గజేంద్రమోక్షం

పోతనామాత్యుల భాగవతంలో నాకు అమితంగా ఇష్టమైన ఘట్టం
గజేంద్రమోక్షం. అందులోనూ ఆయన తేటతెలుగులో రాసిన ఈ కింది పద్యాలు విన్నా.. చదివినా... ఒళ్లు పులకరించిపోతుంది.

లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్చవచ్చె, దనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నిత:పరంబెఱుగ, మన్నింపదగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భధ్రాత్మకా!

భావం: పోరాడి పోరాడి నా బలం తగ్గిపోయింది. ధైర్యం నశించింది. ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. ఇక పోరాడలేను. నీవు తప్ప నన్ను రక్షించేవారు ఎవరూ లేరు. పరమేశ్వరా.. నన్ను రక్షించు. అని ఆ గజేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తున్నాడు.

అలా గజేంద్రుడు తనలోని ఆశలు సన్నగిల్లే వేళ.. ఇలా అంటున్నాడు

కలడందురు దీనుల యెడ
గలడందురు పరమయోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
గలడు గలండనెడివాడు గలడో లేడో

భావం: ఎంతగానో ప్రార్థించిన గజరాజుకు ఆ భగవంతుడు కనిపించకపోయేసరికి... తనను కాపాడేందుకు రాకపోయే సరికి సందేహం కలిగి.. దీనుల పాలిట సంరక్షకుడు, యోగులకు సన్నిహితుడు, అన్ని దిక్కులకు వ్యాపించి ఉన్నవాడైన దేవుడున్నాడని చెబుతారు కదా? నిజంగా అలాంటి వాడున్నాడా? లేదా? అని ఆఖరి ప్రయత్నంగా ఆ శ్రీహరిని ప్రార్థించాడు.

ఆ ప్రార్థనలు విన్న శ్రీహరి గజేంద్రుడిని కాపాడేందుకు ఎలా వస్తున్నాడో పోతనవారు చక్కగా వర్ణించారు.

సిరికంజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధిపడే
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై

భావం: శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని రక్షించేందుకు భార్యయైన లక్ష్మీదేవితో చెప్పలేదు. శంఖ, చక్రములను ధరింపలేదు. పరివారం సంగతి, వాహనం సంగతి కూడా ఆలోచించలేదు. అంతెందుకు ముఖంపై పడుతున్న గిరిజాలను చేతులతో సర్దుకోలేదు. ఏదోవాదులాటకు పట్టుకున్న లక్ష్మీదేవి పైట చెంగును కూడా వదలకుండా లాక్కొని పోతున్నాడు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!