అయ్యకోనేరు ఇంకేం మాట్లాడుతుంది??

అయ్యకోనేరు ఇంకేం మాట్లాడుతుంది??


.

ఓసారి ఇంటికి వెళ్ళొస్తె బావుడ్ను" అంటూ గడిచిన నలభై సంవత్సరాలలో వందసార్లు అనుకుని ఉంటాను. అలా అనుకుంటునే నలభై సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇంటికి వెళ్ళడం అంటే, ఇన్నాళ్ళు నేను ఇంటిపట్టు ఉండక, దేశం మీద తిరుగుతున్నానని కాదు. దానికో చరిత్ర ఉంది. నా చదువు అవగానే బొంబయిలో ఉద్యోగం వచ్చింది. అక్కడో రెండు సంవత్సరాలు పని చేసిన తర్వాత అక్కడ్నుంచే ఎకాఎకీ అమెరికా వెళ్లిపోయాను.

.

"ఒరే చిన్నా. మనకి బాగా తెలసినవాళ్ళ అమ్మాయే. హైదరాబాదులో మీ పెద్దన్న రత్నం వాళ్ళింటి పక్కనే ఉంటారుట. అమ్మాయి తండ్రీ, అన్నయ్యా వాళ్ల ఆఫీసులోనే పనిచేస్తారుట. మంచివాళ్లట. అమ్మాయి బాగానే చదువుకుందిట. ఇంగ్లీసు ఇంచక్కా మాట్లాడుతుందిట. రేపొద్దున్న నీకు అక్కడేం ఇబ్బంది పడక్కర్లేదు. ఇదిగో ఓ ఫోటో కూడా పంపుతున్నాను. అసలు నువ్వు ఆ దేశం వెళ్ళేలోపుగానే మూడుముళ్ళు వెయించెద్దామనుకున్నాం. నువ్వు పడనివ్వలేదు." అంటూ మా అమ్మ నేను అమెరికా వెళ్లిన కొత్తలో నాకో ఉత్తరం రాసింది. 

అమ్మ ఉద్దేశం ఏమిటో నాకర్ధమయింది. ఫోటోలో అమ్మాయి బానేఉంది. సరే! అసలు అప్పడే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం అలోచించెలోగా మరో ఉత్తరం వచ్చింది.

.

"వచ్చె నెల పదహరో తారిఖు రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాలకి ముహుర్తం నిశ్చయం చేసాం. హైదరాబాద్ లోనే పెళ్లి. నువ్వో రెండురోజుల ముందు అక్కడికే వస్తే, పెళ్ళి చేసుకుని, వెంటనే వెళ్ళిపోవచ్చులే. ఎందుకంటే మీ నాయనమ్మకీ అటో ఇటోలా ఉంది. జరగకూడనది ఏదైనా జరిగిందంటే మళ్ళీ ఎడాది వరకు చేయకూడదు. అన్నట్టు నీకు కావలసిన బట్టలు ఓ నాలుగు జతలు అక్కడే కొనుక్కొని తీసుకుని రా . మళ్ళీ మేం ఇక్కడ కొంటే నీకు నచ్చవు. " అన్నదే ఆ ఉత్తరంలో సారంశం.

.

అమ్మ మాటకి జవాబు చెప్పే అలవాటు మా ఇంటావంటా లేదు. అమ్మ మాట ప్రకారం పెళ్ళి చేసుకుని ఓ రెండ్రోజులు విజయనగరం వెళ్ళి, మా వీధీ, ఊరచూపెట్టిు మా అవిడకి తిరిగి అమెరికా వెళ్ళిపోయాను. అప్పటికే మా అన్నయ్యలు, అక్కయ్యలకి పెళ్లిళ్ళు అయిపోయి వేరె ఊర్లల్లో ఉండేవారు. మా నాయనమ్మ కాలం చేసిన తర్వాత విజయనగరంలో ఉన్న ఇంటిని అద్దెకిచ్చి, అమ్మ, నాన్నా కూడా హైదరాబాదులో పెద్దన్నయ్య దగ్గరకి వెళ్ళిపోయారు. దరిమిల రెండేళ్ళకోసారి ఇండియా వచ్చినా సరే, అందరిళ్ళలో ఓ పూట ఉండేసరికే శెలవులు అయిపోయి, తిరుగు ప్రయాణ తేదీ వచ్చిసేది. మనస్సులో కోరిక ఉన్నా, విజయనగరం వెళ్ళే అవకాశం మాత్రం రాలేదు. నా వయసు ఆరు పదుల్లోకి అడుగు పెట్టడంతో ఊరు వెళ్ళాలనే కొరిక మరింత బలపడింది.

