ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ..పరిచయం రాసిన వారు:--- శ్రీ జంపాల చౌదరి గారు.

ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

పరిచయం రాసిన వారు:--- శ్రీ జంపాల చౌదరి గారు.

.

( ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతులు వచ్చాయి.)

కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ఈ కథ ప్రారంభమౌతుంది.
యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది.
 చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది.
.
ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. కర్ణుడు తన భర్తలకి అన్న అనే విషయం ద్రౌపదిని విస్మయపరిచింది. ఈ విషయం ముందే తెలిసిఉంటే తనకూ కర్ణుడికీ మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండేవన్న సందేహం ఆమెకు కల్గింది. ఆమె అంతకు ముందు కర్ణుని రెండుసార్లే చూసింది. ఆ రెండు సందర్భాలలోనూ ఆమెకు కర్ణుడిపట్లా తిరస్కారభావమో, అసహ్యమో కల్గాయి. తాను కర్ణుని రెండు సార్లే కలసినా తనజీవితమంతా కర్ణుని చుట్టే తిరిగినట్లుందని ఆమెకు తోచింది. ఆమె కర్ణుని మొదటిసారి చూసింది తన స్వయంవర సమయంలో. సూతపుత్రుడన్న కారణంతో కర్ణుని మత్స్యయంత్రం చేదించటానికి ప్రయత్నం చేయకుండా ఆమే ఆపించింది. ఆ తరువాత ఆమె కర్ణుని చూసింది కౌరవసభలో. ఆరోజున తనను అవమానించటంలో కర్ణుడు ప్రముఖ పాత్రే వహించాడు. కర్ణుని హీనునిగా తలపోస్తున్న ద్రౌపదికి, కుంతి, కృష్ణుడు చివరిరోజుల్లో పశ్చాతప్త హృదయుడైన కర్ణుడి ఉదాత్తప్రవర్తన గురించి ఆమెకు తెలిపారు. మరణించిన కర్ణుడు అదృష్టవంతుడు. అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది. అతనికి అద్భుత, విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది. తమకూ, కర్ణుడికీ ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కల్గింది. అతన్ని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవలసి వచ్చింది.
.
పట్టమహిషైన ద్రౌపదికి తన జీవనపథమ్మీద, తన వివాహంపైన ఉన్న ధర్మశంకలను, కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు), కృష్ణుడు తీర్చారు. పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆమె పాతివ్రత్యానికి మెచ్చిన మౌద్గల్యుడు ఆమెతో ఏకకాలంలో ఐదురూపాల్లో (త్రిమూర్తులు, ఇంద్రుడు, మన్మథుడు) రమించాడు. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. ఆమెను పార్థునికివ్వాలన్న తలపుతో ఉన్న ద్రుపదుడు, పాండవులు మరణించారన్న మాట విని, ఆమెకు స్వయంవరం ప్రకటించాడు.
.
ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి.
 ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు.
పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.
.
అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది.
.

ఈ పుస్తకంలో నాకు నచ్చిన అంశాలు.
తెలిసిన కథను మనకు మళ్ళీ చెప్పటానికి రచయిత ఎంచుకొన్న క్రమం – మనకు పరిచయమైన క్రమంలో నడవదు ఈ కథ. ఉపపాండవుల మరణశోకంతో ద్రౌపది దుఃఖిస్తుండటంతో ఈ కథను మొదలుబెట్టడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కల్గించింది.
తన ఐదుగురు భర్తల గురించి ద్రౌపది విశ్లేషణ – పాండవు లైదుగురి వ్యక్తిత్వాలను ద్రౌపదితో ప్రథమ సమాగమపు సమయంలో వారి ప్రవర్తనలద్వారా ఆవిష్కరిస్తాడు రచయిత. వారి మనస్తత్వాలను ఆకళింపు చేసుకొని వారి మనోభావాలను దెబ్బ తీయకుండా ద్రౌపది ప్రవర్తించే విధానాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించారు.
కుంతికీ ద్రౌపదికీ ఉన్న సాన్నిహిత్యం – ఈ నవలలో ద్రౌపదికి ముఖ్యస్నేహితురాలు ఆమె అత్తగారే. ద్రౌపది వలే కుంతికూడా విలక్షణమైన పురుష సంబంధాలు కల్గినదే. ద్రౌపది మానసిక సంఘర్షణలను, సందిగ్ధాలనూ అర్థం చేసుకొని ద్రౌపదికి మానసిక సాంత్వనను కలిగించటానికి కుంతి ప్రయత్నిస్తుంటుంది.
ఈ నవలలో చాలా విలక్షణమైనది కృష్ణకూ, కృష్ణునికీ ఉన్న సంబంధం. ఇద్దరికీ ఒకరిపట్ల ఒకరిపై విపరీతమైన మమకారం. మానసికంగా వారిద్దరూ అతిసన్నిహితులు.
ఈ కథ చెప్పటంలో లక్ష్మీప్రసాద్‌గారి శైలి ప్రత్యేకించి మెచ్చుకోదగింది. చదువరిలో ఉత్కంఠను రేకెత్తించి పుస్తకాన్ని కడవరకూ చదివింపచేస్తుంది. ఆయన వాక్యాలూ, సన్నివేశాలూ ఉద్విగ్నంగా వడివడిగా పరిగెడతాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!