ఉపనయనము.

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!