నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.... నమస్కారం లోనే ఉంది మస్కా అంతా !

నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.... నమస్కారం లోనే ఉంది మస్కా అంతా !

.

తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి 

రవంత కార్యలాభం కలగ లేదు భారతంలో. 

.

అదే ఆలస్యంగా వచ్చీ నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన అర్జునుడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహం లాభించింది. 

.

నిండు సభామధ్యంలో ఇలా దండకం చదివీ చదవంగానే ఆయనగారి అర్థాంగికీ అదే లాభం. కృష్ణ పరమాత్ముడి అండ దొరికింది. దండాలా మజాకా?

.

రామాయణంలో మాత్రం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అలా అంజలి ఘటించి నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకైనా దక్కని అపురూప గౌరవం ఆంజనేయుడికి దక్కింది.

.

ఉన్న ఒక్క తొండంతోనే చేతనైనంత వరకూ దాసోహ పడి ఆపదల నుంచి గట్టెక్కింది గడుసు గజేంద్రం.

.

ఆరోగ్యాన్నిచ్చి, బంధు కృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడనే గదా సూర్యుణ్ణి భగవంతుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో పొద్దునా సాయంత్రం పడీ పడీ నమస్కారాలు చేస్తున్నాం!

మరి అర్హతలతో నిమిత్తం లేకుండా అందలం ఎక్కించి పది మందిలో గుర్తింపు తెచ్చి పెట్టే ప్రణామ యోగానికి 'లోకబాంధవ' గౌరవం ఇస్తే తప్పేమిటి? 

.

నోబెలు పురస్కారాలే ఎవరెవరికో వస్తున్నాయి గదా ఇవాళా రేపూ?

ఎక్కడో ఉన్న సూర్యనారాయణుడి శక్తికే నిత్యం నమస్కారాలు సమర్పిస్తున్న మనం అర్హతలతో నిమిత్తం లేకుండా వెధవాయలని సైతం అధికార పదవులకు సదా చేరువులో ఉంచే చేతుల ఇంద్రజాలాన్ని మరెంతగా మన్నించాలి?

.

అదృష్టం. ఏ అరబ్బుల దేశంలోనో పుట్టుంటే ఖర్మ కాలి ఏ ఒసామా బిన్ లాడెన్నో కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకోవాల్సి వచ్చేది. 

.

'దేవుడానన్నీ 'నమస్తే'ల ఖండంలో పుట్టించినందుకు శతకోటి నమస్కారాలు! 

రాం రాం, నారాయణ నారాయణ,

జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- 

ఆహా.. ఎన్నేసి రకాల నమస్కారాలు మన సంస్కృతిలో!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!