పారిజాతాపహరణం.........శ్రీ కృష్ణుని సంసార విభూతి.

పారిజాతాపహరణం.........శ్రీ కృష్ణుని సంసార విభూతి.

- నంది తిమ్మన

హరి నరకాసురుం గెలిచి యద్దనుజేంద్రుని యింట నున్న య
చ్చరల కొలంబు వారి, నెలజవ్వనముం బొలివోని వారిఁ, ద
న్వరునిఁగఁ గోరు వారి, లలనామణులం బదియాఱు వేవురం
బరిణయ మయ్యె నారదుని పంపున సౌఖ్య రసైక లోలుఁడై |చ| [38]

మఱియు రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్ర
వింద, భద్ర, సుదంత, కాళింది, లక్ష
ణ యనఁగా మున్న కల రబ్జనాభునకును
మహిషు లెనమండ్రు సమతాభిమానవతులు |తే| [38]

ఆ రమణీ లలామల నందఱఁ గూడి యదూద్వహుండు త
ద్ద్వారవతీ పురోపవన వాటికలం, గ్భతకాద్రి సీమల
న్వారిధి తీర కుంజ నద నదంబులఁ, గేళి తరంగిణీ తటీ
కైరవిణీ సహాయ మణికల్పిత సౌధముల న్వసించుచున్ |ఉ| [39]

ఏయేవేళల నేసరోజముఖి యేయేలీలలం గోరుఁ దా
నాయావేళల నాసరోజముఖి నాయాలీలలం దేల్చి, యే
చాయం జూచినఁ దానయై మెలఁగుచున్ సౌఖ్యాబ్ధి నోలాడు భో
గాయత్తుండయి పెక్కు రూపముల మాయా కల్పనా చాతురిన్ |శా| [40]

హరి యిట్లు సతుల నందఱ
సరిగాఁ జూచియును, భోజ జనపాల సుతం,
దరుణీమణి సాత్రాజితి
నిరువుర మన్నించి మిగుల నిచ్చుం జనవుల్ |క| [41]

కులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునీ
వల నల రుక్మిణీ రమణి వాసిఁ బెనంగఁగ, సత్యభామయుం
గులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునా
వలఁ బచరింపఁగా, రవరవ ల్వొడమె న్మది వారి కెంతయున్ |చ| [42]

అంతట నొక్కనాఁడు ధవళాంబుజ నేత్రుఁడు వచ్చి రుక్మిణీ
కాంత గృహంబులోన శశికాంత శిలామయ వేదిక మీఁద నే
కాంతమునందుఁ గొందఱు మృగాయతనేత్రలు గొల్వ, జూద మ
త్యంత వినోద కేళిమెయి నాడుచు నుండఁగ నద్భుతంగన్, |ఉ| [43]

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!