కలువ కన్నుల కన్నయ్య!

కలువ కన్నుల కన్నయ్య!

.

"లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ?

గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా

వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే;

కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్."

.

ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే! 

తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు!

అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే 

ఈ బ్రహ్మదేవుడు!

.

ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు;

చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం! 

అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా! 

ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా!

.

(పోతనామాత్యుడు.)...

తెల్లవారటం అంటే బ్రహ్మానందం పొందే సమాధి స్థితికి విఘ్నం

కలిగి మెళకువ వచ్చేయటం అనుకుంటే, 

‘ఇంద్రియాణాం మనశ్చాస్మి’ అని గీత కనుక

రవి అంటే మనస్సు అనుకుంటే, 

పూర్వాద్రిలో పూర్వ అంటే సమాధి నిండుగా పూర్తికాక ముందే అని, 

అద్రి అంటే ఈ దేహం అనుకుంటే, 

మనస్సు తోచటం అంటే తెల్లవారటం అనుకోవచ్చు.

అహము అంటే సంసార సంపాదనకై సంచారం 

చేసే పగలు అనుకుంటే 

నిశి అంటే నిర్వికల్ప స్థితిలో ఉండే సమయం 

రాత్రి అనుకుంటే. పగళ్ళు వద్దు రాత్రే కావాలి అనటం.

‘బుద్ధిః తాం మంథాతీతీ మన్మథః ’ అని వ్యుత్పత్తి. 

ఆ మన్మథుడు మనసుని బ్రహ్మజ్ఞానం తెలుకోమని మథించేస్తున్నాడుట, 

పోని సంసార లంపటంలో పడుతున్నాడు పడనీ అని 

జాలిపడకుండా. చిలకలు అంటే సమాధి కుదరకుండా చెదరగొట్టే బాహ్యాభ్యంతరంలో 'తియ్యగా అనిపించే శబ్దప్రపంచం' అనుకుంటే. దానిని ఆపే నాథుడు లేడని విసుగు కలుగుతోంది అనుకోవచ్చు.

.

మాపటివేళ అంటే మళ్ళీ బ్రహ్మజ్ఞానం స్పురించే సమాధిలో ఉండే సమయం. కంజాక్షుడు బ్రహ్మజ్ఞానమే చూపుగా కల ఆ పరబ్రహ్మతో కూడుట ఎప్పటికి లభిస్తుంది అని ఆత్రుతగా ఉంది అనుకోవచ్చు. అందుకని తనను లాలించే తన స్నేహితురాలు తల్లి గురువుకి చెప్పుకుంటోంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!