కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు.


కల్పవృక్షంలో కైక –రచన : భైరవభట్ల కామేశ్వరరావు.

.

రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది. అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.  రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది:


కైకెయి సీత గౌగిటికి గైకొని, “ఓసి యనుంగ! నీవుగా

గైకొని యీ వనీచయ నికామ నివాసభరంబిదెల్లనున్

లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే

గాక దశాననాది వధ కల్గునె యన్న ప్రశంస లోనికిన్”


“కైక రాముడిని అడవులకి పంపేసింది” అనే నిందని, “ఆహా! కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం చేసి రాముడు దిగంత కీర్తి సంపాదించాడు” అనే ప్రశంసగా మార్చేసిందట సీత. అంతే కదా! రామాయణానికి మరో పేరు “పౌలస్త్య వధ”. అంటే, రామాయణ కథకి అంతిమ గమ్యం రావణ వధ. దానికి కైక వరాలే కదా కీలకం! విశ్వనాథవారీ కీలకాన్ని గ్రహించి, కైక పాత్రని దానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్నకొడుకు భరతుడే కల్పవృక్షం చివరలో, “కైకేయీ సముపజ్ఞ మియ్యది జగత్కల్యాణ గాథా ప్రవాహాకారంబయి పొల్చు రామకథ” అని అనుకుంటాడు. అదీ రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం.  


దీనికి రాముని చిన్నతనం నుండే చక్కని ప్రాతిపదిక వేసారు విశ్వనాథ. కైక, రాముల మధ్యన ఒక అపురూపమైన అనుబంధాన్ని సృష్టించారు కల్పవృక్షంలో.


కాళ్ళువచ్చినదాదిగా గైక కొఱకు

పరువులెత్తును శ్రీరామభద్రమూర్తి

నిద్ర మేల్కొన్నదిగ రామభద్రు కొఱకు

నంగలార్చుచు జను గేకయాత్మజాత


రాముని పసితనం నుండే ఏర్పడిన అనుబంధమది. రాముడేదైనా అద్భుత కార్యాన్ని చేసినప్పుడు, అది కైకమ్మకి చూపిస్తే కాని అతనికి తృప్తి ఉండదు. అది చూసి కైకేయి ఆనందబాష్పాలతో అతనికి దిష్టి తీస్తుంది. రామునికి ఉపనయనమైనప్పుడు, కైక యిచ్చిన భిక్షేమిటో తెలుసా? ఒక చుఱకత్తి, వజ్రంతో చేసిన వాడి బాణము, అని విశ్వనాథవారి కల్పన. అది చూసి రాముడెంత మురిసిపోయాడని! అంతేనా. రాముని ధనుర్విద్యాభ్యాసంలో కైకేయి ఎంతటి శ్రద్ధ తీసుకొనేదో!


పటుబాహాపటుమూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబు సే

యుటయున్ గైకెయి వచ్చి చూచుటయు, “నోహో తండ్రి, యా బాణమి

ట్టటు నట్టి”ట్లని చిత్రదూరములు లక్ష్యంబుల్ విదారింప జె

ప్పుట చేయించుటయున్ ముదంపడుటయున్ బొల్చున్ వనీవీధికన్


విల్లు ఎలా పట్టుకోవాలో, బాణాన్ని ఎలా సంధించాలో, కైకేయి చెప్పినట్టే చేస్తాడు రాముడు. అలా కైక చెప్పినట్టు లక్ష్యాన్ని ఛేదించి రాముడు నవ్వితే, అతడిని చూసి కైక మురిసిపోతుంది. రామభద్రుడు పెరిగి పెద్దవాడై, రాక్షస సంహారం చేస్తున్నప్పుడల్లా కైకమ్మనీ, ఆమె నేర్పిన విద్యని తలచుకుంటూనే ఉంటాడు! ఖరునితో భీకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు, ఖరుడు చూపిస్తున్న ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి రాముడిలా అంటాడు, “ఓయీ! వానికిన్ వానికిన్ నీవుం గార్ముక దక్షుడౌదు, నగిషీల్నేర్తీవు చేయన్, ధర్నుర్జ్యావల్లీకృత చిత్ర కర్షణ నినీషన్ గైకయీదేవి విద్యావిష్కారము నీ వెఱుంగవు సుమీ!”. అంటే “ఎవెరెవరికో నువ్వు నీ ధనుర్విద్యని చూపించి మెప్పించ వచ్చు కాని, వింటి నారిని చిత్రవిచిత్రంగా లాగడంలో ఎంతో నేర్పు గలిగిన కైక, నాకు నేర్పిన విద్య నీకు తెలియదు సుమా! నా ముందు నీ కుప్పిగెంతులు పనికిరావు” అని అర్థం. అలాగే రావణుడు సౌరాస్త్రం ప్రయోగిస్తే, అందులోంచి వేలకొలదీ చిన్న చిన్న చక్రాలు పుట్టుకు వస్తాయి. వాటిని కైకేయి నేర్పిన విలువిద్య చేతనే వమ్ము చేస్తాడు రామచంద్రుడు. తనకు రథం తెచ్చిన మాతలితో, కైకేయి నేర్పిన గతులలో రథాన్ని తోలమని చెపుతాడు.


