అనగనగా ఒక రాజు... ఆ రాజుకి ఏడుగురు కొడుకులు... (ఈ కధ (పరమా)అర్ధం విశ్లేషణ శ్రీ గరికిపాటి ).

అనగనగా ఒక రాజు... ఆ రాజుకి ఏడుగురు కొడుకులు...

(ఈ కధ (పరమా)అర్ధం విశ్లేషణ శ్రీ గరికిపాటి ).

కథ:

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒకచేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదు. గడ్డిమేటు అడ్డమొచ్చింది. గడ్డిమేటా... గడ్డిమేటా ఎందుకు అడ్డమొచ్చావ్... ఆవు మెయ్యలేదు. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు... గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా... గొల్లవాడా ఎందుకు మేపలేదు... అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా... అమ్మా ఎందుకు అన్నంపెట్టలేదు... పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడా... పిల్లవాడా ఎందుకు ఏడిచావు... చీమ కుట్టింది. చీమా చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టానా... అన్నది.

.

రాజుగారు అంటే మనిషి. 

ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులు. 

వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట.

ఏడు చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు 

(కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (థనమును దూబారాగా ఖర్చుచేయుట)). 

ఎండగట్టాటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది.

ఎండపెట్టము అంటే వ్యసనాల్ని జయించుట. సాథన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.

ఒకచేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలినవాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది.

కామాన్ని జయించటము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది అయిననూ అదికూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తోలగుటయే కదా మోక్షము.

చేప ఎండకపోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. 

మన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చినారు.

గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము. 

వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.

ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది.

"కృష్ణం వందే జగద్గురుం". జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.

గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, తీసుకొని వెళ్ళి ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞలేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను. ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము.

అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. 

పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు. జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత. అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము.

పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. 

చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి భాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము.

చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట. చివరకు అనురక్తి తొలగి సంసార బాథలనుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును.

కథ సారాంశము:

సప్తథాతువులతో కూడిన మనిషి సాథన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామముకు జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాథపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చును. 

కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది.🌸🌸🌸

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!