.

"చేసింది, సంపాదించింది చాలు. మన ఊరు వెళ్ళిపోదాం. మా ఉయ్యాల్లో కూర్చుని శేషజీవితాన్ని హయిగా గడపొచ్చును" అని నేనెప్పుడైనా అంటే , ఇంట్లో నాకు బొత్తిగా సపోర్టు వచ్చేదికాదు.

.

"ఆ ఊర్లోనూ, ఆ కొంపలోను ఏముందీ. ఊరినిండా దోమలు, ఇరుకు సందులు, కొంప నిండా చెట్లు, పుట్టలు. సుఖంగా ఉన్న ప్రాణనికి కోరి కష్టాలు తెచ్చుకోవాటం అంటే ఇదే మరి. నేనూ, పిల్లలు ఆ ఊర్లో ఒక్క క్షణం కూడా ఉండలేం" అన్న జవాబు మా ఆవిడా కాంతి నుండి బాణంలా దూసుకు వచ్చేది. కాంతం పేరల్లా అమెరికా వెళ్లిన తర్వాత కాంతిగా మారిపోయింది. ఎప్పుడైనా మా ఊరి గురించి రెండు ముక్కలు మాట్లాడితే, కాంతి రోజల్లా దానిమీద ఆవేశంగా ఉపన్యాసం ఇచ్చేది.

.

"పోనీ మీ ఊర్లో సెటిలైపోదాం" అని ఏదోవిధంగా ట్రాప్ చెద్దామని ప్రయత్నం చేసేవాడ్ని.

"ఠాట్ వీల్లేదు. ఈ దేశం వదిలి ఒక్క అంగుళంకూడా కదిలి వచ్చే ప్రసక్తేలేదు." అంటూ కాంతి ఖరాకండిగా తేల్చిపారేసేది.

.

అప్పటికి అమెరికా జీవితం పులిస్వారిలాంటిదని చాలసార్లు చేప్పిచూసాను. గుర్రం కంటే పులి గొప్పది కదా అనే వింతవాదన వచ్చేది. అప్పడు మా అమ్మ మాటలు గుర్తుకు వచ్చేవి.

అయినా సరే " ఆరంబింపరు నీచ మానవులు..." అని భర్తృహరి సుభాషితాలలో అన్నట్టుగా , ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే, తన ప్రయత్నాలలో విజయం సాదించి, విజేయుడు కావగలననే నమ్మకం నాకు ఉండేది.

.

చాలాసార్లు శెలవు పెట్డి మా ఊరెళ్ళి కొన్నాళ్ళు ఉండాలని ప్రయత్నం చేసేవాడ్ని. అసలా ప్రయత్నలేవి ఈ నలభై సంవత్సరాలలో సఫలం కాలేదంటే ఎవరికైనా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కాని నా విషయంలో అది నిజం. ప్రయాణ సన్నాహలు చేసుకున్న ప్రతిసారి ఎదో ఒక కొంపలు మునిగిపోయే పని పడ్డం, సూట్ కేస్ మళ్ళీ మూలకి చేరేది. అలాంటి సమయాల్లో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించినా సరే, ఒంటరిగా కూర్చుని మా ఊరి తలపుల్లొకి వెళ్ళి పోయెవాడ్ని. అది ఎంతో ఆనందాన్ని ఇచ్చేది

.