ఈ విధంగా, రాముణ్ణి చిన్నతనం నుండీ విలువిద్యా ప్రవీణునిగా తీర్చిదిద్దడంలో కైక పాత్ర విశేషంగా కనిపిస్తుంది కల్పవృక్షంలో. కైక రామునికి తల్లి, గురువు, ఆప్తురాలు.


రామునిపై ఇంతటి వాత్సల్యమున్న కైక మరి అతణ్ణి అడవికి ఎలా పంపింది? నిజానికి, రామునిపై కైకకున్న వాత్సల్యం వాల్మీకి రామాయణంలో కూడా, ఇంత విస్తృతంగా కాకపోయినా, కొంత మనకి కనిపిస్తుంది. రాముని పట్టాభిషేక వార్త మంథర తెచ్చినప్పుడు, కైక ఎంతగానో సంతోషిస్తుంది. అంతటి శుభవార్తని తెచ్చినందుకు ఆమెని ఎంతగానో మెచ్చుకొని, ఆమెకి మంచి హారాన్ని కూడా బహూకరిస్తుంది. తనకి భరతుడిపైన ఎంత ప్రేమో, రాముడిపైన కూడా అంతే ప్రేమ అని, రాముడు కౌశల్య కన్నా తననే ఎక్కువగా ఆదరిస్తాడని కూడా అంటుంది. ఇంతటి అభిమానం మనసులో పెట్టుకొని, ఒక్కసారిగా అలా ఎలా మారిపోయింది కైక? ఆ ప్రశ్నకి వాల్మీకి మనకి సమాధానం చెప్పడు. మంధర మాటల ప్రభావమొక్కటే చూపించి ఊరుకుంటాడు. కాని మనకది అంత నమ్మశక్యంగా కనిపించదు. అందుకే తర్వాతి కవులు రకరకాల ఊహలు చేసారు. కొందరు ఆమెని పూర్తిగా దుష్టురాలిగా మార్చి వేసారు. దైవప్రేరణచేత సరస్వతీదేవి ఆమెని ఆవేశించి అలా వరాలని కోరినట్టుగా కొందరు చిత్రించారు. విశ్వనాథ మరొక వినూత్నమయిన, ఆశ్చర్యకరమైన కల్పన చేసారు! ఒకవైపు తల్లిగా పెంచిన మమకారం, మరొకవైపు గురువుగా నేర్పిన యుద్ధవిద్యకి సార్ధక్యం. ఒకవైపు లోకనింద, మరోవైపు రాముని కోరిక. వీటి మధ్య నలిగిపోతూ, అయినా తన కర్తవ్యాన్ని ఎంతో గుండె నిబ్బరంతో నిర్వహించిన ఒక శక్తివంతమైన పాత్రగా  కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.


మరునాడు పట్టాభిషేకమనగా ముందు రోజు రాముడు యజ్ఞ దీక్షితుడవుతాడు. ఆ రాత్రి ధ్యానంలో ఉండగా అతనికి దేవతలు కనిపిస్తారు. అతణ్ణి నారాయణుడని పిలుస్తారు. నువ్వు నీ అవతారకారణం మరిచిపోయి యిలా రాజ్యాభిషిక్తుడవైతే ఎలా అని మొరపెట్టుకుంటారు. నీకు రాజ్యమేలే కోరికే ఉంటే ముందు నువ్వు వచ్చిన పని పూర్తి చేసి ఆ తర్వాత ఎన్ని వేల సంవత్సరాలైనా రాజ్యం చేసుకో అని ప్రాధేయపడతారు. దానితో రామునికి సమాధి భగ్నమవుతుంది. ఏమి చెయ్యాలో పాలుపోదు. తనకి కూడా అంతరంగంలో ఏదో మూలన యీ పట్టాభిషేకం యిష్టముండదు. దేవతలకి కూడా యిష్టం లేదని తెలుస్తుంది. కాని తండ్రి మాటని త్రోసిపుచ్చి ఎలా తానీ పట్టాభిషేకాన్ని కాదనడం? అలాంటి పరిస్థితిలో తనకి సహాయం చెయ్యగలిగే వారెవరు? మెల్లగా కైక మందిరానికి వెళతాడు రాముడు. వారి మధ్య జరిగే సన్నివేశం, వారి సంభాషణ, గొప్ప నేర్పుతో చిత్రించారు విశ్వనాథ.


