!