మహరాజవారి కొటకి దగ్గరలోనే మా ఇళ్ళు ఉండేది. మా వీధి ముందునుంచి తిన్నగా తూర్పువైపుగా వెళ్తే అయ్యకోనేరు వస్తుంది. మా వీధి ఎదురుగా బంకులదిబ్బ. ఆ దిబ్బని ఉదయాన్నే కూరలవాళ్ళు అక్రమించుకుంటే, సాయంత్రాలు పిల్లలు ఆడుకునేవారు.

మా వీధి పేరే చాలా తమషాగా ఉండేది. గుండాలవారి వీధి. ఆ ఇంటిపేరు గలవాళ్ళు ఆ వీధిలో మొదట ఇళ్ళు కట్టుకున్నారుట. అప్పట్నుంచీ ఆ వీధికి ఆ పేరు వచ్చింది. ఆ వీధిలో మాదే పెద్ద ఇల్లు. చతురస్రంగా విశాలమైన వారండాలు, వాటిని ఆనుకుని గదులు, మధ్యలో చతురస్రంగా పెద్ద వాకిలి ఉండేది. వాకిలి మధ్యలో తులసికోట, ఓ వార గోళంతో నీళ్ళు ఉండేవి. ఇంట్లోకి రాగానే అక్కడ కాళ్లు కడుక్కొవాలి. తూర్పు వైపు ఉండే వారండాలో ఇంటిచూరుకి ఇనపగోలుసుతో కట్టిన పెద్ద ఉయ్యాల ఉండేది. వెనక పెద్ద పెరడు. నాలుగు కొబ్బరిచెట్లు, జామి, సీతపలం, బొబ్బయి, నారింజ, నిమ్మ, కొబ్బరి చెట్లు,మరో వైపు అన్ని రకలా పూలమొక్కలు ఉండేవి. వర్షాలు పడగానే కూరగాయ విత్తనాలు వేసి, అక్కడే చిన్న పందిరి కట్టేవారు. మళ్ళీ వేసవి కాలం వచ్చేవరకు బంకులదిబ్బకి వెళ్ళి కూరలు తెచ్చే పని ఉండేదికాదు. ఇంటిల్లపాదీ స్నానలు నూతి దగ్గరే, నీళ్ళు తోడుకుని చేసేవారు. నూతి దగ్గర వాడిన నీళ్ళాన్ని, చిన్న చిన్న కాలువలద్వారా మొక్క మొదల్లోకి చేరేవి.

.

అయితే మా ఇంటికి ఇలవెల్పు ఆ ఉయ్యాలే.

ఆ ఉయ్యలంటే ఇంట్లో అందరికి ప్రాణమే. అసలు ఆ మాటకొస్తే చంటిపిల్లలు ఏడుస్తుంటే, వాళ్ళని ఆ ఉయ్యలమీద పడుకోపెడితే చాలు, ఇట్టే ఏడుపుమాని చిరునవ్వు చిందించేవారు. మా నాన్నగారు ఆఫీసునుంచి వచ్చి ఓ అరగంట ఆ ఉయ్యలమీదే సేద తీర్చుకునే వారు. ఆడుకొడానికి పెరడు, వాకిళ్ళు ఉన్న మేం ఎనిమిదిమంది పిల్లలం ఆ ఉయ్యలమీదే ఉండేవాళ్ళం. దానిమీద రకరకల విన్యాసాలు చేసేవాళ్ళం. అందరు కూర్చుంటే, ఒకరు వెనక నిలబడి ఉయ్యలని ఊపాటం, ఉయ్యలమీద కూర్చుని కాళ్ళతో నెట్టకుండా ఉగాటం వంటీ విన్యాసాలు మాకందరికి కొట్టినపిండి మాదిరిగా ఉండేవి. దానికోసం కీచులాటలు,తోపులాటలు, యుద్ధాలు, రాద్దాంతాలు, కోపాలు తాపాలు మా ఇంట్లో మాములే.

