శ్రీకృష్ణుడు "దైవం మానుష రూపేణా"

శ్రీకృష్ణుడు "దైవం మానుష రూపేణా"  

శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. 

నరనారాయణులలో నారాయణుడు. 

లీలామానుష విగ్రహ స్వరూపుడు. కారణజన్ముడు. 


రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శనచక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందబడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ  బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ  ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు.
ఈయన అవతార పురుషుడు.
"దైవం మానుష రూపేణా" అన్నట్లు దేవుడే మనుష్యరూపం ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణల కొరకు భూమిపై అవతరించినట్లుగా మహాభారతంలో ఎల్ల చోట్లా కనబడుతున్నది. 

ద్వాపరయుగమున మద్యపాన, స్త్రీలౌల్య, ద్యూతక్రీడాది వ్యసనములు సమాజమున స్వైరవిహారము చేసినవి. మద్రదేశ దురాచారముల గురించి కర్ణుడు శల్యునితో అన్నమాటలు: మద్రదేశంవారు చాలా దుష్టాత్ములు, దుర్మార్గవర్తనులు. మిత్రులకు కూడా కీడు తలపెట్టేవారు. మీ జాతిలో ఆడ, మగ, వావివరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు ముందే మద్యాన్ని సేవిస్తారు.


అట్లే యాదవజాతి గూడ మితిమీరిన భోగాసక్తితో, అహంకారంతో ప్రవర్తిల్లినది. అక్కడి ప్రజలలోనే గాక ప్రభువులలో గూడ ఆనాడు స్వార్థభోగములు పెచ్చు పెరిగినవి. అహంకారాది స్వాతిశయములు మిన్ను ముట్టినవి. అంతేగాక బలవంతునిదే రాజ్యమన్న పాశవిక సిద్దాంతానుసారము జరాసంధాదులు రాజ్యపాలనకావించి, పాశవికంగా చెరబట్టిన రాజుల తలలు త్రెంచి భైరవపూజ కావించేవారు. నరకాసుర, బాణాసుర, శిశుపాల, సాల్వ, హంస-డింభకాదులు అట్టి రాక్షస ప్రవృత్తి గలవారే. సాధుజనులు, బలహీనులు సుఖశాంతులతో జీవించుట కష్టమైనది.


ఇట్టి స్థితిలో సమాజమున సంక్షోభము తొలగించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరిపించి వేదధర్మసంస్థాపనకై ఒక మహోద్యమమును సాంఘికముగ చేపట్టిన మహాత్ముడు శ్రీకృష్ణుడు.

"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే" - అను గీతాశ్లోకమును శ్రీకృష్ణుని జన్మప్రయోజనమును, ఆ మహనీయుడు చేపట్టిన ఉద్యమపరమార్థమును లోకమునకు తెలియచెప్పినది.

శ్రీకృష్ణుడు మానవాతీత మహితశక్తులతో జన్మించినను, జన్మసిద్ధములైన ఆ శక్తులకు తోడు గంధమాదనమున 10 వేల ఏండ్లు దుంపలు, పండ్లు మాత్రమే ఆహారంగా, పుష్కరంలో 11 వేల ఏండ్లు నీళ్లు మాత్రమే ఆహారంగా, ప్రభాస తీర్థంలో 1000 సంవత్సరాలు ఒంటికాలిపై నిలిచి, గాలి మాత్రమే పీల్చి, బదరీవనంలో పెక్కేండ్లు కఠోరతపస్సు చేశాడు. అపారశక్తిసంపద నార్జించాడు. అధికనిష్ఠతో బ్రహ్మచర్యవ్రతము పూని రుక్మిణీసహితముగా హిమాద్రిపై తపస్సు చేసి చక్రాయుధము పొందినాడు. ఇన్ని శక్తులు తనలో నింపుకుని, ఆత్మసాక్షాత్కారము పొంది యోగేశ్వరేశ్వరుడయ్యాడు. తాను సంపాదించిన అలౌకిక శక్తులను సమాజముఖము గావించినాడు. ధర్మసంస్థాపనరూపమైన ఒక మహోద్యమమును ప్రారంభించినాడు. మానవాతీతుడుగ దర్శనమిచ్చినాడు. 

ఈయనకు నరుని సహకారం లభించింది. 

కారణజన్ముడైన అర్జునుడే నరుడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!