రుక్మిణీ కళ్యాణం.! (పోతనామాత్యుడు.,,,,రుక్మిణి డోలాయమాన మనసు.)

రుక్మిణీ కళ్యాణం.!

(పోతనామాత్యుడు.,,,,రుక్మిణి డోలాయమాన మనసు.)

.

భీష్మకుడు పద్దతి ప్రకారం పితృదేవతలని పూజించి, విప్రులకి భోజనాలు పెట్టించాడు. పుణ్యాహవచనాలు చదివించాడు.

రుక్మిణికి స్నానం చేయించి, కొత్తబట్టలు, రత్నాభరణలుతో అలంకరించాడు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేసారు. 

పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేసాడు. 

శుభం కోసం భీష్మకుడు విప్రులకు తిలా, గో, రజత, స్వర్ణ, వస్త్రాది ధానాలు చేసాడు. అప్పుడు. 

.

"భటసంఘంబులతో రథావళులతో భద్రేభయూధంబుతోఁ

బటువేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితోఁ

గటుసంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్ విశం

కటవృత్తిం జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ గర్వించి య వ్వీటికిన్

.

(విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్ళాడతానంటు శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులుతో, రథాల వరుసలుతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుర్రాల సైన్యంతో, బందువులతో, చెలికాళ్ళతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు.)

.

"బంధులఁ గూడి కృష్ణబలభద్రులు వచ్చినఁ బాఱదోలి ని

ర్మంథర వృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద" మంచు నుల్లస

త్సింధుర వీర రథ్య రథ సేనలతోఁ జనుదెంచి రా జరా

సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్.

.

(జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా “బలరామ కృష్ణులు బంధువు లందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశిపాలుడికి బాలికను తెచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్ట బెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.)

.

ఇంకా వివిధదేశాలనుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి.

.

"హరి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్యహితానుసారులై

నరపతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం

గరమగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి" నంచు వేగఁ దా

నరిగె హలాయుధుండు గమలాక్షుని జాడ ననేక సేనతోన్.!

.

(బలరాముడు “అయ్యో! కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్ళారు; బాలికను తెచ్చేటప్పుడు యుద్దం తప్పదు; కృష్ణుడికి సాయం అవసరం” అంటూ బలరాముడు 

కృష్ణుని వెనుక సైన్యం తీసుకొని వెళ్ళాడు.)

.

"ఆలోపల నేకతమున

నాలోలవిశాలనయన యగు రుక్మిణి ద

న్నా లోకలోచనుఁడు హరి

యాలోకము చేసి కదియఁ డని శంకితయై.!

.

(ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలోతాను తన ఏకాంతమందిరంలో “సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేరరాడేమో” నని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది . . .)

.

"లగ్నం బెల్లి; వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు

ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం

డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో? 

భగ్నంబై చనునో? విరించికృత మెబ్బంగిన్ బ్రవర్తించునో?

.

(“నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహుర్తం దగ్గర కొచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? – )

(అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.)

.

ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో? 

విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం

డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్

నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?"

.

(ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?”)

.

అంటు ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది. 

.

ఆ స్థాయికి తగ్గ ఈ పద్యం చెప్పిన మన పోతన్నకి ప్రణామములు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!