"మీ తగవులు తీర్చటం నా వల్ల కాదుబాబు. ఆ షారబుగాడిని పిలిచి, దాన్ని తీసి అవతల పారెయమని చేపుతాను" అంటూ అమ్మ నాలుగు రోజులోసారి చిరాకుపడేది. కానీ అలా చేయదని మాకు తెలుసు. ఎందుకంటే అమ్మ మధ్యాహ్నం భోజనం చేసి ఓ అరగంట ఆ ఉయ్యలమీదే కునుకు తీసేది.

.

"ఒరే పిల్లలు అందరూ ఒక్కసారే ఎక్కి దాన్ని నాశనం చేయకండి. దాని వయస్సు మీ నాయనమ్మ వయస్సు ఒక్కటే. దానికేమైనా అయిందంటే ఆవిడ ఊరుకోరు.ఆ కోపం నామీద చూపెడతారు." అంటూ ఒకొక్కప్పుడు మమ్మల్ని మందలించేది.

రానురాను ఆ ఉయ్యలమీద గిరాకీ తగ్గిపోయింది. చదువులు అయిపోయి, అన్నయ్యలు పై ఊర్లకి అక్కయ్యలకు పెళ్ళిళ్ళు అయిపోయి కాపురాలకి వెళ్ళిపోయారు. వీధిలో పిల్లలుకూడా వేరే ఆటలాడుకునేవారు. ఉయ్యలమీద పూర్తి ఆధిపత్యం నాకే ఉండేది. కాని నా ఒక్కడి బరువు దానికి సరిపోయేదికాదు. నీరసంగా ఊగేది. పండక్కి పబ్బానికి అందరు వస్తే మళ్ళీ ఊయ్యల కలకలలాడుతూ ఉండేది.

.

ఇలోగా చాలా మార్పులు కాలగర్భంలో కలసిపోయాయి. పెద్దన్నయ్య రిటైరై మా ఊరులో స్ధిర పడిపోయాడు. రత్నం అన్నయ్య ఆ ఇంటిని బాగుచేయించి అక్కడే ఉన్నాడు. మళ్ళీ మిగతా అన్నలు, అక్కలు అప్పుడప్పుడు వెళ్తున్నారు. మళ్ళీ ఆ ఇంటికి పూర్వవైభవం వచ్చి, ఆ ఊరుతో మళ్ళీ సంబంధాలు చిగురించాయి.

.

ఇంక నా వల్ల కాదు. మనసుని అదుపుచేసుకోవాటం కుదరని పనే. ఒక్కసారి వెళ్ళి తనివితీరా అనుభూతిని అనుభవించి రావాలి. అందుకోసం ఎదో అబద్ధం ఆడాలి. తప్పదు.

ఆ రోజు ఆఫీసునుంచి వస్తూనే హాడవిడిగా "అన్నయ్యకి ఆరోగ్యం బాగలేదుట. అర్జంటుగా రమ్మనమని ఫోన్ చేసారు. రేపుదయమే ప్రయాణం. బట్టలు సర్దుకో" అంటూ కాంతి మాట్లాడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మర్నాడుదయమే ఫ్లైట్లో బయలుదేరాం. రత్నం అన్నయ్య అంటే కాంతికికూడా గౌరమే. అతని వలనే మంచి సంబంధం కుదిరిందనే అభిప్రాయం ఉంది. అందుకే మారు మాట్లాడకుండా బయలుదేరింది. అబద్ధం అడాను గాని, తర్వాత ఏం చెయ్యాలో అలోచించలేదు. ఓ రోజు విమాన ప్రయాణం, మరో రాత్రి రైలుప్రయాణం చేసి మా ఊరు చేరేసరికి తెల్లవారు ఝాము ఐదు గంటలైంది. అటో ఎక్కి ఇంటికి బయలుదేరాం. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నానెమో చాలా హుషారగా ఉంది. ఊరాంతా చాలా మారిపోయింది. రోడ్లు కాస్తా విశాలంగా ఉన్నాయి. పాత ఇళ్ళు స్ధానంలో అపార్టమెంటులు వచ్చిసాయి. మా వీధిలో కూడా గంజాయి వనంలో తులసిమొక్కలా మా ఇళ్ళు ఒక్కటే పాతవాసనతో కనబడింది. "అదిగో ఆ పెంకుటింటీ దగ్గర ఆపు" అంటూ అటోని ఆపి, ఇద్దరం దిగి, సామాను దింపాం. ఇంటిదగ్గర ఎలాంటి వాతవరణాన్ని చూస్తామో అని ఆందోళనగానే ఉంది. ఇంటిముందు కల్లాపి జల్లి ముగ్గుపెడుతున్న వదినని చూడగానే అమ్మయ్యా అని అనుకున్నాను. ఇద్దర్ని చూడగానే వదిన ఆశ్చర్యపోయింది.

