కఠోపనిషత్ – 6 (June 9)

Vvs Sarma
కఠోపనిషత్ – 6 (June 9)
నచికేతుడు తండ్రినుండి సమాధానంలేక పోవడం వలన "నన్ను ఎవరికిస్తావు? నన్ను ఎవరికి ఇస్తావు" అని రెండోసారి, మూడవ సారి కూడా అడుగుతాడు. "మృత్యవే త్వాదదామి ఇతి". "నిన్ను మృత్యువుకు ఇస్తాను" అన్నాడు తండ్రి. అర్థం కాలేదు నచికేతసునికి. తండ్రి ఏ ఉద్దేశ్యముతో తనని మృత్యుదేవత యైన యమునికి ఇస్తానన్నాడు? అది తాను మూడు సార్లు అడగడం వలన కోపంతో అన్నాడా? యమునికి ఈయడంలో అర్థం ఏమిటి? నన్ను తీసుకున్న యముని కర్తవ్యం ఏమిటి? నేను ఆయనకు ఎలా ఉపయోగిస్తాను? నేనుకూడా నిరుపయోగమైన ఆవు వంటివాడినా? ఇలాంటి అనుమానాలు వచ్చాయని అనుకోవచ్చు. "బహునామేమి ప్రధమో, బహునామేమి మధ్యమః" ఇక్కడనేను అనేకులలో ప్రధమునిగా లేక మధ్యమునిగా ఉన్నాను. అందుచేత నా తండ్రికి నామీద కోపంఉండే అవకాశంలేదు. రైతు పైరును పెంచి, పంట కోసుకుంటాడు. యముడు కూడా అంతే. మనుష్యుడు పెరిగి మృత్యువాత పడతాడు. ఇప్పుడు తనగతి అంతేనా? తండ్రి తనను మృత్యువుకు ఇస్తాను, అంటే దాని అర్థమేమిటి? మానవుని అనిత్యత్వము నచికేతునికి తండ్రిమాట విన్నాక అవగతమైనది.
వైశ్వానరః ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్
తస్మైతాగ్ం శాంతింకుర్వంతి హరవైవస్వతోదకం (క. ఉ. 1.7)

నచికేతనుణ్ణి మొదటపుత్రుడని, తరువాత కుమారుడనీ ఇప్పుడు బ్రాహ్మణుడనీ వ్యవహరిస్తున్నాడు. బ్రాహ్మణుడు వైశ్వానరుడై (అగ్ని రూపంగా) యమసదనం లోనికి ప్రవేశించాడు. "వైవస్వతా (సూర్యునికుమారుడైన యముడా!) నీటిని తెమ్ము" ఇది నచికేతనుడే అడిగి ఉండవచ్చు.
యమలోకంలోని యముని గృహానికి నచికేతుడు ఎలా వెళ్ళాడు? అతిథిగా వెళ్ళాడంటే అతడు మరణించలేదని అర్థం. మరణించిన వారు యమలోకానికి అతిథులు కాదు. వారి ప్రేతాత్మలు అక్కడికి తీసుకురాబడతాయి. ఉదకములు ఎందుకు అడిగాడు? యోగ రహస్యమంతా ఈ మంత్రములోనే ఉన్నది.
బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానమును గురించిన జిజ్ఞాస కలవాడు. నచికేతుడు వాజశ్రవసుని పుత్రుడుగా యమలోకానికి రాలేదు. తండ్రిని తన భవిష్యత్తు గురించి ప్రశ్నించి, తనకు తానుగా యముని వద్దకు జ్ఞానార్థిగా వచ్చాడు. నచికేతుడు అగ్ని రూపముగా వచ్చాడు అంటే భూమితత్త్వంగల భౌతికరూపంతోరాలేదు. భౌతికశరీరంతో ఊర్ధ్వలోకాలకు ఎవరూ రాలేరు. ఎలా వచ్చాడో వివరించాలంటే చాలా పారిభాషిక పదజాలం కావాలి.
"ఆశా ప్రతీక్షే ... యస్య అనశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే" అంటే ఎవరింటికి గృహస్థుడు ఆదరిస్తాడన్న ఆశతో వచ్చిన ఒక బ్రాహ్మణుడు భోజనంచేయకుండా ఉంటాడో, ఆ గృహస్థు పుణ్యసంపద అంటా ఆ అతిథికి పోతుంది. అతిథిసేవ చేయని వానికి పుణ్యలేశము కూడా మిగలదు. ఈ మాటలు యముడే అంటాడని తరువాత మంత్రంతో తెలుస్తుంది. యముడు అంటాడు – “ఓబ్రాహ్మణుడా, నీకు నమస్కారము, నాకు స్వస్తి అగుగాక, నీవు నాఇంట మూడు రాత్రులు భోజనములేకుండ ఉంటివి. దానికి బదులుగా మూడు వరములు అడుగుము” (క. ఉ. 1.8, 1.9). ఉపనిషత్తు ప్రథమ వల్లిలోని ఈ మూడు శ్లోకములకే ఎంతో విశ్లేషణ, వివరణ అవసరమౌతాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!