నవ్వించడమనేది సృజనాత్మక కళ.

తెలుగు సాహిత్యంలో హాస్యం!

నవ్వించడమనేది సృజనాత్మక కళ. సంస్కారయుతమైన పదజాలంతో ఇతరులను నొప్పింపక తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం సామాన్యమైన విషయం కాదు. హాస్యం హృదయాల్ని తేలికపరుస్తుంది కాని దాని సృష్టి మాత్రం అంత తేలికకాదు నిషి జీవితం పుట్టుక నుండి చావు వరకు దుఃఖమే. అయితే అందులోనే తనకు కావలసిన ఆనందాన్ని వెతుక్కోవడానికి, పదిమందికి పంచడానికి మనిషి సాహిత్య సృష్టి చేసాడనుకోవచ్చు. ఈ ఆనందాన్వేషణ మనిషిని మిగిలిన జీవరాసులనుండి వేరు చేస్తోంది.

ఒక మహాకవి నవ్వు గురించి ఎంత అందంగా చెప్పాడో చూడండి.

“నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్

దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు . కొన్ని విష ప్రయుక్తముల్

పువ్వుల వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే

నవ్వులు సర్వదుఃఖదమంబులు వ్యాఖులకున్ మహౌషధుల్.

. నవ్వులో చాలా రకాలున్నాయి. మన ప్రాచీనులు నవ్వు ఆరు రకాలుగా విభజించారు.

1.స్మితం

2.హసితం

3.నిహసితం

4. అవహసితం

5. అపహసితం

6. అతిహసితం

శ్రేష్ఠులకు స్మిత హసితాలు, మధ్యములకు నిహసిత, అవహసితాలు అధములకు అపహసిత, అతిహసితాలు అని కేటాయించారు. ధూషణ లక్ష్యంగా పెట్టుకోక, మర్యాద మరువక, శ్రుతి మించనీయక చేసే హాస్యమే నిజమైన హాస్యం.

నన్నెచోడుని కుమారసంభవంలో మన్మధుని ప్రగల్భాల కన్నా రతీదేవి భర్తని వారించడం పఠితను నవ్విస్తాయి. పరమేశ్వరుని తపోభంగం చేయడానికి తాను సపరివారంగా వెడుతున్నానని పల్కిన భర్తతో రతీదేవి…

“పరమశివుని విల్లు కనకసిరి, నీ విల్లు చెఱకుగడ, ఆయన బాణం పాశుపతం, నీ బాణం కేవలం పుష్పం. చిన్న పిల్లలు కూడా తిని, పిప్పి ఉమిసెడి చెఱకుగడను గొప్పవిల్లని విశ్వసించి, క్షణాలలో నశించే పూలని బాణాలుగా తగిలించుకొని, వేసవి ఎండకి బెదిరిపోయే వసంతుని గొప్ప స్నేహితుడని వెంటబెట్టుకొని, కాకి పిల్లల్ని చూసి బెదిరిపోయే కోకిలలు, ఆడవాళ్లు అదిలిస్తేనే ఆకాశంలోకి ఎగిరిపోయే చిలుకలు పెద్ద సైన్యంగా గర్వించి, పరమేశ్వరునిపై దాడికి వెళ్లడం మంచిది కాదు. ” అని హెచ్చరిస్తుంది. ఇలాంటి మాటల్లోని హస్యం సున్నితంగా మనసుని తాకి నవ్విస్తుంది.

తిక్కన రచనలో వ్యంగ్యం ఎక్కువ. నర్తనశాలలో స్త్రీ వేషంలో ఉన్న భీముడు కీచకునితో “నన్ను ముట్టి నీవు చెండి యు వనితల సంగతికి పోవు వాడవె” అని గూఢంగా అంటాడు. ఇలాంటి వాక్యాలు చిరునవ్వుకి పుట్టినిళ్లవుతాయి. ఇక ఉత్తరకుమారుని ప్రగల్భాలు, తీరా కురు సైన్యాన్ని చూసాక “ప్రాణములు తీపి యన వినవే” అనే అతని గోల బాగా నవ్విస్తాయి. అంతే కాదు.” పసులదయ్య మెరుగు, పడతుల సంతోషమేల నాకు, యనికి జాల నేను” అని రధం మీదనుండి క్రిందికి ఉరికి పరిగెత్తడం కడుపుబ్బ నవ్విస్తుంది. తిక్కన తన పాత్రలచేత నవ్వించిన నవ్వులు లెక్కలేనన్ని. తిక్కన పేర్కొన్న నవ్వుల జాబితా తయారు చేయడం గొప్ప ఆసక్తికరంగా ఉంటుంది. ఇన్ని రకాల నవ్వులుంటాయా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఏ నవ్వూ పాత్రోచిత్యాన్ని భంగం చేయదు. అదీ విశేషం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!