.

"అరే చిన్న! అదేమిటి చెప్పా చేయకుండా షడన్ గా వచ్చిసావు. అందరు బాగున్నారా " అంటూ అప్యాయంగా చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. లోపలకెళ్తునే నా కళ్ళు ఉయ్యల కోసం వేతికాయి. "ఇదిగో మిమ్మల్నే .. ఎవరోచ్చారో చూడండి" వదిన మాటలకీ, ఉయ్యలమీద కూర్చుని తిరుప్పావై పారయణం చేస్తున్న రత్నం అన్నయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. "అరే చిన్న" అంటూ ఉయ్యల దిగి అప్యాయంగా హత్తుకున్నాడు. "మొన్న ఫోన్లో మాట్లడినప్పుడు కూడా నీ ప్రయాణం గురించి చెప్పలేదు. ఇంతా హఠాత్తుగా వచ్చిసావు.ఏం కాలేదుగా" అన్నయ్య కొంచెం అందోళనగానే అడిగాడు. 

.

కాంతితో అబద్ధం ఆడాననే గిల్టీతో ఏం మాట్లాడాలో తెలియలేదు. తిన్నగా ఉయ్యలమీద కూర్చుంటూ "మిమ్మల్ని చూడాలనీ అనిపించి ఉన్నపళంగా వచ్చిసాం" అన్నాను. 

"మంచి పని చేసావ్. రోజున్నర ప్రయణం చేసి వస్తున్నారు. మొహం కడుక్కోండి. స్ట్రాంగ్ కాఫీ తాగితే బడలిక తీరుతుంది." అంటూ నదిన వంటింట్లోకి దారితీసింది. కాంతి కూడా వదినతో లోపలికి వెళ్ళడంతో ఊపిరి పిల్చుకుని ఉయ్యల ఊగుతునే అన్ని పనులు చక్కపెట్టాను.

"ఏం చిన్న. అమెరికాలో ఉయ్యలలు ఉండవా? ఒక్కక్షణం కూడా దాన్ని వదలటం లేదు." వదిన టిపిన్ ఫ్లేటు అందిస్తూ అంది.

.

ఆరోజాంతా సుమారుగా ఉయ్యలమీదే గడిపాను.దానిమీద నిలబడి, కూర్చుని, పడుకుని.. అలా అన్ని బంగిమలలో విన్యాసాలు చేస్తుంటే అందరు ముసిముసిగా నవ్వుకున్నారు.

వారంరోజులు గడిచాయి. కాంతిని తీసుకుని అయ్యకోనేరు, మచ్చకొండ, గంటస్ధంబం, రాజుగారికొట.. అన్ని చూపెట్టాను. ఇంట్లోకి రాగానే ఉయ్యలే నా సింహసనంగా ఉండేది. తలకింద దిండు పెట్టుకుని ఆ ఉయ్యలమీదే పడుకునేవాడ్ని. చిన్నప్పుడు అమ్మవడిలో పడుకున్నట్టే ఉండేది. అమెరికా, ఉద్యోగం, టెన్షల్లు, పిల్లలు .. ఏవి ఙ్ఞాపకం రావాటంలేదు. ఇది శాశ్వతం అయితే ఎంత బావుణ్ణు.

.

