రాముడూ - --- - ఉడుత.!

రాముడూ - --- - ఉడుత.!

రామాయణం లో ఉడుత ది ఒక ప్రత్యేక స్థానం. అది మనకందరికీ తెలుసు. ఆ కథ వెనుక నాకు స్ఫురించిన ఒక భావన.


రామాయణం లో ప్రధాన ఘట్టం రావణ వధ జరిగిపోయింది. తన ధర్మ సంస్థాపనా మార్గం లో సాయం చేసిన వారందరినీ ఏం కావాలో కోరుకొమ్మన్నాడుట రాముడు. జాంబవంతుడు నీతో యుధ్దం చెయ్యాలని ఉంది అన్నాడుట. అలా ఒక్కొక్కరే వచ్చి ఏవేవో కోరుకున్నారుట.


ఆ వరుసలో ఆఖర్న ఉన్నవారిని చూసి రాముడి కళ్ళు మెరిసాయిట. తనే లేచివచ్చి పలకరించాట్ట. "పూర్వ భాషీ.." కదా... ఆ ఆప్యాయతకు అక్కడున్నవారందరూ చాలా పులకరించారుట. ఇంతకీ అక్కడున్నది మరెవరో కాదు. మన ఉడుత. నీకేం కావాలి అని అడిగాడుట.


"నను పాలింపగ నడచీ వచ్చితివా... స్వామీ !! ఏమని కోరుకుందును?


మనకి అత్యంత ఇష్టమైన వారి సాన్నిధ్యం లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఏం తింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్న స్ఫురణ ఉండదు. అన్నీ కరిగి పోయిన స్థితి లో ఉంటామట కదా, అదీ తెలియదు నాకు కానీ ఏదో అనుభూతి మాత్రం మిగిలి ఉంది. ఇంతకపూర్వం మనం కలుసుకున్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. అందరూ మాత్రం నేను చేసిన సహాయం చిన్నదే అయినా నువ్వు ఆప్యాయంగా నా వీపు నిమిరావనీ అప్పుడు గుర్తుగా వీపుపై మూడు గీతలు పడ్డాయనీ అంటున్నారు.


నాకు మాత్రం అది నిజం కాదేమో అని అనిపిస్తోంది. నీకు అత్యంత ప్రీతి పాత్రమైన పని చేసినప్పుడు నువ్వు ఆనందాన్ని వ్యక్త పరచే విధానం ఒకటుంటుంది. "సోదర భరత సమానా" అని హృదయానికి హత్తుకుంటావు. నేను చేసినది సహాయం చిన్నదే అయినా నీకు ఆనందం కలిగించే ఉంటుంది. వీలైనంత సహాయం చేద్దాం అనుకున్న ఆ స్ఫూర్తి కి మెచ్చి నన్ను నీ ఎడమ చేతిలో తీసుకుని కుడి చేతితో హృదయానికి హత్తుకుని ఉంటావు అప్పుడే జన్మించిన శిశువుని హృదయానికి హత్తుకున్నట్టు. అప్పుడు కలిగినవే అయి ఉంటాయి ఈ గుర్తులు. నేను ఆ ఆనందానుభూతి లో ఉన్నాను కనుకనే అప్పటి సంగతులేవీ గుర్తు లేవు. దయచేసి మరొక్కమారు గాఢ ఆలింగనానుభూతి అనుగ్రహించవా?

పరిష్వంగానుభూతి లో ఇంకొక్కసారి ఓలలాడించవా" అని అడిగిందిట ఉడుత.


ఉ!! "శ్రీరఘు రాముడే ఉడుత సేవను మెచ్చి స్పృశింప, వీపు పై


చారలు గుర్తుగా మిగిలె! జన్మతరించె !"నటంద్రు పెద్దలున్


ఆరయ నాకు తోచె అర చేతుల లోగొని కౌగలించుటె


కారణమంచు, నీవు పసి కూనను గుండెకు హత్తుకోవటే !!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!