సంగీత సామ్రాట్టు స్వాతి తిరునాళ్.! . - రచన : తనికెళ్ళ భరణి.

సంగీత సామ్రాట్టు స్వాతి తిరునాళ్.!

.

- రచన : తనికెళ్ళ భరణి.

ఆధ్యాత్మిక రంగంలో ఆదిశంకరాచార్యులు...

హైందవ జాతి పునరుద్ధరణంలో వివేకానందుడు...

ఎలాగ కృషి చేసి ప్రాత:స్మరణీయులై అతి చిన్నవయస్సులోనే పరమేశ్వరుడిలో లీనమైపోయారో!...

అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావన్కూర్ మహారాజు "స్వాతి తిరుణాళ్" కూడా సంగీతంలో విశేషమైన కృషి చేసి ముప్పై మూడవ ఏటనే పరమపదం చేరాడు.

అల్లకల్లోకంగా ఉన్న రాజకీయ, సాంఘిక పరిస్థితులు...

వారసులెవరూ లేకపోతే రాజ్యాన్ని కాజేద్దామని కోట బురుజుల మీద గిరికీలు కొడ్తున్న "తెల్లదొరతనపు గద్దలు"...

ఐకమత్యం లేక పరస్పరం కలహించుకుని ముక్కలు చెక్కలైపోతున్న సిగ్గులేని భరతజాతీ!...

ఇలాంటి పరిస్థితుల్లో 1813 వ సంవత్సరంలో లక్ష్మీబాయి, రాజరాజ వర్మలకు ’స్వాతి’ నక్షత్రంలో పుట్టాడు..."స్వాతి తిరుణాళ్"!!

పదహారో ఏటనే రాజ్యానికి వచ్చాడు గానీ.... కుట్రలూ కుతంత్రాల రాజకీయ చదరంగం ఏమీ నచ్చలేదు. ఎందుకో అతని మనసు సంగీతం వైపు మొగ్గింది. అలాంటి రాజకీయ కల్మషంలో గూడ... స్వచ్చమైన పద్మంలాగ సంగీత పరిమాళాలు గుబాళించాడు!!

ఆయనో బాలమేధావి....అక్షరాలా పదహారు భాషల్ని ఆపోసన పట్టేసిన అపర సుబ్రహ్మణ్యేశ్వరుడు. భాషలు నేర్చుకోవడమే కాదు ఆయా భాషల్లో కీర్తనలు రాసిన దిట్ట!....కృష్ణదేవరాయల్లాగ, భోజ మహారాజు లాగ వివిధ కళారంగాల్లో నిష్టాతులైన వారిని ఆహ్వానించి ఉచితమైన పదవులిచ్చి గౌరవించిన సరసుడు.

ఆయన ఆస్థానంలో...

షట్కాల గోవింద మరార్

పాలఘూట పరమేశ్వర భాగవతార్

విద్వాన్ కోయిల్ తుంపురాన్

కన్నయ్య భాగవతార్

కోకిలకంఠ మేరుస్వామి

వడివేలు సోదరులు

ఇరవి వామన తంబి

క్షీరాబ్ది శాస్త్రి

సుబ్బు కుట్టి అయ్య.... వంటి సంగీత - సాహిత్య సామ్రాట్టులుండేవారు!....

అలాగే ఆయన ఇంగీఘ్ల నేర్చుకోవడానికి తంజావూరు సుబ్బారావునీ, సంస్కృతం అధ్యయనానికి కోచుపిళ్ళ వారియర్ నీ, ఫ్రెంచి భాష కోసం రాజ రాజ వర్మనీ నియమించుకున్నారు.

అలాగే తన సంగీత గురువులు:

కరమన సుబ్రహ్మణ్య భాగవతార్

కన్నయ్య భాగవతార్

మేరుస్వామి

అనంత పద్మనాభ గోస్వామి

తంజావూరు సోదరుల దగ్గర శిష్యరికం చేసాడు!

అలాగే రంగ అయ్యంగార్, సులేమాన్ అనే గురువుల దగ్గర హిందుస్థానీ సంగీతం కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.

సంగీత త్రయానికి సమకాలీనుడైన "స్వాతి తిరుణాళ్"కి త్యాగరాజస్వామి అంటే అపారమైన గౌరవం. అంచేత తను రాసిన కొన్ని కీర్తనలను పరిశీలనార్థం త్యాగరాజ స్వామి వారికి పంపడం.... ఆయన వాటిని చదివి....అద్భుతంగా ఉన్నాయంటూ మెచ్చుకుని ఉత్తరాలు రాయడం.....(

ఆ ఉత్తరాలు త్రివేండ్రం పురాతన సంగ్రహాలయంలో భద్రంగా ఉన్నాయని భోగట్టా....)