ఆ మర్నాడే హైదరాబాదు ప్రయణం. అక్కడో నాలుగు రోజులుండి, అందర్ని చూసి అక్కడ్నుంచి అమెరికా వెళ్ళిపోవాలి. అయ్యో అప్పుడే వారం రోజులు గడిచిపోయాయా.. అనే దిగులు నన్ను ఆవహించింది. కాని విచిత్రంగా ప్రయాణం అంటే నాలుగు రోజుల ముందే బట్టలు సర్దుకునే కాంతి ఇంకా ఆ ప్రయత్నాలు ఏం మొదలెట్టలేదు. ఇంట్లో ఉన్నంతాసేపు పెరట్లో మొక్కల దగ్గర, బయటకి వెళితే గూళ్ళు గోపురాల చూట్టు తిరుగుతూ కాంతి బాగానే కాలాక్షేపం చేస్తుంది.

ఆరోజు మధ్యాహ్నం భోజనాలు అవగానే, నాతోపాటు కాంతికూడా వచ్చి ఉయ్యలమీద కూర్చుంది. ఆ వారం రోజులలో నాతోపాటు కాంతి ఉయ్యలమీద కూర్చోడం అదే మొదటిసారి. ఎదుటవాకిట్లో రత్నం అన్నయ్య వాలుకుర్చిలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. వదిన అక్కడ గుమ్మంమీద తల పెట్టుకుని నిద్రలోకి జారుకుంది. మళ్లీ మా ఊరు ఎప్పుడోస్తానో అనే ఆలోచనలతో పాటు చిన్నప్పటి సంగతులతో నా మనస్సు ఎటో వెళ్ళిపోయింది

,

"ఇదిగో.. మిమ్మల్నే. ఓ మాట వింటారా" అన్నా కాంతం మాటలకి ఒక్కసారిగా లోకంలోకి వచ్చాను.

"అదేమిటోయ్.. నీ మాట ఎప్పుడు వినలేదు" నవ్వుతూ అన్నాను.

"ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండటంలేదు. పోని వీళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారా అంటే అదీలేదు.మరి అకాంటప్పుడు పెద్దవాళ్ళందరు ఒక్క దగ్గరే ఉంటే ఎలా ఉంటుంది."

కాంతి మాటలు నాకర్ధం కాలేదు. ఆ మాటే అన్నాను

.

"అందరూ ఉన్నాసరే, పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాలలో చేర్చెస్తూన్నారు. మనవాళ్ళని మనం చూసుకోకపోతే ఊర్లోవాళ్ళు ఎందుకు చూసుకుంటారు."అంటూ కాంతి చాలా విషయాలమీద ఉపన్యాసం ఇచ్చింది. నేను వింటున్నట్టే ప్రవర్తించాను.

.

"ఇప్పుడు వీళ్ళని చూడండి. లంకంత ఇంట్లో ఇద్దరే ఉండాలి. ఎవరోస్తారా అని రోజు ఎదురు చూస్తారు. రేపు మన పిల్లకు ఉద్యోగాలంటూ ఏ దేశాలకి ఎగిపోతారో మనకి తెలియదు. అప్పుడు మన పరిస్ధితి కూడా అంతే" కాంతి మాటలకి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాను.

"మీరు సంపాదించింది రెండు తరాలకి సరిపోతుంది.ఏం చేసుకోవాలి. కాకిలా కలకాలం బతకడం కంటే కొయిలా హయిగా కొద్దికాలం బతికినా చాలు అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఏమిటో ఈ వారం రోజులలో నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయండి. నేనో మాట అంటాను. కోపం తెచ్చుకోరుగా.." అంటూ కాంతి నా వైపు చూసింది.

.

"కోపం ఒకటీ నా మొహానికి.." నవ్వుతూ అంది.

"ఏంలేదండి. ఇక్కడ ఇప్పుడు అక్కయ్య, బావగారు ఒక్కరే ఉన్నారుగా. వాళ్ళతోపాటు మనంకూడా..." కాంతి మాటలు నాకు మరేం వినబడలేదు.

ఉయ్యాల జోరు పెరిగి నింగిని తాకింది.

అయ్యకోనేరు ఇంకేం మాట్లాడుతుంది??


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!