వేదాల్లో నెయ్యి గురించి ఏం చెప్పారు?

Mang Venkataramarao
వేదాల్లో నెయ్యి గురించి ఏం చెప్పారు?
............................................
మనం తినే పదార్ధాల్లో నేతికంటే రుచికరమైంది, ఘుమఘుమలాడేది ఇంకోటి లేదు. ఏ కూర, పచ్చడి వేసుకున్నా కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ రుచే వేరు. ఇంత రుచికరమైన, ఖరీదైన నేతిని హోమాలు, యజ్ఞయాగాదుల్లో వేస్తారని మనందరికీ తెలుసు. అగ్నిలో నేతిని వేయడాన్ని గురించి వేదాలు ఎంతో ఘనంగా వర్ణించాయి. నేతిని ''ఆజ్యం'' అని ''ఘ్రుతం'' అని కూడా అంటారు. ఇంతకీ వేదాల్లో ఆజ్యం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం.

వేదాలు ఆవునేతినే శ్రేష్ఠమని చెప్పాయి. గేదె పాలతో తయారైన నేతి కంటే ఆవుపాల నుండి వచ్చిన నేయి ఉత్తమమైంది. ఈ ఆవునేయి లేత పసుపురంగులో ఉంటుంది. తాజా వెన్నను కాచి నేయి తయారుచేస్తారు.

హోమం, యాగం, యజ్ఞం, అగ్నిహోత్రాల్లో ఆజ్యం పోయడం దండగని, చాదస్తం అని కొట్టి పడేసేవారున్నారు. నేయి మొదలైన సమిధలను అనవసరంగా అగ్నిలో వేసి తగలెయ్యడమేనని, దీనివల్ల ఒరిగేదేమీ లేకపోగా ఎంతో డబ్బు నష్టమని కొందరు వాదిస్తూ ఉంటారు.

నిజానికి ప్రకృతిలో ఉన్నవన్నీ మన స్వార్థం కోసమే కాదు. కొన్నిటిని తిరిగి ప్రకృతికే అర్పించాలి. అలా చేయడం ఆయా వస్తువులు, పదార్ధాలను నిరవర్ధకం చేసినట్లనుకుంటే పొరపాటు. ఆయా పదార్ధాలను అక్షరాలా సార్ధకం చేయడం అవుతుంది. ఇలా అగ్నిదేవునికి ఆహుతి చేయడంవల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది.

తరచుగా అగ్ని హోమాలు చేసి ఆజ్యాన్ని పోయడంవల్ల పొగ వ్యాపిస్తుంది. అది మనలో అనారోగ్యం తలెత్తకుండా చేస్తుంది. అనేక కారణాలవల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారిస్తుంది. అతివృష్టి, అనావృష్టి లాంటి అపసవ్యతలు లేకుండా చేసి వాతావరణ సమతుల్యతకు దారితీస్తుంది. నేతిని అగ్నిలో వేయగా వచ్చే ధూమంవల్ల వాతావరణంలో ఉన్న కాలుష్యం నివారించబడుతుంది. అణుశక్తి కారణంగా జనించే అనేక బాధలు తగ్గుతాయి.

ఘ్రుతాన్ని అగ్నికి సమర్పించడంవల్ల చెట్లు, పశుపక్ష్యాదులకు మేలు జరుగుతుంది. భూమి సారవంతం అవుతుంది. పంటలు సమృద్ధిగా పండుతాయి. స్వచ్చమైన గాలి అందుతుంది. హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి.

అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది.

అగ్నిలో ఒక మిరపకాయను వేసినట్లయితే గొట్టు వస్తుంది, అది దగ్గు మొదలైన తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతుంది. అదే గనుక ఆజ్యం వేసినట్లయితే లోపలి అనారోగ్యాలు నయమౌతాయి.

యజ్ఞయాగాదుల్లో సమిధలు వేయడంవల్ల అదంతా దైవార్పితం చేసినట్లు అవుతుంది. ఒక వస్తువు లేదా పదార్ధాన్ని అగ్నికి సమర్పిస్తున్నాం అంటే అందులో మన భక్తిప్రపత్తులు, గౌరవం, కృతజ్ఞత, త్యాగం, ప్రేమ, దయ, నిస్స్వార్ధం, సహనం - ఇన్ని గొప్ప లక్షణాలు మనలో ఉన్నట్లు. వాటన్నిటినీ వ్యక్తం చేస్తున్నాం అన్నమాట.

ఆవునేతిని భోజనంలో కొద్దిగా వేసుకోవడంవల్ల ఆహారం నోటికి మరింత హితవుగా ఉంటుంది. నేతివల్ల గ్రహణశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పుష్కలంగా ఉంటుంది. బలం చేకూరుతుంది. ఆయుస్షు పెరుగుతుంది. కంటికి శ్రేష్ఠం. శరీరంలో కోమలత్వం వస్తుంది. స్వరం మృదువుగా తయారౌతుంది.వాత పిత్త దోషాలను, జ్వరం, ఉన్మాదం మొదలైన అనారోగ్యాలను తక్షణం పోగొడుతుంది. ఆకలి మందగించినప్పుడు సొంటి పొడి లేదా మిరియాలపొడిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ సమస్య వెంటనే నివారణ అవుతుంది. అరుగుదల బాగుంటుంది. అజీర్తి సమస్యలు తలెత్తవు.

హోమంలో కల్తీ నెయ్యి లేదా వనస్పతి నెయ్యి వేయడంవల్ల ప్రయోజనం లేదు. మన మహర్షులు స్వచ్ఛమైన ఆవునేతిని యజ్ఞయాగాదులలో ఉపయోగించమని స్పష్టంగా చెప్పారు. అప్పుడే అది ఆశించిన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఉదకాన్ని వదిలితే అది పితృయజ్ఞం అవుతుంది. పెద్దలు చనిపోయినప్పుడు భూతములకు (దెయ్యాలు, భూతాలూ కావు.. కాకులకు బలి ఇవ్వడం) అన్నం పెట్టడం భూతయజ్ఞం అనిపించుకుంటుంది. వేదపుంగవులు, పండితోత్తములకు అన్నం పెడితే అది మనుష్య యజ్ఞం అవుతుంది. మంత్ర పఠనాన్ని బ్రహ్మ యజ్ఞం అంటారు.

ఏనాడో మన మహర్షులు అగ్నిలో ఆజ్యం వేయడంవల్ల కాలుష్య సమస్యలు నివారణ అవుతాయని, వర్షాభావం, మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి, దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పిన అంశాన్ని ఇన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆధునిక విజ్ఞానం ఆ సూత్రీకరణలు నిజమని నిర్దారిస్తోంది. రష్యా శాస్త్రవేత్తలు మంటల్లో నెయ్యి వేయడంవల్ల పొగ, మొదలైన వాటివల్ల కలిగే వాతావరణ కాలుష్యం పోతుందని ప్రకటించారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!