ఎలాగైన త్యాగరాజస్వామిని తన ఆస్థానానికి పిలిపించుకుని తరించాలనే కోరికతో స్వాతి తిరుణాళ్ గోవిందమరార్ అనే సమ్గీత విద్వాంసుణ్ణి పంపితే...

త్యాగరాజ స్వామి ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరుస్కరిస్తూ....

మళ్ళీ "ఎందరో మహానుభావులు" అన్న కీర్తన పాడి వినిపించాడు.... 

పరవశించిపొయిన గోవింద మరార్ త్యాగరాజ స్వామి వారి పాదాలకి దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోవడం....అదో కథ...

అనంత పద్మానాభస్వామి పరమ భక్తుడు అయిన స్వాతి తిరుణాళ్ తన చాలా కృతులకి "పద్మనాభ" ముద్రనే వాడాడు.

ఒక సందర్బంలో తన ఆస్థాన విద్వాంసుడైన వడివేలుని దంతపు వీణతోనూ, కనకాభిషేకంతోనూ సన్మానిస్తే....ఆ విద్వాంసుడు ముగ్ధడైపోయి "స్వాతి తిరుణాళ్" మహరాజు మీద ఆశువుగా కీర్తన రచిస్తే...."స్వామీ మీ విద్యంతా మధ్యలో రాలిపోయే తారలాంటి మామీద వృథా చేస్తున్నారా!.. ఆ కీర్తనేదో అది మధ్యాంత రహితుడూ, శాశ్వతుడూ అయిన అనంత పద్మనాభ స్వామిని కీర్తిస్తూ ఓ కీర్తన రాసాడట....

స్వాతి తిరుణాళ్...రచనలు:

శంకరభరణ రాగంలో - చలమేల

కాఫీ రాగంలో - సుమసాయక

యుదుకుల కాంభోజిలో- స్వామి నిన్ను అనే వర్ణాలూ....అలాగే కొన్ని జావళీలు...

సైంధవి రాగంలో - ఇటు సాహసములు

యదుకుల కాంభోజిలో - భుజగ శయనే

సురటిలో - జలజబంధు

నీలాంబరిలో - నీలకంఠ

ఉసేనిలో - కనకమయా

రాగమాలికలో - పన్నగేంద్రశయనే

శంకరాభరణంలో - నిఖిల భువన....

అలాగే అత్యంత ప్రాచుర్యం పొందిన కీర్తన "సావేరి" రాగంలోని "భావయామి రఘరామం...."దీన్ని ప్రముఖ సంగీత విద్వాంసులు "సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్" కొంత స్వేచ్చతో రాగమాలికలో వరుసకట్టారు.

అలాగే కుంతల వరాళి రాగంలోని "భోగీంద్ర శాయనం" కూడా అత్యంత విశిష్టమైనది!

ఎంత సంగీతంలో పడి ఆ రసగంగలో ఓలలాడుతున్నా.....రాజ్య పాలనకి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్ని మొట్టమొదట చేపట్టిన వ్యక్తి "స్వాతి తిరుణాళ్".

కేరళలో - మొట్టమొదటి - ప్రజా గ్రంథాలయ స్థాపన

మొదటి - మున్సిఫ్ కోర్టు స్థాపన

మొదటి - ఇంగ్లీఘ హైస్కూలు స్థాపన

మొదటి - నక్షత్రశాల స్థాపన...

తొలిసారిగా ఇంజక్షన్లు ఇప్పించిన ఘనత కూడా స్వాతి తిరుణాళ్ దే!....

మొత్తానికి స్వాతి తిరుణాళ్ సంస్కృతంలొ 198, మలయాళంలో 63, హిందీలో 37, తెలుగులో 8, మిగతా భాషల్లో 6 కీర్తనలు రాసాడు.

ఇలా అన్ని భాషల్లోనూ అనంత పద్మనాభుణ్ణి తనవితీరా అర్చించుకున్న "స్వాతి తిరుణాళ్" డిసెంబరు 25 వ తేదీ, 1846 లో పద్మనాభుడి పద పద్మాల్లో ఐక్యమైపోయాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!