అంత రాత్రి రాముడక్కడకి రావడం చూసిన కైక ఆశ్చర్యపోతుంది. కంగారు పడుతుంది. తెల్లవారితే పట్టాభిషేకం పెట్టుకొని యిలా అర్థరాత్రి ఎందుకొచ్చావని అడుగుతుంది. దీక్షా భంగం జరగకుండా వెనక్కి వెళ్ళిపొమ్మంటుంది. అప్పుడు రాముడిలా అంటాడు:


అనిన రాముడు, తల్లి! సమాధి నిలువ

దాయె నే నేమి చేయుదు నమ్మ యనుచు

ఱేపు మొదలుగ బద్ధవారీగజేంద్ర

మట్లు కదలగ వీలులే దనుకొనెదను


“అమ్మా! నన్నేం చెయ్యమంటావు, సమాధి నిలువడం లేదు! ఇక రేపటినుండీ  గొలుసుకి కట్టేయబడిన ఏనుగులాగా కదలక మెదలక ఉండాలన్న చింతే మనసంతా నిండిపోయింది” అని అర్థం. దేవతలు సమాధిలో కనిపించి తనను రాజ్యం చెయ్యవద్దన్నారనీ, తనకీ రాజ్యమ్మీద కోరిక లేదనీ, ఎటూ పాలుపోక యిలా వచ్చాననీ చెపుతాడు. అప్పుడు,


అనినన్ గైకయి, “యిప్పుడిట్లెయగు ఱేపంకస్థయౌ జానకిం

గని, సింహాసనసీమ వేఱొకగతిన్ గన్పించు బొ”మ్మన్న, రా

ముని నేత్రంబుల నొక్క తీవ్రకళయై “మున్నీవు నువ్వెత్తు నే

ర్పిన కోదండకళావిచిత్ర గమనశ్రీ యేమగుం జెప్పవే!”


“ఇప్పుడిలాగే అంటావు. రేపు నీ భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నువ్వు సింహాసనమ్మీద కూర్చున్నప్పుడు వేరే రకంగా అనిపిస్తుందిలే” అని పరిహాసంగా అంటుంది కైక. ఆ మాటలకి రాముడు ఆమెవైపు తీక్ష్ణంగా చూచి, “నువ్వు నాకు ఎంతో గొప్పగా నేర్పిన నా విలువిద్యకింక సార్థక్యమేమిటి చెప్పమ్మా” అంటాడు. అంతే కాదు, “నా వద్దనున్న వాడిబాణాలతో నా కిరీటమ్మీద బొమ్మలు చెక్కుకోనా? నన్ను రోజూ స్తోత్రం చెయ్యడానికి వచ్చే ప్రజలమీద యుద్ధవ్యూహాలు పన్ననా?” అని నిలదీస్తాడు. అప్పుడు కైక “అయితే ఏమిటంటావు? నీ విలువిద్యకీ యుద్ధనైపుణ్యానికీ సార్థక్యం ఎలా కలుగుతుంది?” అని అడుగుతుంది. రాముడు దానికి సూటిగా జవాబు చెప్పడు. దానికి సమాధానం కైకకి తెలుసుకదా! తీక్ష్ణమైన చూపులతో ఒకటే మాట అంటాడు రాముడు, “నేనిప్పుడు రాజ్యం చెయ్యడమనేది వట్టి మాట”. అంతే! కైకేయి తన భవనంలోకి విసవిసా వెళిపోతుంది.


అదీ వారిద్దరి మధ్యన జరిగే సన్నివేశం! రాముడు కైక దగ్గరకే ఎందుకు వచ్చాడు? రాముని తీక్ష్ణమైన చూపుల్లో కైకకి అర్థమైనది ఏమిటి? రాముని కోరిక కైక ఎలా తీరుస్తుంది? ఇవన్నీ పాఠకుల ఊహకి వదిలిపెట్టేసారు విశ్వనాథ.


