ఉత్తర హరివంశ కావ్యం.

ఉత్తర హరివంశ కావ్యం.!
.

మ. అ
రి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే
సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై
తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్

పై పద్యం
ఉత్తర హరివంశ కావ్యం లోనిది.
నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం.
శ్రీకృష్ణుడు నరకాసురునిపై యుద్ధానికి పోతూ తోడుగా సత్యభామను గూడా తీసుకువెళతాడు. నరకాసురుని రాజధానిని చేరీ చేరగానే పట్టణానికి రక్షగా ఉన్న రాక్షసులందరినీ చంపి, ఆ తరువాత ఇతర రాక్షస వీరులు రాగా వారితోనూ యుద్ధం చేస్తూ, మూర్ఛ పోయి, సేదదీరి లేచి సత్యభామతో, నువ్వూ సంగ్రామాన్నే కోరావు గదా, ఇప్పుడు అవసరం వచ్చింది. ఇదిగో శార్ఙ్గము అంటూ తన ధనుస్సును ఆమె చేతికి ఇస్తాడు. ఇది ఆమె నరకాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆమె సంరంభాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం.

స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది. ఆమె అటు అరిని (శత్రువుని) చూస్తున్నది. అతని మీద బాణ పరంపర కురిపిస్తున్నది. ఇటు హరిని చూస్తున్నది. అతనిపై చిరునవ్వులను చిందిస్తున్నది. ఈ రెండు పనులూ ఒక హేలావిలాసంగా నిర్వహిస్తున్నది. ఆ సందర్భంలో ఆమె పయ్యెద కొంగు కొంచెం తొలిగింది. మెడలోని మందారమాల లోని పువ్వుల నుంచి తేనె సొనలు కురిసి ఆమె వక్షస్థలాన్ని చిత్తడి గావిస్తున్నాయి. ఇదీ దృశ్యం. ఆమె సౌందర్యమూ, శృంగారమూ, వీరమూ, చిరునవ్వుల జల్లూ, మెడలోని మందారదామం లోని మకరందాల ధార, కొంచెంగా తొలగిన పైటకొంగు — ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని ఈ పద్యంలో రూపు కట్టించాడు సోమన కవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!