ప్రవరాఖ్యుడి దినచర్య ...అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము".

అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము".

ప్రవరాఖ్యుడి దినచర్య ఎలావుండేదంటే -

.

వరణాతరంగిణీదర వికస్వరనూత్న

కమలకషాయగంధము వహించి

ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ

వామనస్తుతిపరత్వమున లేచి

సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట

నఘమర్షణస్నాన మాచరించి

సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి

సైకతస్థలి గర్మసాక్షి కెఱగి

.

ఫల సమిత్కుశ కుసుమాది బహు పదార్థ

తతియు నుదికిన మడుగు దొవతులు గొంచు

బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు

వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ

.

ప్రత్యూషం అంటే ప్రాతఃకాలం తూర్పుదిక్కున అరుణారుణరేఖలు రాకముందు తెలతెలవారుతున్న సమయం. ఆ ప్రశాంతవేళ చల్లని పిల్లతెమ్మెరలు (పవన + అంకురములు) మెల్లమెల్లగా వీస్తూ ఉంటాయి. అరుణాస్పదంలో పక్కనే వరణానది ప్రవహిస్తొంది. కనక ఆ తరంగిణి ఒడ్డున అప్పుడే వికసిస్తూ, ఇంకా సగం విచ్చుకునీ (దర వికస్వర) సగం విచ్చుకుంటూ ఉన్న క్రొందమ్ములు (నూత్న కమలములు). వాటి కషాయ గంధం - రవ్వంత వగరు అనిపించే సుగంధాన్ని ప్రత్యూష పవనాంకురాలు వహించి వీతెంచుతున్నాయి. అవి అలా పైకొనే వేళ ప్రవరుడు నిద్ర లేస్తాడు. విష్ణుదేవుడి స్తోత్రాలు పఠిస్తూ (వామనస్తుతి పరత్వమున) నిద్రలేస్తాడు.

.

శిష్యులతో సహా (సచ్చాత్రుడగుచు) రోజూ వెళ్ళి ఆ నదిలో (అయ్యేటన్ - ఆ యేరునందున్) అఘమర్షణ స్నానం చేస్తాడు. అఘమును - పాపాన్ని - తొలగించేది. పాప పంకిలాలను తొలగించే మంత్రాలు చదువుకుంటూ చేసే స్నానం అఘమర్షణ స్నానం, దాన్ని ఆచరించి సంధ్యాసమయంలో సూర్యుడికి చెయ్యవలసిన అర్ఘ్య తర్పణ ప్రదానాలు నిర్వహించి (సాంధ్య కృత్యమున్ తీర్చి) గాయిత్రీ మంత్రాన్ని (సావిత్రిన్ - సవితృ) జపించి, ఇసుకతిన్నెమీద నిలబడి, కర్మసాక్షి సూర్యభగవానుడికి నమస్కరించి (ఎఱగి) ఆ తరువాత తన శిష్యులతో కలిసి (బ్రహ్మచారులు వెంటరాన్) ఇంటికి వచ్చేవాడు. సమీపంలో దొరికిన ఫలాలు సమిధలు దర్భలు (కుశ) పువ్వులు (కుసుమాలు) ఇటువంటి పూజాద్రవ్యాలను సేకరించి కొందరు శిష్యులు తెస్తున్నారు. మరి కొందరు ఉతికిన మడుగు దోవతులు పట్టుకొని గురువుగారి వెంట నడుస్తున్నారు. ఇలా శిష్యపరివారం వెంటరాగా, ఆ బ్రాహ్మణుడు నడుచుకుంటూ ఇంటికి చేరుకొనేవాడు

..

.

ప్రవరుడు ఇంత నిష్టగా ఉండటం, శిష్యులకి విద్యాబోధన చెయ్యడం, క్రమశిక్షణ - ఇవన్నీ గమనించి ప్రజలు సంతోషించి ప్రవరుణ్ణి మెచ్చుకుంటూ చూసే వారట. వారి చూపులో ఆ మెప్పుదల కనిపించేది. అంటే పట్టణ పౌరులు అతడిపట్ల గౌరవంగానూ బాధ్యతాయుతంగానూ మెలిగేవారని. "ప్రజ తన్ను మెచ్చి చూడ" అని ముగించడంలో వ్యక్తి బాధ్యత - సంఘ బాధ్యతలు వాటి పరస్పర సంబంధం - అన్నీ స్ఫురణ ఉంది.

.

ఇది ఏ ఒకరోజో, అడపా తడపానో జరిగే ప్రక్రియ కాదు. నిత్యం (నిచ్చలు) క్రమం తప్పకుండా జరిగే దినచర్య.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!