ఆ తర్వాత రోజు, మంధర పట్టాభిషేక వార్త విని కోపంతో కైక దగ్గరకి వచ్చి దాని గురించి చెపుతుంది. కైక అప్పుడే నిద్రనుండి లేస్తూ, “ఏమిటి రాముడు పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడా! రాముడు పట్టాభిషేకం వద్దన్నట్టుగా పీడ కల వచ్చింది. ఎంత మంచి శుభవార్త చెప్పావు”, అంటూ తన ముత్యాలహారాన్ని మంధరకి బహుమతిగా ఇస్తుంది. అప్పుడు వాల్మీకంలో లాగానే, మంధర దాన్ని విసిరి కొట్టి, రాముడు రాజైతే కైక పడవలసిన కష్టాలని ఏకరువు పెడుతుంది. వాటిని కైక తేలికగా కొట్టి పారేసి, రాముడి గొప్పతనం వర్ణిస్తుంది. అతను పరాక్రమవంతుడని, యోగి అనీ, రాక్షసాంతకుడనీ వివరిస్తుంది. ఇక్కడ, రామావతార రహస్యం తెలిసిన ఒక జ్ఞానిగా కైక పాత్ర మనకి కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. ముందురోజు రాత్రి రాముని కన్నుల్లో కైక చూసిన రహస్యమిదేనా అని అనిపిస్తుంది! మంధరకి యిదేమీ పట్టదు. పైగా, యోగి అయితే అడవుల్లో తిరగాలి కాని సింహాసనమెక్కి రాజ్యం చెయ్యాలన్న కోరిక ఎందుకనీ, రాక్షసులు అయోధ్యా పురవీధుల్లో తిరగటం లేదనీ, అంటుంది. ఆ మాటలు కైక మనసులో నాటుకుంటాయి! “It all fell in place!” అన్నట్టుగా, రాముడు తన దగ్గరకి ఎందుకు వచ్చాడో, తాను చెయ్యవలసినది ఏమిటో మొత్తమంతా అవగాహనకి వస్తుంది కైకకి. అప్పుడు కైక మనస్స్థితి ఎలా ఉంటుంది? ఒకవైపు రాముడు తనమీద మోపిన బాధ్యత. మరొకవైపు తానే స్వయంగా రాముణ్ణి అడవులకి పంపించాలన్న బాధ. ఇంకొకవైపు, దీనివల్ల తన మీద పడబోయే లోకనింద. తనకే ఎందుకిలా అయిందన్న కోపం. ఈ అవస్థని చాలా నేర్పుగా, హృద్యంగా, స్పష్టాస్పష్టంగా చిత్రిస్తారు విశ్వనాథ.


ఆ తర్వాత కథ మామూలే. దశరథుని వరాలు అడగడం, దానికి దశరథుడు కైకని తిట్టిపోయడం, రాముడు అడవులకి వెళ్ళడం, దశరథుడు మరణించడం, కౌసల్య మొదలు లోకమంతా కైకని తూలనాడడం, చివరికి భరతుని చేతకూడా కఠినమైన మాటలు అనిపించుకోవడం. అయితే, యీ ప్రతి సన్నివేశంలోనూ మనకి కైక మీద అపారమైన జాలి కలగకమానదు. ఎన్ని మాటలు పడ్డా, నోరు మెదపలేని ఆమె నిస్సహాయత, ఎంత బాధని అనుభవించినా రహస్యాన్ని తన గుండెల్లోనే దాచుకున్న ఆమె స్థిరత్వం మనలని అబ్బురపరుస్తాయి. కల్పవృక్షంలో కైక పాత్రని అంత ఉదాత్తంగా తీర్చిదిద్దారు విశ్వనాథ. దీని వలన సాధించిన ప్రయోజనం ఏమిటంటే – రసావిష్కరణ. కైక పాత్రలోని సంఘర్షణ, సహృదయుని మనసుని కుదిపివెయ్యక మానదు. మరొక ప్రయోజనం – కథకి, ఆ పాత్రకి ఒక రకమైన సౌష్ఠవాన్ని చేకూర్చడం. కైక పాత్రనీలా మలచడంలో పాశ్చాత్య విషాదాంత నాటకాలలోని నాయక/ప్రతినాయక పాత్రల ప్రభావం ఉందేమో అనిపిస్తుంది! అయితే, యిక్కడ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయమొకటి ఉంది. ఈ పాత్ర చిత్రణ వాల్మీకి రామాయణంలో లేనిదే అయినా, వాల్మీకి రామాయణానికి ఏమాత్రమూ విరుద్ధం కానిది. అందుకే యిది వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం అయింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!